ప్రత్యేక హోదా పై ఆ ముగ్గురు నోరెత్తట్లేదుగా? మళ్లీ అదే డ్రామానా!

2014, 2019 ఏపీ ఎన్నికలలో ప్రత్యేక హోదా ప్రముఖ అంశం అయింది కానీ, 2024 ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఆ అంశాన్నే ప‌క్క‌న పెట్టేశాయి.  ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌ గానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గానీ, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గానీ ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించడం లేదు.  25 ఎంపీల్లో 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ సిఎం జ‌గ‌న్ తాను ఇచ్చిన‌ హామీని నిలబెట్టుకోలేదు. రాష్ట్రానికి హోదా సాధించడంలో జగన్ వైఫల్యాన్ని ఎత్తిచూపడంలో టీడీపీ, జనసేన పార్టీలు గ‌ట్టిగా నిల‌బ‌డ‌డం లేదు. ఎందుకంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, టీడీపీ, జనసేనలు మిత్రపక్షం కాబట్టి.  గత రెండు ఎన్నికల్లో ఇది కీలకమైన అంశంగా మారగా, ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశంగా మారింది.   అయితే అంతగా ప్రాధాన్యం లేని కాంగ్రెస్ పార్టీ, అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌ ప్ర‌త్యేక హోదా అంటూ జ‌పం చేస్తున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ బలం పెరుగుతుందన్న గ్యారెంటీ లేదు.  అయినా కాంగ్రెస్ పుంజుకునే సూచనలు కనిపించడం లేదు.  ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, సీట్లు వస్తాయా, రావా, అనే విషయాన్ని పక్కనపెడితే, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హోదా విషయంలో హామీ ఇవ్వడం మాత్రం విశేషమే.  ప్రత్యేక హోదా ప్రకటన విషయంలో ఆనాడు బీజేపీ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలుసు. హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేసిన ఆ నోళ్లు, ఆ తర్వాత మూతబడ్డాయి.  ఏపీలో కాంగ్రెస్ కి పట్టినగతే బీజేపీకి కూడా పట్టింది.  ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ ఎప్పటికీ నెరవేర్చదనే విషయం తేలిపోయింది. ఏపీలో మొత్తానికి మొత్తం లోక్ సభ సీట్లు ఒకే పార్టీకి వచ్చినా ఆ పార్టీ పార్లమెంట్ ముందు తొడగొట్టే అవకాశం లేదు. కేంద్రాన్ని మెడలు వంచేంత సీన్ లేదని ఈపాటికే ఏపీ ప్రజలకు తెలిసొచ్చింది.  అందుకే  నేతలంతా హోదాపై రాజీ పడటంతో ప్రజలు కూడా హోదాపై ఆశలు వదులుకున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. ప్రత్యేక హోదా  గురించి మాట్లాడుతుంటే జ‌నం వింతగా చూస్తున్నారని  వైఎస్ షర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌డిచిన పదేళ్లలో ప్రత్యేక హోదా కోసం ప్ర‌ధాన పార్టీలు పోరాటాలు చేయ‌లేద‌ని ఆమె ఆరోపించారు.   ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని.. ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ కృషి చేస్తుందని ష‌ర్మిల చెబుతున్నారు. 10 ఏళ్లు దాటిన ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాలు అభివృద్ది దూసుకెళుతుంటే.. ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆంధ్ర అభివృద్ధికి మోదీ హామీ ఇచ్చారని.. అయితే ఏ ఒక్క హామీ సైతం నెరవేరలేదని ష‌ర్మిల చెబుతున్నారు. ఏపీ ప్రత్యేక హోదా, రాజకీయ వివాదంగా మారి ప‌దేళ్ళైంది. అప్పుడు అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టకుండా ప్రధాని చేత నోటి మాట అనిపించి మమ అనిపించారు. ఆ తరువాత వచ్చిన బీజేపీకి అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసింది. రాజకీయ సుడిగుండంలో త‌మ అవసరాల మేరకు ప్ర‌ధాన పార్టీలు ప్ర‌త్యేక హోదా ఈ అస్త్రాన్ని వాడుకుంటున్నాయి.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 27, 2024 3:57PM

జలగన్నకి జలగ లేఖ!

