ఇరాన్ అధ్యక్షుడి రాజీనామా?
Publish Date:Jun 1, 2026
Advertisement
అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో.. ఇరాన్ దేశాధినేతకు సంబంధించిన ఒక సంచలన వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన పదవికి రాజీనామా చేస్తూ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కార్యాలయానికి అధికారిక లేఖ పంపారంటూ లండన్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ఆదివారం(మే31) ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త బయటకు రాగానే అంతర్జాతీయంగా ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. దేశంలోని మిలిటరీ శక్తులు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ) కమాండర్లు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారని, కీలక నిర్ణయాల నుండి దేశ అధ్యక్షుడిని, రక్షణ రంగానికి చెందని పౌర ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆ లేఖలో పెజెష్కియాన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అంతర్గత నివేదికల ప్రకారం.. ఇరాన్ ప్రభుత్వంలో ఈ అధికార శూన్యతను ఆసరాగా చేసుకుని ఐఆర్జీసీలోని తీవ్రవాద గ్రూపులు దేశ వ్యవహారాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నాయనీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తాను పౌర ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపలేననీ, తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించలేనని పేర్కొంటూ మసూద్ పెజెష్కియాన్ తక్షణమే తనను పదవి నుండి తప్పించాలని సుప్రీం లీడర్‌ను కోరారన్నది ఆ కథనం సారాంశం. ముఖ్యంగా అమెరికాతో జరుగుతున్న యుద్ధ నిర్వహణ తీరు, దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనోపాధిపై దాని విధ్వంసక ప్రభావాల విషయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మరియు ఐఆర్జీసీ చీఫ్‌కు మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పైగా ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నారనే వార్తల నడుమ ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ రాజీనామా వార్తలను ఇరాన్ అధికార యంత్రాంగం ఖండించింది. ఇరాన్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ డిప్యూటీ హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ సయ్యద్ మెహదీ తబాతబాయి ఈ నివేదికలను పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. విదేశీ మీడియా సంస్థలు ఆడుతున్న మీడియా గేమ్ గా అభివర్ణించారు. ఐఆర్జీసీ అనుబంధ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ కూడా ఈ వార్తలను ఖండిస్తూ, అధ్యక్షుడు తన విధుల్లోనే కొనసాగుతున్నారని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమంపై, వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిపై కఠినమైన షరతులతో కూడిన శాంతి ప్రతిపాదనను పంపిన తరుణంలోనే ఈ రాజీనామా వివాదం వెలుగు చూడడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/iran-president--resignation-36-221391.html





