పాపం రియా చక్రవర్తి.. అయిదేళ్లు వేదనకి ఊరటేది?
Publish Date:Mar 24, 2025

Advertisement
ఆరోపణలతో కుంగిపోయింది.. అవమానాల్ని మౌనంగా భరించింది.. చేయని తప్పుకి జైలుకెళ్లింది.. దాదాపు ఐదేళ్ల పాటు సహనం కోల్పోకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇన్నేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడింది. బాలీవుడ్‌లో సంచలనం రేపిన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. మొత్తానికి రియా చక్రవర్తికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది. సుశాంత్ సూసైడ్‌కి, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. సుశాంత్ కేసుకు సంబంధించిన క్లోజర్ రిపోర్ట్‌లను సీబీఐ ముంబై కోర్టులో దాఖలు చేసింది. సుశాంత్ మరణం వెనుక కుట్ర ఉందన్న వాదనల్ని సీబీఐ తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. సుశాంత్ మరణంతో ఎలాంటి ప్రమేయం లేకపోయినా.. సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలతో.. రియా చక్రవర్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. చేయని తప్పుకు ఆమె 27 రోజుల పాటు జైలుశిక్ష అనుభవించింది. ఎన్ని అవమానాలు ఎదురైనా రియా, ఆమె కుటుంబ సభ్యులు మౌనంగా భరించారు. కానీ.. సుశాంత్ మరణం తర్వాత వారిపై జరిగిన ప్రచారం, నిరాధార ఆరోపణలతో ఇంతకాలం వారెంతో కుంగిపోయారు. ఇప్పుడు రియాకు క్లీన్ చిట్ రావడంపై బాలీవుడ్ యాక్టర్స్ రియాక్ట్ అవుతున్నారు. అప్పట్లో రియాను, ఆమె కుటుంబాన్ని విలన్‌గా చూపించే ప్రయత్నం చేసినందుకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో 2020 జూన్ 14న సుశాంత్ విగతజీవిగా కనిపించారు. అతని మరణవార్త బయటకు తెలిశాక కొందరు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై సోషల్ మీడియాలో విద్వేష ప్రకటనలు చేశారు. ఇప్పుడు సీబీఐ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేదాకా సుశాంత్ మరణానికి ఆవిడే కారణం అనుకున్న వాళ్లెందరో ఉన్నారు. ఇంత జరిగినా.. రియా కుటుంబం మౌనంగానే ఉంది. తమతో అమానవీయంగా ప్రవర్తిస్తున్నా సహనంతోనే ఉన్నారు.
అయితే, ఆ కుటుంబం ఇంతకాలం పడిన మానసిక వేదనకు.. ఇప్పుడు విముక్తి దొరికినట్లేనా? అనే ప్రశ్న తలెత్తితే.. ఎక్కడా సరైన సమాధానం దొరకట్లేదు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో మీడియా వేధింపులకు రియా, ఆమె ఫ్యామిలీ అనుభవించిన క్షోభని మాటల్లో చెప్పలేం. నిరాధార ఆరోపణలతో ప్రసారం చేసిన కథనాలు వాళ్లను వెంటాడుతూనే ఉంటాయ్. సుదీర్ఘ విచారణ తర్వాత సుశాంత్ మరణంతో ఆమెకు సంబంధం లేదని తేలాక వాళ్లకు కొంత ఊరట మాత్రం దక్కింది. కానీ.. దీనితోనే సమాజం వేసిన ముద్ర తొలగిపోతుందా? వారికి అంటుకున్న ఆరోపణల మరకలు తుడిచిపెట్టుకుపోతాయా? అనేదే.. అసలు ప్రశ్న.
సుశాంత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత.. రియా చక్రవర్తిపై అనేక ఆరోపణలు వచ్చాయి. సుశాంత్‌ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, డ్రగ్స్ సప్లై, మనీ లాండరింగ్ లాంటి ఆరోపణలతో.. ఆమెతీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంది. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి దర్యాప్తు సంస్థల విచారణని కూడా ఆమె ఎదుర్కొంది. తన సోదరుడితో పాటు రియా కూడా జైలు శిక్ష అనుభవించింది. సుదీర్ఘ కాలంలో ఇలాంటి పరిణామాల తర్వాత సీబీఐ నుంచి క్లీన్ చిట్ దొరకడం, రియాకు నిజంగా ఓ విడుదలలా అనిపించొచ్చు. ముంబై స్పెషల్ కోర్టులో సీబీఐ ఇచ్చిన క్లోజర్ రిపోర్టులో, రియాకు ఎలాంటి నేరం ఆపాదించలేదు. దీంతో, ఆమెపై ఉన్న చట్టపరమైన ఒత్తిడి దాదాపుగా తొలగిందనే చెప్పాలి. చట్టపరంగా కొంతవరకు ఆమెకు ఇది ఊరట కలిగించినా.. ఐదేళ్లుగా మీడియా ట్రయల్, సోషల్ మీడియాలో విమర్శలు, ఆమె వ్యక్తిగత జీవితంపై దాడుల వల్ల.. రియా ఎదుర్కొన్న మానసిక వేదనని పూర్తిస్థాయిలో తొలగించదనే చెప్పాలి.
రియా విషయంలో.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియా పేజీలు.. ఆమెని నేరస్తురాలిగా చిత్రీకరించడం, ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేయడం లాంటివి విస్తృతంగా జరిగాయ్. ఈ పరిస్థితుల్లో.. ఆమె కెరీర్ దెబ్బతినడమే కాదు.. వ్యక్తిగత జీవితం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ క్లీన్ చిట్ ద్వారా.. ఆమెకు న్యాయం జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ.. సమాజంలో ఆమెపట్ల ఏర్పడిన అభిప్రాయాలు, ఆమె కుటుంబం ఎదుర్కొన్న అవమానాలు.. రాత్రికి రాత్రే మారిపోయే అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే.. రియా తప్పు చేయకపోయినా ఎన్నో కష్టాలు అనుభవించింది. ఈ క్లీన్ చిట్‌తో చట్టపరంగా కొంత విముక్తి దొరికినా.. ఆమె మానసికంగా పూర్తిగా కోలుకునేందుకు, సమాజంలో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు కచ్చితంగా ఎంత సమయం పడుతుందనేది ఎవరూ చెప్పలేరు. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. ఆమె మళ్లీ ఓ కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు ఇదొక మంచి అవకాశమే అయినప్పటికీ.. రియా అనుభవించిన వేదన, గతం తాలూకు గాయాలు అంత ఈజీగా మానిపోవు.
http://www.teluguone.com/news/content/clean-chit-to-ria-in-sushanth-sucide-case-39-194922.html