నమస్తే జలగన్నా. అలియాస్ జగనన్నా. నాపేరు జలగశ్రీ. నువ్వేమో సింబాలిక్ జలగవి.. నేనేమో రియల్ జలగని! నేను ఈమధ్యే పుట్టాను. నేను రక్తం పీల్చడానికి ట్రై చేస్తున్నప్పుడు అంత టాలెంటెడ్‌గా పీల్చలేకపోతున్నాను. దాంతో మా పెద్దలందరూ నా మీద చాలా సీరియస్ అవుతున్నారు. జలగ పుటక పుట్టి జలగలాగా రక్తం పీల్చలేకపోవడం దారుణమని అన్నారు. మనిషిలాగా పుట్టి జలగలా జనం రక్తం పీలుస్తున్న నీ దగ్గర్నుంచి మన జలగ జాతి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయని చెప్పారు. నువ్వు జనం రక్తం ఎలా పీల్చావో మా పెద్దలు వివరిస్తుంటే విని, నాకు జలగ జన్మ మీదే విరక్తి కలిగింది. నువ్వు ఇంత బాగా జనం రక్తం పీల్చుతున్నావు కాబట్టే నిన్ను అందరూ ప్రేమగా ‘జలగన్నా’ అని పిలుస్తున్నారని అర్థమైంది. నువ్వు జనం నుంచి ఏయే పద్ధతుల ద్వారా వాళ్ళ రక్తం పీల్చావో మా పెద్దలు చెబుతుంటే, నాకు లీటర్ రక్తం ఒకేసారి తాగినంత ఆనందం కలిగింది. నీ రక్తం పీల్చుడు చరిత్రని మావాళ్ళు చెప్తే విని తరించాను. అవి నేను మరోసారి నీముందు ప్రస్తావించి తరించాలని అనుకుంటున్నాను. -- ‘రక్తం’తో లింకు వున్న రెండు సంఘటనలను క్రియేట్ చేయడం ద్వారా లాస్ట్ టైమ్ నువ్వు అధికారంలోకి వచ్చావంటగా. -- వచ్చీరాగానే రాజధాని రైతుల రక్తాన్ని పీల్చావంటగా. -- ఐదేళ్ళపాటు దిక్కుమాలిన మద్యంతో జనం రక్తాన్ని జుర్రేశావంటగా. -- రోడ్లు వేయకుండా జనాన్ని హింసించింది, ఆ రోడ్ల కారణంగా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నీ రక్త దాహాన్ని తీర్చుకున్నావంటగా. -- వందలాది మంది రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం నీ రక్తదాహమేనంటగా. -- పారిశ్రామికవేత్తల రక్తాన్నీ పీల్చి వాళ్ళు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశావంటగా. -- పన్నులతో, ఛార్జీల పెంపుతో, అవినీతి, అక్రమాలతో జనం రక్తాన్ని స్ట్రా వేసి లాగేశావంటగా. -- ఇసుక, గనులు, కొండలు... ఇలాంటి ప్రకృతి వనరులని పీల్చి పిప్పిచేశావంటగా. -- భారీ సంఖ్యలో దాడులు, రక్తపాతాలతో నీ రుధిరదాహం తీర్చుకున్నావంటగా. -- లక్షల కోట్లు అప్పులు చేసి, జనాన్ని రుణగ్రస్థుల్ని చేసి, తరతరాల ప్రజల రక్తాన్ని ఎలా స్వాహా చేశావో తెలిసింది. .... ఇలా చెప్పుకుంటూ వెళ్తే ‘జలగన్న’ రక్త చరిత్రలో ఇంకా ఎన్నో ఎన్నెన్నో హైలైట్స్ తెలుసుకుని తరించాను. నీ దగ్గరకి వచ్చి రక్తం పీల్చడం ఎలా అనే పాఠాలు నేర్చుకోవాలని నాక్కూడా వుందిగానీ, నువ్వు నా రక్తాన్ని కూడా పీల్చేస్తావని భయపడి నీ దగ్గరకి రావడం లేదు.. బైబై జలగన్నా.
Publish Date: Apr 27, 2024 2:59PM

