యుద్ధం ముగిసిపోయినట్లేనా?
Publish Date:May 28, 2026
Advertisement
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ అగ్రరాజ్యాధినేత వ్యవహారతీరుపై తెలుగువన్ ఇంటర్వ్యూలో ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన మారుస్తున్న మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక నయా డిక్టేటర్ తరహాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు గమనిస్తుంటే.. ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారునాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు. అయితే.. వ్యూహాత్మకంగా ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని తన అధీనంలో ఉంచుకుని అమెరికా పీక నొక్కడంతో ట్రంప్ కొంత వెనక్కి తగ్గారన్నారు. ఇరాన్ తో యుద్ధం వల్ల ఇప్పటివరకు అమెరికా సుమారు హాఫ్ ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 45 నుంచి 50 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడే అనంతర పరిణామాల వల్ల మరో ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 95 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషించారు. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం అమెరికాపైనే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడింది. సహజంగా ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, అమెరికాలోనే చమురు ధరలు ఏకంగా 45 శాతం నుండి 50 శాతం వరకు పెరిగిపోవడం అక్కడ మధ్యతరగతి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. లక్షలాది మంది అమెరికన్లు రోడ్లపైకి వచ్చి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు భారత్ విషయానికి వస్తే, భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల కేవలం 4 శాతం నుండి 4.5 శాతం వరకే పరిమితం కావడం కొంత ఊరట కలిగిస్తున్న అంశం. అయినప్పటికీ, అంతర్జాతీయ చమురు సంక్షోభం మన దేశాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. రష్యాతో భారతదేశానికి ఉన్న పాత అనుబంధం, అక్కడి నుండి చౌకగా చమురు దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ మొదట్లో తీవ్ర ఆంక్షలు విధించాలని చూశారు. రష్యా ఆయిల్ కొంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించిన ట్రంప్, ఆ తర్వాత భారత విదేశాంగ విధానం మరియు అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి నెల రోజుల పాటు మినహాయింపు ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ఆ గడువును ఇప్పుడు మరో నెల రోజులు పొడిగించాల్సిన పరిస్థితికి ట్రంప్ వచ్చారంటేనే.. అమెరికా ఎంతగా తగ్గిందో అర్ధమౌతుందన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా ద్వంద్వ నీతిని ఎండగడుతూ, మా అవసరాలు మాకు ముఖ్యం, మమ్మల్ని ప్రశ్నించే ముందు యూరోపియన్ యూనియన్ సంగతి చూడండి అని గట్టిగా సమాధానం ఇవ్వడంతో ట్రంప్ నోరు మూతపడక తప్పలేదన్నారు. అయితే, అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులపై ట్రంప్ కక్షసాధింపు చర్యలు దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తుయని కిలారు అన్నారు. భారతీయులను చీప్ లేబర్ అని సంబోధిస్తూ, వారికి హెచ్-1బి వీసాలు ఇవ్వకూడదని, కొత్త వీసాలపై నిషేధం విధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఒకవైపు భారత ప్రధాని మోదీని తన ఆప్తమిత్రుడు అని పొగుడుతూనే.. మరోవైపు ఇండియా ఒక డెడ్ ఎకానమీ అని, ఒప్పించడం చాలా కష్టమైన దేశమని ఉదయానికి ఒకలా, సాయంత్రానికి ఒకలా మాటలు మారుస్తూ ట్రంప్ మానసిక స్థిరత్వం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారని కిలారు చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో అంతర్జాతీయంగా ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక పరిష్కారం లభించకపోతే, ప్రపంచాన్ని ముంచెత్తబోయే భయంకరమైన ఆర్థిక మాంద్యం తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని విశ్లేషించారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఇంకా దూకుడుగా వెళ్లే పరిస్థితి లేదని కిలారు నాగార్జున చెప్పారు.
http://www.teluguone.com/news/content/has-the-war-ended-39-221189.html





