జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం.. నాలుగు దశాబ్దాల కల సాకారం!
Publish Date:May 28, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రజల నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ పోరాటానికి ఎట్టకేలకు చారిత్రాత్మక విజయం లభించింది. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కావాలంటూ సాగిన ఉద్యమాలు, నాయకుల త్యాగాలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో.. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్ సీఓఆర్) జూన్ 1, 2026 నుండి అధికారిక కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ చారిత్రక పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లనుందనడంలో సందేహం లేదు. రైల్వే పరిపాలనను సులభతరం చేసేందుకు, మౌలిక వసతుల అభివృద్ధి వేగం పుంజుకునేందుకు వేగంగా అభివృద్ధి చేసేందుకు ఎస్ సీఓఆర్ దోహదపడుతుంది. తొలుత ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు తాత్కాలికంగా సిరిపురం వద్ద ఉన్న వీఎంఆర్‌డీఏ ది డెక్ భవనంలోని ఐదు, ఆరు అంతస్తుల నుండి సాగుతాయి. జనరల్ మేనేజర్ సందిప్ మాథుర్ నేతృత్వంలో దాదాపు 6 నుండి 8 ముఖ్య విభాగాలు ఈ తాత్కాలిక కార్యాలయం నుంచే పనిచేయడం ప్రారంభిస్తాయి. మరోవైపు ముదసర్లోవ వద్ద దాదాపు 54 ఎకరాల భారీ విస్తీర్ణంలో శాశ్వత రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక శాశ్వత భవన సముదాయాన్ని మూడు సంవత్సరాల కాలపరిమితిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణ పనుల కోసం ఇప్పటికే 106 కోట్ల నిరూపాయలను కేంద్రం విడుదల చేసింది. రైల్వే పునర్వ్యవస్థీకరణ చట్టం 1989 ప్రకారం ఏర్పాటైన ఈ కొత్త 18వ రైల్వే జోన్ పరిధి ఎంతో విస్తృతమైనది. ఇది సుమారు 3,496 కిలోమీటర్ల సుదీర్ఘమైన రూట్ పొడవు కలిగి ఉంది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు తీర రైల్వేలలోని కొన్ని కీలక భాగాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఈ జోన్ రూపుదిద్దుకుంది. దీని పరిధిలోకి ప్రస్తుత విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు రానున్నాయి. వీటితో పాటు గతంలో తూర్పు తీర రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను పునర్వ్యవస్థీకరించి విశాఖపట్నం డివిజన్ గా మార్చారు. ఈ మార్పుల వల్ల పాత వాల్తేరు డివిజన్ రెండు భాగాలుగా విడిపోయింది. అందులో ఒక భాగం తూర్పు తీర రైల్వే పరిధిలోనే కొత్తగా ఏర్పడిన రాయగడ డివిజన్‌గా మారగా, మిగిలిన ప్రధాన భాగం విశాఖపట్నం డివిజన్‌గా మారి సౌత్ కోస్ట్ రైల్వేలో విలీనమైంది. అలాగే గతంలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను ఇప్పుడు విజయవాడ డివిజన్‌లో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల విశాఖలో ఉన్న తాత్కాలిక జోన్ కార్యాలయాన్ని సందర్శించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
http://www.teluguone.com/news/content/fourdecadelong-dream-realized-36-221185.html