 పల్నాటి బొబ్బిలి బ్రహ్మానందరెడ్డి రాకతో మాచర్లలో టిడిపి గెలుపు ఖాయం 

పౌరుషానికి మారు పేరు పల్నాడు. అయితే జగన్ ప్రభుత్వంలో పల్నాడు ప్రాంతాన్ని అన్ని విధాల  దోచుకుంటున్న వారికి తగిన బుద్ది చెప్పడానికి గుంటూరు జిల్లా మాచర్ల నియోజక వర్గ టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి నడుంబిగించారు. పల్నాడు పౌరుషం, ఆత్మాభిమానం నిలువెల్లా నిండి ఉన్న జూలకంటికి జనం జేజేలు కొడుతున్నారు. పల్నాడు ప్రాంతంలో జూలకంటి పేరు చెబితేనే జనం కేరింతలు  కొడుతున్నారు. జూలకంటి మాతృమూర్తి దుర్గాంబ కూడా ఇదే నియోజకవర్గం నుంచి విశేష సేవలందించారు. ఆమె గుడ్ విల్   బ్రహ్మానందరెడ్డి గెలుపుకు దోహదపడనుంది.  1999లో మాచర్ల నియోజకవర్గంలో టిడిపి జెండా ఎగరడానికి ప్రధాన కారణం దుర్గాంబ. అయితే ఈ సారి కూడా టిడిపి జెండా ఎగరేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. తల్లిదండ్రులిద్దరూ ఎమ్మెల్యేగా సేవలందించడంతో బ్రహ్మనందరెడ్డికి సానుకూలాంశం. బ్రహ్మానందరెడ్డి  తండ్రి జూలకంటి నాగిరెడ్డి 1972 లో స్వతంత్ర అభ్యర్థిగా మాచర్ల శాసనసభకి పోటీ చేసి విజయం సాధించగా 1983 లో గురజాల నుండి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు , రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతున్న బ్రహ్మానందరెడ్డి  ఈ సారి కూటమి అభ్యర్థిగా గెలుపొందే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. పల్నాడులో గత 20 ఏళ్ల నుంచి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయిన నియోజకవర్గం మాచర్ల. ఇక్కడ పిన్నెల్లి కుటుంబం హవా నడుస్తోంది. ఈ సారి టీడీపీ జూలకంటి బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇవ్వడంతో గెలుపు సునాయసం కానుంది. జగన్ ప్రభుత్వం పట్ల ప్ర జా  వ్యతిరేకత రోజు రోజుకు ఎక్కువ కావడంతో బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమని   తేలిపోయింది.పల్నాడు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో మాచర్ల ఒకటి. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.  1955లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం నుంచి అత్యధికసార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎన్నికయ్యారు. 1955లో మాచర్ల తొలి ఎమ్మెల్యేగా సీపీఐ నేత మండపాటి నాగి రెడ్డి విజయం సాధించారు. 1962లో ముదావత్ కేశవ్ నాయక్ గెలవగా.. 1967లో వెన్న లింగా రెడ్డి గెలిచారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1972లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన జూలకంటి నాగిరెడ్డి గెలుపొందగా.. 1978లో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి చల్లా నారప రెడ్డి గెలుపొందారు.1983 నుంచి 1999 వరకు మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ హవా నడిచింది. 1985 మినహా మిగతా నాలుగు పర్యాయాలు తెలుగు దేశం పార్టీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. కానీ 2004 నుంచి ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. 1983లో కొర్రపాటి సుబ్బారావు విజయం సాధించగా.. 1989లో నిమ్మగడ్డ శివరామ కృష్ణ ప్రసాద్, 1994లో కుర్రి పున్నా రెడ్డి, 1999లో జూలకంటి దుర్గాంబ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1985లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటుడు , దివంగత నేత  కృష్ణ విజయం సాధించారు.2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పోటీ చేస్తుండగా.. టీడీపీ ఏరి కోరి మరీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డికి టికెట్ కేటాయించింది. జూలకంటి బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులైన జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబ ఇద్దరూ మాచర్ల ఎమ్మెల్యేలుగా పని చేశారు. నాగిరెడ్డి 1972లో ఇండిపెండెంట్‌గా గెలవగా.. దుర్గాంబ 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలనే ఉద్దేశంతో టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో మాచర్ల నియోజకవర్గం పేరు తరచూ వినిపిస్తుంటుంది. ఇక్కడ రెండు కుటుంబాల మధ్యే రాజకీయ పోటీ వుంటుంది... ఇందులో ఒకటి పిన్నెల్లి, మరోటి జూలకంటి కుటుంబం. మరోసారి ఈ రెండు కుటుంబాలకు చెందినవారే బరిలోకి దిగుతుండటంతో  మాచర్ల ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అధికార వైసిపి మళ్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టిడిపి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని బరిలోకి దింపింది. పల్నాడులో టీడీపీ కంచుకోటగా పిలువబడే మాచర్ల నియోజకవర్గానికి ఇంచార్జ్ గా జూలకంటి బ్రహ్మనందరెడ్డిని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. బ్రహ్మానందరెడ్డికి  బాధ్యతలు అప్పగించడంతో కార్యకర్తలు, నాయకులు  అప్పట్లో పండుగ చేసుకుంటున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థవంతంగా ఢీకొట్టాలంటే, అందుకు సరైనోడు జేబీఆర్ మాత్రమేనని టీడీపీ అధిష్టానం కూడా భావిస్తోంది. రెండేళ్ల క్రితం  మాచర్ల నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జిగా నియమితులైన బ్రహ్మానందరెడ్డి  అటు పార్టీకి ఇటు ప్రజలకు విశేష సేవలందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలుపును కన్ఫర్మ్ చేశారు. 
Publish Date: Apr 27, 2024 2:51PM

