గుజరాత్ టైటాన్స్ జట్టు బస్సులో మంటలు.. తృటిలో తప్పిన ప్రుమాదం
Publish Date:Jun 1, 2026
Advertisement
ఐపీఎల్ ఫైనల్ లో పరాజయం పాలైన గుజరాత్ టైటాన్స్ ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ పోరు ముగిసిన అనంతరం ఆదివారం (మే 31) అర్థరాత్రి దాటిన తరువాత స్టేడియం నుండి తిరిగి హోటల్‌కు బయలుదేరిన గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. వారు ప్రయాణిస్తున్న అధికారిక టీమ్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్, భద్రతా సిబ్బంది వెంటనే బస్సును పక్కకు నిలిపివేసి.. అందులోని ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరినీ సురక్షితంగా కిందికి దించేశారు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సులోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, వైరింగ్‌లో చోటుచేసుకున్న షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆటగాళ్లంతా రోడ్డుపైనే దాదాపు ఒక గంట పాటు వేచి చూడాల్సి వచ్చింది. అర్ధరాత్రి వేళ ఐపీఎల్ ఆటగాళ్లు రోడ్డుపై నిలబడటంతో స్థానికంగా కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే ఆటగాళ్లకు, సిబ్బందికి ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం, బీసీసీఐ అధికారులు, క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ వాహనాల ద్వారా ఆటగాళ్లను సురక్షితంగా హోటల్ గదులకు చేర్చారు. ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన బాధలో ఉన్న ఆటగాళ్లకు ఈ ప్రమాదం మరింత మానసిక ఆందోళనను కలిగించింది.
http://www.teluguone.com/news/content/fire-breaks-out-in-gujarat-titans-team-bus-36-221393.html




