ఆజాద్ రాజీనామా .. కాంగ్రెస్’లో కొత్త ట్విస్ట్
Publish Date:Aug 27, 2022
Advertisement
కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది నాయకులు పార్టీని వదిలి బయటకు వెళ్లి పోయారు. ముఖ్యంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత, సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా డజన్ల కొద్ది నేతలు క్యూకట్టిమరీ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇంకా పోతూనే ఉన్నారు.అదే క్రమమలో పార్టీ సీనియర్ నాయకుడు, ఒకప్పుడు ట్రబుల్ షూటర్’గా పార్టీని అనేక విధాల ఆదుకున్న గులాం నబీ ఆజాద్’ కూడా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఐదు పదుల అనుబంధాన్ని తెంచుకుని పార్టీకి గుడ్’ బై చెప్పారు. నిజానికి, గులాం నబీ ఆజాద్’ పార్టీని వదిలిపోవడం ఉహించని విషయం కాదు. అనూహ్య పరిణామం అసలే కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్’గా కీలక బాధ్యతలు నిర్వహించిన గులాం నబీ ఆజాద్’ చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అలాగే,పార్టీ అధినాయకత్వం కూడా ఆయన్ని, పరాయి వాడిగానే చూస్తోంది. కొంత దూరంగానే ఉంచుతోంది. సుమారు రెండేళ్ళ క్రితం 2020లో ఆజాద్ సహా మరో 22 సీనియర్ నాయకులు, జీ 23 పేరిట ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఆ వేదిక ప్రధాన లక్ష్యం, పార్టీని బతికించు కోవడమే, అందుకే, పార్టీ సంస్థాగతంగా బలపడవలసిన అవసరాన్ని నొక్కి చెపుతూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇక అక్కడి నుంచి, పార్టీ సీనియర్ నాయకులకు, పార్టీ అధిష్టానానికి మద్య దూరం పెరుగుతూవచ్చింది. జీ 23కి అసమ్మతి ముద్ర పడింది. అజాద సహా, జీ 23 నాయకులకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. అవమనాలు ఎదురయ్యాయి. ఏ నేపధ్యంలోనే, పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి, ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు ఎనికయ్యారు.మరో వంక కొద్ది రోజుల క్రితం జమ్మూ కశ్మీర్’ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్’ పదవి పుచ్చుకున్నట్లే పుచ్చుకుని వద్దని వదిలేశారు. ఏఐసీసీ, జమ్మూ కశ్మీర్’ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్’ గా అయన పేరు ప్రకటించిన కొద్ది గంటలకే అయన రాజీనామా చేశారు. ఆయన వెనక, హిమాచల ప్రదేశ్ ప్రచార కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మ అదే బాటలో అడుగేశారు. ఆయన రాజీనామా చేశారు. అదలా ఉంటే, గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కంటే, ఆయన తమ రాజీనామా లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశాలు అవుతున్న్నాయి. ఆజాద్ ఐదు పేజీల లేఖలో, ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టిందని, ఆరోపించారు. చివరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ 'చేయాల్సింది భారత జోడో యాత్ర కాదు..కాంగ్రెస్ జోడో యాత్ర అంటూ, నేరుగా రాహుల్ గాంధీ పైనే అస్త్రాలను ఎక్కుపెట్టారు. అంతేకాదు, కాదు “ఏఐసీసీని నడిపే కోటరీ ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. భారత్ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాల్సింది" అని ఆజాద్ దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు ఆరంభమయ్యానని ఆజాద్ ఆరోపించారు. అదే విధంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడాన్ని తప్పుపట్టారు. రాహుల్ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని, అనుభవజ్ఞులైన నేతలను రాహుల్ పక్కకు పెడుతున్నారంటూ విమర్శించారు ఆజాద్. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకొని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. పార్టీలోని సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారని అని ఆయన అన్నారు.అలాగే, సోనియా గాంధీ, కేవలం నామమాత్రపు అధ్యక్షురాలిగా మిగిలిపోయారని, నిర్ణయాలు అన్నీ, రాహుల్ గాంధీ ఆయన చుట్టూ చేరిన కోటరీ తీసుకుంటోందని లేఖలో పేర్కొనారు. అయితే ఇప్పుడైనా పార్టీ, అధినాయకత్వం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని, అడుగులు వేస్తుందా ? అంటే, అలాంటి సూచనలు కనిపించడం లేదు. అజాద్’ తమ లేఖలో ప్రస్తావించిన అంశాలను పక్కన పెట్టి, ఆయన రాజీనామాకు ఎంచుకున్న సమయం సరింది కాదని పార్టీ తప్పుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై బీజేపీతో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీని వీడటం దురదృష్టకరమని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ పేర్కొన్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకునేందుకు, ఆజాద్ రాజీనామా ఒక అవకాశం కల్పించింది. కానీ, పార్టీ అందుకు సిద్ధంగా ఉన్న దాఖలాలు అయితే కనిపించడంలేదనే పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి అజాద్ రాజీనామాతో కాంగ్రెస్ ప్రస్థానం మరో మలుపు తిరిగింది.. పార్టీ భవిష్యత్ మరింత ప్రశ్నార్ధకంగా మారింది.
నిజానికి, ఆజాద్ ప్రస్తావించిన అంశాలు ఏవీ కొత్తగా వింటున్నవి కాదు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కాలంగా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అనేక మంది సీనియర్ జూనియర్ నాయకులు వ్యక్తిగత సంభాషణల్లో రాహుల్ గాంధీ కారణంగానే పార్టీ, రోజురోజుకు బలహీనమవుతోందని అంటూనే ఉన్నారు. అయితే, పిల్లి మెడడలో గంట కట్టే ప్రయత్నం ఎవరూ చేయలేదు. నిజానికి, చేయలేదని అనేందుకు కూడా లేదు ఎందుకంటే, జీ 23 లేఖలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావలసిన అవసరాన్ని, నొక్కి చెప్పారు.అలాగే, పార్టీ సీనియర్ నాయకులు సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అధ్యక్ష ఎన్నికల గురించి ఇతరత్రా తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు.
http://www.teluguone.com/news/content/azad-resignationnew-twist-in-congress-25-142730.html