మహానాడు వేదికపై మోగిన యువగళం.. ఉర్రూతలూగించిన దర్శన్ ప్రసంగం!
Publish Date:May 28, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహానాడు 2026 సరికొత్త చరిత్రకు వేదికైంది. హైబ్రీడ్ పద్ధతిలో జరిగిన ఈ మహానాడులో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పొట్లూరు దర్శిత్ ప్రసంగం అందరినీ ఉర్రూతలూగించింది. 2014 నాటి రాష్ట్ర విభజన పరిస్థితులను గుర్తుచేస్తూ సాగిన ఆయన ప్రసంగం.. నాడు పరిశ్రమలు, ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ తీవ్ర అంధకారంలో మునిగిపోయిందనీ.. ఆ సంక్షోభ సమయంలో యువతకు నైపుణ్యాభివృద్ధిని అందించి ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు సృష్టించడమే ధ్యేయంగా బ్రాండ్ సీబీఎన్ ముందుకు వచ్చారని దర్శిత్ కొనియాడారు. అంతర్జాతీయ సంస్థలైన సిమెన్స్ వంటి భాగస్వామ్యాలతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, 2019 నాటికి లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత వేతనాలతో కూడిన ఐటీ రంగ ఉద్యోగాల్లో నిలిపిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఇండియా స్కిల్ రిపోర్ట్‌లో సైతం ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఆ విజన్, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలో ఎలా నిర్వీర్యమైందో కళ్ళకు కట్టినట్లు వివరించారు. 2019 అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర యువత అనుభవించిన నరకయాతనను దర్శిత్ గణాంకాలతో సహా వెల్లడించారు. చంద్రబాబు నాయుడు 2019కి ముందే 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా తుంగలో తొక్కారని విమర్శించారు. ఫలితంగా ఉపాధి లేక, ఉద్యోగాలు రాక రాష్ట్రంలో ఏకంగా 2,400 మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 2,400 అనేది కేవలం ఒక సంఖ్య కాదు.. అది 2,400 మంది కన్నతల్లుల కడుపుకోత, ఆ కుటుంబాల కళ్ళ ముందే జరిగిన అంత్యక్రియలు అంటూ దర్శిత్ భావోద్వేగంగా మాట్లాడినప్పుడు మహానాడులో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు అక్రమ స్కిల్ కేసులో జైల్లో పెట్టినప్పటికీ, ఆయన ఆలోచనలను మరియు విజన్‌ను మాత్రం ఆ బంధీఖానా నిర్బంధించలేకపోయిందని దర్శిత్ చెప్పారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా కేవలం ఆంధ్రాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు విజన్ వల్ల లబ్ధి పొందిన 79 దేశాలలోని తెలుగు యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కక్ష సాధింపు, రివెంజ్ రాజకీయాలతో విసిగిపోయిన యువత, 2024 ఎన్నికల్లో ఒక అద్భుతమైన, విస్పష్టమైన తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. మాకు రివెంజ్ పాలిటిక్స్ వద్దు.. రిజల్ట్స్ ముఖ్యం, కేసులు కాదు.. మాకు కెరీర్ ముఖ్యం అని నినదిస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో యువత అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. గత ప్రభుత్వం కులాలు, ఓట్లు, సీట్ల లెక్కల్లో మునిగిపోతే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యువతలోని టాలెంట్, స్కిల్, పొటెన్షియల్‌ను నమ్మిందని, అందుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మొట్టమొదటి నిర్ణయం స్కిల్ సెన్సస్ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు. యువత చేతుల్లో కేవలం సర్టిఫికెట్లు మాత్రమే కాదు.. గౌరవప్రదమైన పే-స్లిప్పులు ఉండాలన్నదే లోకేష్ సంకల్పమన్నారు. గతంలో రాయలసీమను ఫ్యాక్షన్ సీమగా, రాళ్ల సీమగా గుర్తింపు పొందితే.. లోకేష్ ఆ ప్రాంతానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ మరియు డిఫెన్స్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమలను తీసుకొచ్చి 'రాయల్ సీమ - రక్షణ సీమ'గా మార్చారని ప్రశంసించారు. పదో తరగతి ఫలితాల ప్రకటనలో కూడా తన ప్రచారం చేసుకోకుండా, పేద విద్యార్థుల చిరునవ్వులనే హైలైట్ చేసిన లోకేష్ సంస్కారానికి, ఐదు పైసల పని చేయకుండా ఐదు వందల రూపాయల పబ్లిసిటీ చేసుకున్న జగన్ మనస్తత్వానికి ఆకాశానికి, పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. చివరగా.. వైసిపి నేతలు మాట్లాడుతున్న ధర్మ సూత్రాలపై, లోకేష్ రెడ్ బుక్ పై వైసీపీ విమర్శలకు దర్శిత్ మహాభారత ఘట్టాన్ని ఉదహరిస్తూ గూస్‌బంప్స్ తెప్పించే విమర్శలు గుప్పించారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చావు ముంగిట నిలబడి ధర్మం గురించి మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాన్ని గుర్తుచేశారు. కౌరవ సభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తున్నప్పుడు, పాండవులను అవమానిస్తున్నప్పుడు గుర్తురాని ధర్మం.. ఈరోజు నిన్ను కాపాడదు కర్ణా! ధర్మాన్ని నువ్వు పాటిస్తేనే అది నిన్ను కాపాడుతుంది అన్న కృష్ణుడి మాటలను నేటి రాజకీయాలకు అన్వయించారు. గత అసెంబ్లీలో 151 మంది కౌరవుల్లా కూర్చుని చంద్రబాబు నాయుడిని మానసిక క్షోభకు గురిచేసినప్పుడు, నారా భువనేశ్వరిని అవమానించినప్పుడు, లోకేష్‌ను అవహేళన చేసినప్పుడు వైసిపి నాయకులకు ధర్మం గుర్తురాలేదా అని ప్రశ్నించారు. నాడు గుర్తురాని ధర్మం నేడు నెమరువేసుకుంటే లాభం లేదనీ.. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అన్న భగవద్గీత సూత్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నారా లోకేష్ అమలు చేసి తీరుతారని హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/darshans-speech-electrifies-mahanadu-39-221186.html





