మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హౌస్ అరెస్టు.. వనపర్తిలో ఉద్రిక్తత.!
Publish Date:Sep 21, 2026
Advertisement
తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజెక్టు ముట్టడి పిలుపు నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు అరెస్టులు, గృహనిర్బంధాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని వనపర్తిలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రాజెక్టు ముట్టడికి వెళ్లకుండా ఆయనను అడ్డుకోవడంతో వనపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జూరాల ప్రాజెక్టు పరిధిలోని వేలాది ఎకరాల ఆయకట్టు ఎండిపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ తీవ్ర ఆమండి పడుతున్నాయి. కాల్వలకు సకాలంలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందనీ, అయినా ప్రభుత్వం స్పందించడంల లేదనీ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. రైతుల పక్షాన నిలిచి జూరాల ప్రాజెక్టును ముట్టడించాలనే డిమాండ్ తో ఆందోళన చేపట్టింది. అయితే పోలీసులు ఈ ఆందోళన భగ్నం చేసేందుకు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తుండటాన్ని తీవ్రంగా నిరసించిన బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని విమర్శిస్తున్నారు. వనపర్తి, ఆత్మకూరు, అమరచింత, నర్వ తదితర మండలాల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు జూరాల ప్రాజెక్టు వైపు రాకుండా పోలీసులు ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు గద్వాలలోనూ కాలువలకు నీటిని విడుదల చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం, రైతు సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వడంతో అక్కడ కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే గద్వాలలోనూ పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. [Former Minister Niranjan Reddy House Arrest, Jurala Project Protest, BRS , Telangana Water Issue, Telugu One]
http://www.teluguone.com/news/content/former-minister-niranjan-reddy-house-arrest-24-232007.html





