క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును 15ఏళ్లకుర్రోడు బ్రేక్ చేసేశాడు!
Publish Date:Jun 6, 2026
Advertisement
క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును 15ఏళ్ల యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేయనున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం(జూన్ 6) ముంబైలో సమావేశమై టీ20 జట్టును ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఈ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని విస్మయ పరిచాయి. వచ్చే టీ20 ప్రపంచకప్ సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని యువ రక్తాన్ని ప్రోత్సహించే వ్యూహంతో సెలక్టర్లు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌పై సెలక్టర్లు వేటు వేయడమే కాకుండా, ఆయనను జట్టు నుంచే తప్పించారు. అలాగే.. ఐపీఎల్ 2026 సీజన్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు. ఇక తెలుగుతేజం, యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించారు. వీటన్నిటినీ మించి కేవలం 15 ఏళ్ల వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీకి టీ20 స్క్వాడ్ లో చోటు దక్కింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఈ బీహార్ కుర్రాడు పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఈ సీజన్ లో ఏకంగా 772 పరుగులు చేసి ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సాధించడమే కాకుండా, తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో ఏకంగా 62 సిక్సర్లు బాది అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ అసాధారణమైన ఘనతతో కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే భారత సీనియర్ జట్టుకు ఎంపికై, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 36 ఏళ్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అత్యంత పిన్న వయసులో టీమిండియాకు ఎంపికైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి టీమిండియా ఎంపికలో పూర్తిగా ఐపీఎల్ 2026 ప్రదర్శనే అత్యంత కీలకంగా మారింది. ఐపీఎల్ లో నిలకడగా రాణించిన ఎందరో యువ ఆటగాళ్లకు ఈ పర్యటనల్లో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. బౌలింగ్ విభాగంలోనూ సెలక్టర్లు సరికొత్త ప్రయోగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున ఆడి, 16 వికెట్లతో మెరిసిన అద్భుత పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు తొలిసారి భారత జట్టులో స్థానం కల్పించారు. వీరితో పాటు సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తదితరులు ఈ మూడు కీలక పర్యటనల టీ20 స్క్వాడ్స్‌లో తమ చోటును దక్కించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్ ను పక్కన పెట్టి, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో, వైభవ్ సూర్యవంశీ లాంటి యంగ్ సెన్సేషన్ తో రంగంలోకి దిగుతున్న ఈ సరికొత్త యంగ్ టీమిండియా భవిష్యత్తులో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/15-year-old-boy-broken--record-of-thecricket-god-sachin-36-222066.html





