కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన
Publish Date:Jan 3, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా ముఖ్యంగా అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 35.19 కోట్ల రూపాయల వ్యవయంతో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ ఈ నిధులను అందజేసింది. ఈ మౌలిక సదుపాయాలలో ప్రధానంగా దీక్ష విరమణ మండపం, భక్తుల సత్రం నిర్మాణం వంటివి ఉన్నాయి. టీటీడీ నిధులతో ఇక్కడ నిర్మించనున్న దీక్ష విరమణ మండపంలో ఒకేసారి రెండువేల మంది భక్తులు అయ్యప్ప దీక్ష విరమణ చేసేలా విశాలంగా నిర్మించనున్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు, భక్తులకు అనుకూలంగా డిజైన్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీని వల్ల శబరిమల నుంచి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు కొండగట్టులో దీక్ష విరమణ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది. అలాగే సత్రంలో మొత్తం 96 విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేలా ఈ గదులను అభివృద్ధి చేయనున్నారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక వసతులను కూడా సత్రంలో కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనం రాజకీయంగా కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా చేపట్టిన ఈ అభివృద్ధి పనులు కొండగట్టు ఆలయానికి మరింత ప్రాధాన్యత తీసుకువస్తాయని ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-in-kondagattu-anjaneya-swamy-temple-36-211947.html