ఏపీలో అధికారం కూటమిదే.. తేల్చేసిన బీజేపీ

ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టబోయేది ఎవరో బీజేపీ తేల్చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచరుడు అయిన సునీల్ బన్సల్ పేర్కొన్నారు. బీజేపీకి అందిన నివేదిక ప్రకారం ఏపీలో తెలుగుదేశం కూటమి 145 అసెంబ్లీ, 23 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తుందన్నారు. కూటమి ప్రభంజనం ముందు వైసీపీ ఫ్యాన్ కొట్టుకు పోతుందని5 పేర్కొన్నారు.  సునీల్ బన్సల్ చెప్పిన సంఖ్యలు ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వెలువడిన సర్వేలను మించి ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎపీ ఎన్నికలపై దాదాపు 11 సర్వేలు వెలువడ్డాయి. దాదాపు అన్ని సర్వేలూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించబోతున్నదనే చెప్పాయి. ఇప్పుడు తాజాగా సునీల్ బన్సల్ కూడా అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ వైసీపీ కానీ, ఆ పార్టీ అధినేత జగన్ కానీ బీజేపీపై చిన్న పాటి విమర్శకూడా చేయడం లేదు. అదే సమయంలో తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ చేసిన ప్రకటనను ఎత్తి చూపుతూ రాష్ట్రంలో చంద్రబాబు ముస్లింలను దగా చేయడానికి రెడీ అయిపోయారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  పొత్తులో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం 144, బీజేపీ 10. జనసేన 21 స్థానాలలో పోటీ చేస్తున్నాయి. వీటిలో 145 స్దానాలలో కూటమి అభ్యర్థులే జయకేతనం ఎగురవేస్తున్నట్లుగా తమకు నివేదిక అందిందని సునీల్ బన్సల్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా పోటీలో ఉంది. అంటే మిగిలిన 30 స్ఖానాలనూ వైసీపీ కాంగ్రెస్ లు పంచుకుంటాయని భావించాల్సి ఉంటుంది. అంటే ఎలా చూసుకున్నా వైనాట్ 175 అన్న ధీమా వ్యక్తం చేసిన జగన్ పార్టీకి 30 కంటే తక్కువ స్థానాలే వస్తాయని సునీల్ బన్సల్ చెబుతున్నారు. ఇక  లోక్ సభ స్థానాలైతే మరీ కనాకష్టంగా రెండు కంటే తక్కువ వస్తాయని బీజేపీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. సునీల్ బన్సల్ ప్రకటనపై వైసీపీ స్పందన ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. 
Publish Date: Apr 27, 2024 2:26PM

