కేసీఆర్, రేవంత్ లపై ఏకకాలంలో విమర్శల దాడి.. కవిత దూకుడు.!
Publish Date:Sep 22, 2026
Advertisement
తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భూముల విషయంలో రేవంత్ అసెంబ్లీ వేదికగా వెల్లడించిన అంశాల నేపథ్యంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ గడ్డపై తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ అట్మాస్ఫియర్ లో హీట్ పెంచేశాయి. కొడంగల్ లో ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప సభకు హాజరైన కవిత.. ఎటువంటి శషబిషలు లేకుండా చేసిన ఈ ప్రసంగం హాట్ టాపిక్‌గా మారింది. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న ఊహాగానాలు మరియు విమర్శలకు కవిత ఈ వేదిక ద్వారా విస్ప ష్టంగా క్లారిటీ ఇచ్చారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే తనను ఎవరో వదిలిన బాణంగా అభివర్ణిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్న కవిత.. . తాను ఎవరికోసమో పనిచేసే వ్యక్తిని కాదని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికీ సరైన అధికారానికి, నాణ్యమైన విద్యకు దూరంగా మగ్గిపోతున్న బహుజన సమాజం తరఫున తాను గళమెత్తుతున్నానని ప్రకటించిన కవిత.. యువత ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తూ, వారి హక్కుల కోసం ఎవరితోనైనా పోరాడేందుకు వెనుకాడబోనన్నారు. ఈ సందర్భంగా ఆమె దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సొంత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్లను కూడా ప్రస్తావించి విమర్శలు గుప్పించారు. బహుజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే మోడీతోనైనా, రేవంత్ రెడ్డితోనైనా, చివరికి కేసీఆర్‌తోనైనా ఢీ కొంటానన్నారు. కేసీఆర్ హయాంలో ఆశించిన స్థాయిలో మార్పులు రాలేదని, ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరగలేదని కవిత నిష్కర్షగా ఎలాంటి మొహమాటానికీ తావివ్వకుండా చెప్పారు. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన సభలో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైన కవిత.. కొడంగల్ సభలో మాత్రం.. తనపై వస్తున్న విమర్శలకు దీటుగా బదులిచ్చారు. ముఖ్యంగా గులాబీ పార్టీకి అనుబంధంగా నడుస్తున్న సోషల్ మీడియా వేదికలు, గ్రూపుల ద్వారా తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఖండించారు. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే.. మరోవైపు కేసీఆర్ పై కూడా ఆమె విమర్శల గళం విప్పడం విశేషం. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూనే ప్రత్యర్థులపై విమర్శల దాడిని పెంచిన కవిత రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Kalvakuntla Kavitha, Kodangal Meeting, Panchajanya Sankalpa Sabha, Telangana Politics, Revanth Reddy, KCR, Modi, Telugu One]
http://www.teluguone.com/news/content/kalvakuntla-kavitha-24-232117.html




