బహ్రెయిన్ లోని అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ దాడి.!
Publish Date:Jul 21, 2026
Advertisement
పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న ప్రతీకార దాడులు గల్ఫ్ రీజియన్ ను అగ్నిగోళంలా మార్చేశాయి. అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా వ్యాప్తంగా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జార్డన్ భూభాగంలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. నాసర్ 2 అనే పేరుతో చేపట్టిన ఈ రహస్య సైనిక ఆపరేషన్ ద్వారా శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడి ఫలితంగా అక్కడ పనిచేస్తున్న అత్యాధునిక రాడార్ నియంత్రణ వ్యవస్థలతో పాటు విమాన నిల్వ కేంద్రాలలో సిద్ధంగా ఉన్న ఎఫ్ 15 పోరాట విమానాలుధ్వంసమైనట్లు సమాచారం. ముఖ్యంగా రుక్బాన్ సరిహద్దు ప్రాంతంలో నెలకొల్పిన ప్రధాన అమెరికన్ సైనిక ప్రాంగణంపై జరిగిన క్షిపణి దాడుల ధాటికి పలువురు అమెరికా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రకటించింది. అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు. మరోవైపు కువైట్ లో కూడా ఇరాన్ బలగాలు ఆపరేషన్ లైట్నింగ్ ప్రత్యేక దాడి చేశాయి. ఈ దాడిలో కువైట్‌లోని అమెరికన్ మిలిటరీ క్యాంపులైన అరిఫ్జాన్, అహ్మద్ అల్-జాబర్ ఎయిర్ బేస్‌లలో ఏర్పాటు చేసిన ఎయిర్ డిఫెన్స్ కవచాలు, కమ్యూనికేషన్ టవర్లు, రాకెట్ లాంచర్ వ్యవస్థలను ధ్వంసం అయినట్లు సమాచారం. ఇంకా అలీ అల్-సలేమ్ ఎయిర్ బేస్‌లోని రీపర్ డ్రోన్ నిల్వ కేంద్రంపై జరిపిన దాడిలో అనేక అధునాతన నిఘా , దాడి డ్రోన్లు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. ఇరాన్ అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం ఆరంభమైందని ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా తన దళాలను, మిలిటరీ సామాగ్రిని పూర్తిగా ఉపసంహరించుకునే వరకూ తమ ప్రతిదాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. US Iran War, Gulf Conflict Escalation, Amazon Data Center Attack Bahrain, Jordan US Military Base Strike, Middle East Tension
http://www.teluguone.com/news/content/iran-attacks-amazon-data-center-in-bahrain-36-226678.html




