political-news-img

ఆ హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తా.. కేంద్రాకి సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం..!

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు చేపడుతున్న విద్యార్థులు, యువతకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర ప్రభుత్వానికి కీలక లేఖ రాశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు తన ప్రతిపాదనలను వివరిస్తూ లేఖ పంపారు. ఉద్యమంలో పాల్గొన్న యువత, విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన కేసులు, పోలీసు వేధింపులు ఉండవని ప్రభుత్వం అధికారికంగా హామీ ఇస్తే వెంటనే తన దీక్షను విరమిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. అలాగే తమ ఆందోళనలను తాత్కాలికంగా పక్కనపెట్టి ప్రభుత్వంతో శాంతియుత చర్చలకు రావాలని నిరసనకారులను కూడా కోరతానని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రికి వచ్చి తన ఆరోగ్యాన్ని పరామర్శించి దీక్ష ఉపసంహరించుకోవాలని కోరిన కేంద్ర మంత్రులకు లేఖలో ఆయన ధన్యవాదాలు తెలిపారు. పేపర్ లీక్ కారణంగా ఆవేదనతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశం పరిశీలన, పార్లమెంటులో దీనిపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడాన్ని ఆయన గుర్తుచేశారు. తన పోరాటం విద్యార్థుల భవిష్యత్తు కోసమేనని, ఇప్పటికీ 65 మంది వివిధ పార్టీల ఎంపీలు తనకు లేఖ రాసి దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. తాను కూడా జీవించి విద్యార్థుల కోసం మరింత సేవ చేయాలనుకుంటున్నానని, అయితే ఆందోళనలో పాల్గొన్న యువత భవిష్యత్తును పణంగా పెట్టి వెనక్కి తగ్గలేనని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, లీకేజీ ఆరోపణలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలపై పోలీసులు బలప్రయోగం చేయడం, లాఠీఛార్జ్ నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు సైతం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. గత పదేళ్లలో అనేక పోటీ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆరోపిస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా ఇతర ప్రధాన పక్షాలు పార్లమెంటుతో పాటు వీధుల్లోనూ ఆందోళనలు తీవ్రతరం చేశాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతిపాదించిన నిబంధనలకు కేంద్ర ప్రభుత్వం ఏ రీతిలో స్పందిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం సానుకూల ప్రకటన చేస్తే ఈ వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశముంది. Sonam Wangchuk Hunger Strike, NEET Paper Leak Controversy, Union Ministers JP Nadda Jitendra Singh, Student Protests NEET UG, Sonam Wangchuk Letter to Central Government

Publish Date: Jul 22, 2026 9:21PM

political-news-img

జంతర్ మంతర్‌ వద్ద సీజేపీ నిరసన .. కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలా..?

