బంగ్లాలో హిందువులను ఓటింగ్‌కు దూరం చేయడానికి కుట్ర..!
Publish Date:Jan 7, 2026
Advertisement
ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్‌లో ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా? మైనార్టీలు, ముఖ్యంగా హిందువులు ఓటింగ్లో పాల్గొనకుండా చేయడానికే ఈ మారణకాండ కొనసాగుతుందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. గడిచిన 31 రోజుల్లో ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యలు, లూటీలు, అత్యాచారాలతో బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా హిందువుల బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. కొత్త ఏడాదిలోనే ఇదే పరిస్థితి కొనసాగుతుండతో సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ దేశంలో మైనారిటీల పరిస్థితి దిక్కుతోచకుండా తయారైంది. ముఖ్యంగా హిందూ సమాజమే లక్ష్యంగా జరుగుతున్న మతపరమైన హింస ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు సృష్టిస్తోంది. శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీల ప్రాణాలను, మానవ హక్కులను కాపాడటంలో ఘోరంగా విఫలం అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క నెలలోనే 51 దాడులు జరగడం అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కేవలం డిసెంబర్ నెలలోనే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు నమోదు అయ్యాయి. వీటిలో 10 హత్యలు, 23 లూటీలు, దహనకాండలు చోటుచేసుకున్నాయి. దొంగతనాలు, తప్పుడు దైవదూషణ ఆరోపణలతో అక్రమ అరెస్టులు, చిత్రహింసలు వంటి సంఘటనలు మైనారిటీల ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థల చుట్టూనే సాగాయని కౌన్సిల్ స్పష్టం చేసింది. ఇంత జరుగుతున్నా యూనస్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలపాలవుతోంది. దేశవ్యాప్తంగా ఎలాంటి భద్రతా చర్యలు కనిపించడం లేదని, ఆంక్షలు విధించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మైనారిటీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మైనారిటీలు స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకోవడమే ఈ దాడుల వెనుక ఉన్న అసలు కుట్రగా కనిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/bangladesh-36-212173.html





