ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు హతం
Publish Date:Jan 3, 2026
Advertisement
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్‌లో ఈ ఉదయం జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు ఖతమయ్యారు. సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా శనివారం (జనవరి 3) ఉదయంజరిగిన రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. సుక్మా జిల్లాలో 12 మంది మావోలు మరణించగా, బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ మరణించారు. సుక్మా జిల్లాలోని కొంటా ప్రాంత అడవుల్లో ఉదయం నుంచి భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందాలు నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో కొంటా ఏరియా కమిటీకి చెందిన కీలక నాయకుడు సచిన్ మంగ్డు సహా 12 మంది మావోయిస్టులు హతమైనట్లు భద్రతా బలగాలు తెలిపాయి. మృతులలో కొంటా ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు ఉన్నారు. సంఘటనా స్థలం నుంచిఏకే-47, ఐఎన్ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్ రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా శనివారం (జనవరి 3) ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టుల సంచారంపై అందిన విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలుఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టి రెండు జిల్లాల్లో ఏకకాలంలో కూంబింగ్ నిర్వహించారు. ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశముందని భావిస్తున్న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/encounter-in-chattisghar-36-211945.html