నవ ఢిల్లీలోని చారిత్రాత్మక నిరసన వేదిక జంతర్ మంతర్ కేంద్రంగా ఇటీవల వెలుగులోకి వచ్చిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఉద్యమం దేశ రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యం ఆధారంగా సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాత్మకంగా ప్రారంభమైన ఈ ఉద్యమం, అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా యువత దృష్టిని ఆకర్షించింది. నిరుద్యోగం, అవినీతి, నీట్ (NEET) ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ప్రజాధనం దుర్వినియోగం వంటి అంశాలపై ప్రశ్నలు గుప్పిస్తూ ముందడుగు వేసిన ఈ మూవ్‌మెంట్, ప్రస్తుతం పలు వివాదాలు మరియు రాజకీయ కోణాల వైపు మళ్లుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ అంశంపై టోన్ న్యూస్‌ ప్రత్యేక కథనం. ఉద్యమ ప్రారంభం – నేపథ్యం: తొలినాళ్లలో దేశంలోని యువత, విద్యార్థుల సమస్యలను ప్రధాన ఎజెండాగా మార్చుకున్న సీజేపీ, విద్యార్థుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టింది. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై గళమెత్తడం ద్వారా విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఈ క్రమంలోనే ప్రముఖ పర్యావరణవేత్త, విద్యారంగ సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించి ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అదేవిధంగా ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్, నటుడు ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు ఈ వేదికను పంచుకోవడంతో ఉద్యమానికి జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది. రాజకీయ వ్యూహాలు – వివాదాలు: అయితే, కాలక్రమేణా ఈ ఉద్యమం తన ప్రాథమిక లక్ష్యం నుండి పక్కకు తప్పుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల అవకతవకల కంటే కూడా మతపరమైన, సామాజిక వివాదాస్పద వ్యాఖ్యలు వేదికపై చోటుచేసుకోవడం వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా, సీజేపీ ప్రతినిధి విజేత దహియా గత వ్యాఖ్యల వీడియోలు మళ్లీ తెరపైకి రావడం, వేదికపై కొందరు వ్యక్తులు మతపరమైన అంశాలను లేవనెత్తడంతో ఉద్యమ నిజాయితీపై అనుమానాలు మొదలయ్యాయి. గతంలో (2007 కాలంలో) సోనమ్ వాంగ్‌చుక్‌పై ఉన్న కొన్ని వ్యాఖ్యలు, చైనా అనుకూల లేదా యాంటీ-ఇండియా బలగాలతో ముడిపడి ఉన్నాయనే వార్తలు కూడా సోషల్ మీడియాలో రీ-సర్క్యులేట్ కావడం ఈ ఉద్యమ విశ్వసనీయతను దెబ్బతీశాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి – భవిష్యత్ రాజకీయ ప్రభావం: ప్రస్తుతం అనారోగ్య కారణాలతో సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల పారదర్శకతకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) ప్రవేశపెడతామని, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఉద్యమ నిర్వాహకులు పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటనను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేయకుండా సమయమనుకూల వైఖరిని అవలంబిస్తోంది. ప్రజా తీర్పుకే ఈ ఉద్యమ భవిష్యత్తును వదిలేసే వ్యూహాన్ని కేంద్రం అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యార్థి ఉద్యమంగా మొదలై రాజకీయ, సామాజిక గందరగోళానికి దారితీసిన ఈ సీజేపీ మూవ్‌మెంట్ భవిష్యత్తులో రాజకీయ సమూల మార్పులకు బీజం వేస్తుందో లేక స్వయంకృతాపరాధంతో నిర్వీర్యమవుతుందో వేచి చూడాల్సిందే. ఇలాంటి అంశాలపై టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి. Cockroach Janata Party, Sonam Wangchuk, NEET Protest, Jantar Mantar, Delhi News

Publish Date: Jul 22, 2026 8:52PM

political-news-img

తెలంగాణలో మరో రెండ్రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు అలర్ట్..!

రాష్ట్రంలో నైరుతి రుతుపవన ద్రోణి చురుగ్గా కదులుతుండటంతో రాగల రెండు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొట్టనున్నాయి. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రతినిధులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పరిధిలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజధాని హైదరాబాద్‌లోనూ వాతావరణం పూర్తిగా మేఘావృతమై మారిపోయింది. బుధవారం సాయంత్రం వేళ నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్టలతో పాటు సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, ఆల్వాల్, ఎర్రగడ్డలలో ఓ మోస్తరు నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సకాలంలో కురుస్తున్న వర్షాల పట్ల రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, నగరాల్లో సాయంత్రం వేళ పడిన వాన వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప వర్షం పడే సమయంలో బయటకు రాకూడదని పురపాలక అధికారులు సూచనలు జారీ చేశారు. మరోవైపు విద్యుత్, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, కరెంట్ తీగల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. రాబోయే రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉండి, ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయి కంటే తగ్గే అవకాశం ఉంది. నగరవాసులు మరియు ప్రయాణికులు వాతావరణ శాఖ ఇచ్చే తాజా సమాచారాన్ని గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. Telangana Rains Update, Hyderabad Weather News, Heavy Rains In Telangana, IMD Hyderabad Rain Alert, North Telangana Rains