జగన్ బ్యాండేజీ తీసేశారు.. సెప్టిక్ భయమే కారణమా?!

జగన్ గులకరాయి దాడిలో గాయపడి రెండు వారాలుగా కంటికి వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఎట్టకేలకు తీసేశారు. హఠాత్తుగా ఆయన బ్యాండేజీ తీయడానికి ఆయన బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అన్నయ్యా అని చేసిన హెచ్చరికే కారణమా? అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. మేమంతా సిద్ధం అంటూ ఆయన చేపట్టిన బస్సుయాత్ర విజయవాడలో సాగుతున్న సమయంలో ఆయనపై రాయి దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన కంటి పైభాగాన గాయమైంది.   ఆ దాడిని హత్యాయత్నంగా అభివర్ణిస్తూ సెంటిమెంట్ ను పండించి ఎన్నికల గండం గట్టెక్కాలని వైసీపీ విశ్వ ప్రయత్నం చేసింది. కోడికత్తి దాడిలా ఈ దాడి కూడా జగన్ పై ప్రజలలో సానుభూతి పొంగి పొర్లిపోయి ఓట్లు రాలుస్తుందని భావించింది. అయితే వైసీపీ ప్రయత్నం నవ్వుల పాలైందది. జగన్ ప్రతిష్ఠ దిగజారింది. ఆ దాడి జగన్ చేత జగన్ కోసం జగనే చేయించుకున్న దాడి అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. వాటిని వేటినీ పట్టించుకోకుండా ఆ దాడి హత్యాయత్నమేననీ, దీని వెనుక ఉన్నది చంద్రబాబు, తెలుగుదేశమేననీ వైసీపీ నేతలు జనాలను నమ్మించడానికి శతధా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ దాడి కేసులో తెలుగుదేశం నేతను ఇరికించడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. దాడి విషయంలో భద్రతా వైఫల్యం ఏమీ లేదనీ, పోలీసుల వైఫల్యం అస్సలు లేదనీ ప్రభుత్వ సలహాదారు మీడియా ముందుకు వచ్చి మరీ నెత్తీ నోరూ బాదుకుని చెప్పారు. అయినా  ఎన్నికల సంఘం నమ్మలేదు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పొలీస్ పై బదలీ వేటు వేసింది. ఎన్నికలకు సంబంధం లేని విధులను కేటాయించాల్సిందిగా ఆదేశించింది.  దీంతో జగన్ పరిస్థితి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదన్నట్లు తయారైంది. దానికి తోడు కుట్లు పడేలా అయిన గాయానికి బ్యాండ్ ఎయిడ్ తో జనం ముందుకు వచ్చి ఏదో కాస్తయినా సెంటిమెంటును పిండుకుందామనుకున్నారు. అయితే గాయం తగిలిన వెంటనే వేసిన బ్యాండ్ ఎయిడ్ కూ డాక్టర్ల బృందం చికిత్స తరువాత వేసిన బ్యాండ్ ఎయిడ్ కు సైజులో వ్యత్యాసం ఉండటంతో జగన్ గాయంపై నెటిజన్లు సెటైర్లు వేశారు.   ఆ ట్రోలింగ్ రోజురోజుకూ పెరుగుతుండటం కారణమో, వైద్యులు సరైన సలహా ఇవ్వలేదా? బ్యాండేజీ ఎక్కువ రోజులు ఉంటే గాయం మానదు, సెప్టిక్ అవుతుంది జాగ్రత్త అంటూ డాక్టర్ సునీత చేసిన హెచ్చరికతో భయపడో తెలియదు కానీ జగన్ మొత్తానికి శనివారం బ్యాండ్ ఎయిడ్ లేకుండా దర్శనమిచ్చారు. సరే ఇక్కడ విశేషం ఏమిటంటే రాయిదాడిలో తగిలిన గాయానికి కొన్ని కుట్లు కూడా పడ్డాయని చెప్పుకున్న జగన్ రెండు వారాల తరువాత ఆ బ్యాండ్ ఎయిడ్ తీసేసిన తరువాత గాయం జరిగిన ప్రాంతంలో చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం విశేషం. ఈ జగన్మాయ ఏమిటి ముఖ్యమంత్రిగారూ అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  
Publish Date: Apr 27, 2024 1:50PM

