కర్నాటక సీఎం సిద్దరామయ్య రాజీనామా
Publish Date:May 28, 2026
Advertisement
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు పై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామాచేశారు. 2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు. ఈ ప్రకటనతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా , ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సిద్ధరామయ్య తన 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ అల్పాహార సమావేశం అత్యంత భావోద్వేగభరితంగా సాగింది. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సిద్ధరామయ్య, రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్న సమయంలో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతకాలం ముఖ్యమంత్రిగా నేను చేసిన పనుల పట్ల, ప్రజలకు అందించిన సేవల పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం.. ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనలకు కట్టుబడి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ కీలక సమావేశంలో సీనియర్ మంత్రులు ప్రియాంక్ ఖర్గే, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, హెచ్‌కే పాటిల్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య రాజీనామా నిర్ణయాన్ని స్వాగతిస్తూ డీకే శివకుమార్ ఆయనను ఆత్మీయంగా అలింగనం చేసుకున్నారు. అనంతరం సిద్ధరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ దృశ్యం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఐక్యతను చాటిచెబుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోను కర్ణాటక కాంగ్రెస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఐక్యతే మా బలం! ప్రజాసేవే మా నిరంతర లక్ష్యం అన్న వ్యాఖ్యను జోడించింది. సిద్ధరామయ్య రాజీనామా వార్త బయటకు రాగానే బెంగళూరులోని డీకే శివకుమార్ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున సంబరాలు ప్రారంభించారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, బాణసంచా కాలుస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
http://www.teluguone.com/news/content/karnataka-cm-siddaramayya-resign-39-221130.html