Publish Date: Jul 22, 2026 8:34PM

political-news-img

విద్యార్థులపై చిందిన రక్తపు చుక్కలకు.. ఓటుతో సమాధానం చెబుతారు : కవిత

నీట్ పేపర్ లీకేజీకి వ్యతి రేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్ చేయడాన్ని తెలంగాణ రక్షణ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించడం లో విఫలమైన కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడిందని ఆమె ఆరోపించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థినులను రోడ్లపై పరుగెత్తించి రక్తం వచ్చేలా కొట్టడం ప్రజా స్వామ్య విలువలకు విరుద్ధమని కవిత అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో తమ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై ఇలాంటి చర్యలు తీసుకోవడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో ప్రపంచ దేశాల ముందు భారత్ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల సుమారు 25 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనలకు బాధ్యులు ఎవరో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని దేశ ప్రజలంతా తీవ్ర ఆవేదనతో గమనించారని కవిత అన్నారు. విద్యార్థులు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు, వారిపై విరిగిన ప్రతి లాఠీకి ప్రజలు ఎన్నికల్లో ఓటు రూపంలో బీజేపీకి తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులను వెంటనే గుర్తించి అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, మృతిచెందిన 21 మంది విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే వివరాలు వెల్లడించాలని కోరారు. విద్యార్థులే దేశ భవిష్యత్తుకు పునాది అని, అలాంటి విద్యార్థులను అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కవిత పేర్కొన్నారు. విద్యార్థుల గొంతు వినాల్సిన ప్రభుత్వం వారిపై బలప్రయోగం చేయడం అత్యంత దురదృష్టకరమని ఆమె విమర్శించారు. NEET Paper Leak Controversy, Dharmendra Pradhan Resignation Demand, Kalvakuntla kavitha, Sonam Wangchuk, PM MODI

Publish Date: Jul 22, 2026 8:22PM

political-news-img

పేపర్ లీకేజీలపై ఆనాడు ఆందోళన.. నేడు అణచివేత..!

నీట్ వివాదం వేళ విద్యాశాఖ మంత్రి పాత పోరాటాలు..! దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. అయితే, సరిగ్గా ఇలాంటి సమయాన్నే ప్రతిబింబించేలా ఆయనకు సంబంధించిన మూడు దశాబ్దాల క్రితం నాటి పోరాట చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సుమారు 27 ఏళ్ల క్రితం విద్యార్థి నేతగా ఉన్న సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకులకు వ్యతిరేకంగా స్వయంగా ఉద్యమించారు. పరీక్షల పారదర్శకత కోసం నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, పోలీసుల లాఠీ దెబ్బలు కూడా తిన్న ఘటనలు ఇప్పుడు మళ్లీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో 1997లో ఒడిశాలో భారీ స్థాయిలో క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఉదంతం వెలుగుచూసింది. ఆ సమయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్.. ఈ అక్రమాలపై తీవ్ర స్థాయిలో తిరుగుబాటేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ నిరసన గళం విప్పారు. ఒడిశా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఆయన, సుమారు 1,500 మంది విద్యార్థులను ముందుండి నడిపించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ సెక్రటేరియట్ ఎదుట బారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. ధర్నాను విఫలం చేసేందుకు పోలీసులు జరిపిన తీవ్ర లాఠీఛార్జిలో ధర్మేంద్ర ప్రధాన్‌కు తీవ్ర గాయాలై ఎముకలు విరిగినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా విద్యార్థి హక్కుల కోసం ఆయన పోరాటాన్ని కొనసాగించారు. నాటి లాఠీఛార్జి సంఘటనలకు సంబంధించిన పాత చిత్రాలు, పత్రికా ప్రకటనలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆనాడు పేపర్ లీకేజీల వ్యవస్థపై సింహంలా గర్జించిన నేత.. నేడు విద్యాశాఖ మంత్రిగా అదే లీకేజీల వివాదాన్ని ఎదుర్కోవడం విధి వైపరీత్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నీట్, నెట్ పరీక్షల అక్రమాలపై సుప్రీంకోర్టుతో పాటు సిబిఐ విచారణలు కొనసాగుతున్న తరుణంలో ఈ పాత వార్తలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి, లీకేజీల రాకెట్‌ను అరికట్టడానికి విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రితో పాటు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఆనాడు విద్యార్థి నేతగా పోరాడిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత లీకేజీల సమస్యకు ధర్మేంద్ర ప్రధాన్ శాశ్వత పరిష్కారం చూపుతారా లేదా అని దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. Dharmendra Pradhan Paper Leak, NEET Leak Controversy, ABVP Dharmendra Pradhan 1997, Union Education Minister, Odisha Secretariat Protest

Publish Date: Jul 22, 2026 7:50PM

political-news-img

సీజేపీ నిరసనకారులపై లాఠీఛార్జ్.. పోలీసులపై కోర్టు ఆగ్రహం..!

