ఆటోల బంద్ లేదు.!
Publish Date:Aug 24, 2026
Advertisement
తెలంగాణవ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కావాల్సిన ఆటో, క్యాబ్ డ్రైవర్ల నిరవధిక సమ్మెను చివరి నిముషంలో విరమించుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాతిక లక్షలకు పైగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఆదివారం(ఆగస్టు 23) అర్ధరాత్రి నుంచి విధుల బంద్ వేయాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ యాప్ బేస్డ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం (ఆగస్టు 24)ఉదయం నుంచి నగర రవాణా వ్యవస్థ స్తంభించిపోతుందని, విపరీతమైన రద్దీతో తీవ్ర ఇబ్బందులు తప్పవని నగరవాసులు ఆందోళన చెందారు. అయితే ఈ సంక్షోభ పరిస్థితులను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీ ప్రతినిధులు, ఆటో సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ నాయకులు రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం, 2012 తర్వాత ఇప్పటివరకు మార్పులేని ఆటో మీటర్ చార్జీలను సవరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, అలాగే, ప్రైవేట్ రైడ్, హెయిరింగ్ యాప్స్ ఓలా, ఉబెర్, ర్యాపిడోల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, ఐటీ శాఖ ద్వారా ప్రభుత్వం స్వయంగా ఒక ప్రభుత్వ రైడ్-హెయిరింగ్ యాప్‌ను అభివృద్ధి చేస్తుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారనీ, దీంతో సమ్మె విరమించామని యూనియన్ నాయకులు ప్రకటించారు. అంతేకాకుండా, నగరంలో పెట్రోల్, డీజిల్ ఆటోలను పర్యావరణహిత విద్యుత్ (ఈవీ) వాహనాలుగా మార్చుకోవడానికి ఒక్కో ఆటోకు లక్షన్నర రూపాయల మేర ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సమ్మతించింది. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆటో డ్రైవర్లకు ఏటా 12 వేల రూపాయల ఆర్థిక సహాయం, ప్రమాద బీమా 5 లక్షల రూపాయల పునరుద్ధరణ డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి చర్చించి సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో సమ్మె విరమించినట్లు నాయకులు ప్రకటించారు. Auto bandh called off, Telangana auto drivers strike, Ponnam Prabhakar auto union talks, Hyderabad auto fare revision, Telangana govt auto ride app, Hyderabad city transport news
http://www.teluguone.com/news/content/auto-bandh-called-off-24-229645.html





