అంబేడ్కర్ స్ఫూర్తితోనే ప్రజా పాలన... దళిత సంక్షేమమే లక్ష్యం : సీఎం రేవంత్
Publish Date:Apr 14, 2026
Advertisement
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనే ధ్యేయంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ, దేశాభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. భారతదేశానికి మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రెండు కళ్ల వంటి వారని ముఖ్యమంత్రి అభివర్ణించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ ఎంతటి కీలక పాత్ర పోషించారో, ఆధునిక భారతదేశ నిర్మాణంలో అంబేడ్కర్ అంతే ప్రధాన పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ గడ్డపై సామాజిక చైతన్యాన్ని రగిలించిన ప్రజా కవి గద్దర్ సేవలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. గత పదేళ్ల కేబినెట్‌లో దళితులకు సరైన ప్రాధాన్యత లభించలేదని, కానీ తమ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కీలక పదవులు కట్టబెట్టామని పేర్కొన్నారు. ఒక దళిత బిడ్డ (భట్టి విక్రమార్క) రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని చూసి విపక్షాలు భరించలేకపోతున్నాయని ఆయన విమర్శించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు స్పీకర్‌గా లేదా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపడితే ప్రతిపక్షాలకు ఎందుకు అంత కడుపుమంట అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు ఆయన హోదాను తగ్గించేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే డైట్ ఛార్జీలను పెంచామని, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు. నిరుద్యోగిత నిర్మూలనపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇప్పటివరకు 67,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఉద్యోగాల్లో 87 శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాల వారికే దక్కడం విశేషమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా పేద బిడ్డల భవిష్యత్తును మారుస్తామని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ, రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు కుట్ర జరుగుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా మరియు రాష్ట్రాల జిఎస్‌డిపి ఆధారంగా హైబ్రిడ్ మోడల్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో జరిగిన పాలనా విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తాము అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, విద్యా రంగంలో తీసుకొస్తున్న మార్పుల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని సీఎం ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటామని, అంబేడ్కర్ ఆశించిన సమసమాజ స్థాపనే లక్ష్యంగా అడుగులు వేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-36-217323.html





