నిరుద్యోగులతో జగన్ డేంజర్ గేమ్.. డీఎస్సీ చుట్టూ పొలిటికల్ ట్రాప్!
Publish Date:Jun 6, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాలు ఒక ప్రమాదకరమైన మలుపు తీసుకున్నాయి. దాదాపు 16వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యువతకు ఈ రిక్రూట్‌మెంట్ ఊరటనిచ్చిందనడంలో సందేహం లేదు. అయితే దీనిని అభినందించాల్సింది పోయి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ కో దీని చుట్టూ కొత్త రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు. డీఎస్సీ పరీక్షల్లో విఫలమైన లక్షలాది మంది నిరుద్యోగ యువతలో ఉండే సహజమైన అసంతృప్తిని, నిరాశను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజంలో ఉద్రిక్తతలు మరియు విభేదాలు సృష్టించేలా సాగుతున్న ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ జగన్ నైజానికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైనా ఒక భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినప్పుడు పోస్టుల సంఖ్య ఎప్పుడూ పరిమితంగానే ఉంటుంది. తాజా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో కేవలం 16,000 పోస్టులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కానీ, ఈ పరీక్ష కోసం దాదాపు 4 నుండి 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాశారు. అంటే, సహజంగానే మిగిలిన నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు ఈ పోటీలో విజయం సాధించలేకపోయారు. పగలు, రాత్రి కష్టపడి చదివి, తృటిలో ఉద్యోగం కోల్పోయిన ఆ నిరుద్యోగుల మనసుల్లో ఉండే బాధను, ఆవేదనను వైసీపీ అధినేత తన రాజకీయ లబ్ధి కోసం అస్త్రంగా మార్చుకుంటున్నారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందనే ఒక తప్పుడు ప్రచారాన్ని నిరుద్యోగుల బుర్రల్లోకి ఎక్కించడం ద్వారా, ప్రస్తుత ప్రభుత్వంపై వ్యతిరేకతను సృష్టించాలన్నది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. వైసీపీ శ్రేణులు కేవలం మీడియా వేదికగా ఆరోపణలు చేయడమే కాకుండా.. ఉద్యోగాలు రాని అభ్యర్థులను ఒక పెద్ద ట్రాప్‌లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టుల్లో పిటిషన్లు వేయాలని నిరుద్యోగులను వైసీపీ రెచ్చగొడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు అంతేకాకుండా.. భవిష్యత్తులో వైపీపీ అధికారంలోకి వచ్చాక మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ నిరుద్యోగులకు నమ్మశక్యం కాని ఆశలు చూపిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. జీవితంలో స్థిరపడాల్సిన యువతను ఇలా తప్పుడు కేసుల వైపు, రాజకీయ బురదజల్లుడు వైపు నడిపించడం అంటే వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ఇక అందుబాటులో ఉన్నడేటాను బట్టి చూసే.. వైసీపీ నేత, ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిలబడటం లేదు. నిజంగానే డీఎస్సీలో అక్రమాలు జరిగి ఉంటే, లేదా పేపర్ లీక్ లాంటివి నిజమై ఉంటే దానికి సంబంధించిన పక్కా ఆధారాలను ప్రతిపక్షం కోర్టుల ముందు గానీ, ప్రజల ముందు గానీ ఉంచాలి. కానీ.. వైసీపీ అనుకూల మీడియా, ఆ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆ పని చేయడం లేదు. ప్రభుత్వం ప్రతి అభ్యర్థి సాధించిన మార్కులను, వారి ర్యాంకులను, స్పోర్ట్స్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ వివరాలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందరికీ అందుబాటులో ఉంచింది. దీనివల్ల వైసీపీ ఏ అభ్యర్థి పేరు ఎత్తి అన్యాయం జరిగిందని ప్రచారం చేసినా.. ఆ అభ్యర్థి అర్హత, అనర్హత నిముషాల్లో ఆన్‌లైన్ డేటా ద్వారా నిరూపితమవుతోంది. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం నిరుద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని పరిశీలకులు అంటున్నారు. జగన్ రెడ్డి ఈ తరహా విచ్ఛిన్నకర రాజకీయం భవిష్యత్తులో రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ ఉద్యోగ నియామక వ్యవస్థకే గొడ్డలిపెట్టుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రతిసారి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. కేవలం రాజకీయ కారణాలతో నోటిఫికేషన్లను వివాదాస్పదం చేస్తూ, కోర్టుల చుట్టూ తిప్పితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ కొత్త ఉద్యోగాలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే ధైర్యం చేయదు. ఫలితంగా రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయి నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
http://www.teluguone.com/news/content/jagan--dangerous-game-with-the-unemployed-36-222063.html