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన శాంతియుత నిరసనలు, పోలీసుల లాఠీఛార్జ్ వ్యవహారం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం మెట్లుక్కింది. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నెల 18వ తేదీన ఢిల్లీ పోలీసులు సోనమ్ వాంగ్‌చుక్‌ను హఠాత్తుగా అదుపులోకి తీసుకుని, ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ఈ చర్యను తీవ్రంగా నిరసిస్తూ సీజేపీ (సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్) ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యమకారులు భారీ ఎత్తున నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే జులై 20వ తేదీ సోమవారం నాడు సీజేపీ ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది విద్యార్థులు, నిరసనకారులు శాంతియుతంగా ర్యాలీగా బయలుదేరారు. కానీ, అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. శాంతియుతంగా సాగుతున్న ర్యాలీని అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే ఆందోళనకారులపై తీవ్ర స్థాయిలో లాఠీఛార్జ్ ప్రారంభించారు. అంతటితో ఆగకుండా నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు (టియర్ గ్యాస్) గుళ్లనూ ప్రయోగించారు. పోలీసుల అకస్మాత్తు చర్యతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు, ఆందోళనకారులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. శాంతియుత నిరసనకారులపై పోలీసులు సాగించిన ఈ విచక్షణారహిత లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమయ్యాయి. పోలీసుల ముందస్తు హెచ్చరికలు లేని చర్యల వల్లే నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారిందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన పిటిషన్ (పిల్) దాఖలైంది. సీనియర్ న్యాయవాదులు ఎన్. హరిహరన్, గోపాల్ శంకరనారాయణన్, వికాస్ సింగ్‌లు ఈ పిల్ దాఖలు చేశారు. విద్యార్థులు శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తుంటే పోలీసులు భయాందోళనలు సృష్టించారని, మహిళా నిరసనకారులపై కూడా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే రాజ్యాంగబద్ధమైన నిరసన హక్కును కాలరాశారని పిటిషనర్లు వాదించారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజాస్ కరియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నిరసన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పోలీసుల చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సమగ్ర వివరాలతో కూడిన సమాధానాన్ని నాలుగు వారాల్లోగా సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఆందోళన రోజున జరిగిన ఘటనలకు సంబంధించిన కీలక ఆధారాలు వేటినీ తుడిచిపెట్టకుండా భద్రపరచాలని కోర్టు ఆదేశించింది. నిరసన ప్రదేశంలో నమోదైన సిసిటివి (CCTV) ఫుటేజ్, వీడియో గ్రఫీ దృశ్యాలు, పోలీసుల బాడీ క్యామ్ (Body Cam) ఫుటేజ్ వంటి అత్యంత కీలకమైన సాక్ష్యాలను భద్రపరచాలని సూచించింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తమ సమాధానం దాఖలు చేసిన తర్వాత అవసరమైతే రీజాయిండర్లు దాఖలు చేసేందుకు పిటిషనర్లకు హైకోర్టు అనుమతించింది. కాగా, ఈ విచారణలో ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG) ఎస్.వి. రాజు హాజరయ్యారు. ఉద్రిక్తతలకు దారితీసిన పరిస్థితులపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కును, పోలీసుల బలప్రయోగాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ విచారణ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. Delhi High Court, CJP Protest Lathicharge, Delhi Police Notice, Sonam Wangchuk Hunger Strike, NEET Paper Leak Protest, PIL on Delhi Police

Publish Date: Jul 22, 2026 7:19PM

MOVIE NEWS