పిఠాపురంలో పవన్ కు మద్దతుగా చిరు ప్రచారం? మెగా హీరోలందరూ కూడా!

రాష్ట్రంలోని హాట్ సీట్లలో ముందుగా చెప్పుకోవలసింది జనసేన అధినేత పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా వంగా గీత రంగంలో ఉన్నారు. జనసేనాని ఓటమే లక్ష్యంగా జగన్ ఈ నియోజకవర్గ బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డిలకు అప్పగించారు. ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అయితే గతంలోలా కాకుండా పవన్ కల్యాణ్ ఇప్పుడు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించడంతో పాటు తాను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తూ రోడ్ షోలతో జనాలకు దగ్గరౌతున్నారు. చంద్రబాబుతో కలిసి రాష్ట్రంలోని బహిరంగ సభలలో పాల్గొనేందుకు మాత్రమే జనసేనాని నియోజకవర్గం వదిలి వెడుతున్నారు. అలా నియోజకవర్గంపై పూర్తి దృష్టి కేంద్రీకరించి విజయమే లక్ష్యంగా అగుడులు వేస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కూడా జనసేనాని గెలుపు లక్ష్యంగా పిఠాపురంలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. జబర్దన్ కమేడియన్లు ఆది, గెటప్ శ్రీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ కూడా శనివారం నియోజకవర్గంలో తన చిన్నాన్న తరఫున ప్రచారం చేశారు.  ఇవన్నీ ఒకెత్తైతే మెగాస్టార్ చిరంజీవి త్వరలో పిఠాపురంలో  పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేయనుండటం కూటమికి గట్టి బలం కానుంది. అయితే చిరంజీవి ప్రచారానికి వస్తారా అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. చాలా కాలంగా చిరంజీవి రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు. ఏవో సినిమాలలో రాజకీయాలను నేను వదిలినా అవి తనను వదలడం లేదన్న డైలాగులు వినా చిరంజీవి ప్రత్యక్షంగా రాజకీయ ప్రసంగాలు చేసిన సందర్భం కూడా లేదు. అయితే ఇటీవల మాత్రం చిరంజీవి బహిరంగంగా కూటమి అభ్యర్థి సీఎం రమేష్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ కు మద్దతుగా చిరు ప్రచారం చేయడం ఖాయమని మెగా అభిమానులు గట్టిగా చెబుతున్నారు. చిరు ప్రచారంతో పిఠాపురంలో జనసేనానికి ఇక తిరుగే ఉండదని అంటున్నారు. చిరు ప్రచారం ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూటమికి పెద్ద బూస్ట్ అవుతుందని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజులలో సినీ రంగం నుంచి పలువురు ప్రముఖులు, ముఖ్యంగా మెగా హీరోలు జనసేనానికి మద్దతుగా ప్రత్యక్షంగా ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయని అంటున్నారు.   
Publish Date: Apr 27, 2024 12:50PM