సింగిల్ పాయింట్ అజెండాతో పాయకరావుపేటలో వై.కా.పా.పోటీ!
Publish Date:Jun 4, 2012
Advertisement
సింగిల్ పాయింట్ ఎజెండాతో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చేందుకు సమాయత్తమైంది. వైఎస్ ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్న ప్రచారాన్నే అజెండాగా రూపొందించుకున్న వై.కా.పా.తన ప్రత్యర్దులకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ మాజీలే కావటం గమనార్హం. కాంగ్రెస్, టిడిపి, వై.కా.పా. ల నుంచి పోటీ పడుతున్న ఈ మాజీల్లో ఎవరు ఎమ్మెల్యే అవుతారన్న ప్రశ్న నియోజకవర్గ పరిస్థితి అధ్యయనంలో ఉన్న పరిశీలకులకు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరుపున గంటెల సుమన, తెలుగుదేశం పార్టీ తరుపున చెంగల వెంకట్రావు, వై.కా.పా. తరుపున గొల్ల బాబురావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాపు, వెలమ, మత్స్యకార ఓటర్లు కీలకం. వీరు ఎటువైపు మొగ్గితే అటువైపు వారు గెలుపొందుతారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ఎక్కువసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందింది. గంటెల సుమన, కాకరనూకరాజు, చెంగల వెంకట్రావు ఆ పార్టీ తరుపున గెలుపొందారు. 2009 ఎన్నికల్లో మార్పు వచ్చి కాంగ్రెస్ అభ్యర్థి గొల్లబాబురావు గెలుపొందారు. ఆయన వై.కా.పా.లో చేరి తన పదవి వదిలేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాంగ్రెస్ పెద్దలు అందరూ గొల్లబాబురావు చేతకాని తనం వల్లే ఉప ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు చురకవేశారు. ఈ తరహాలో ఒకరిపై ఒకరు దుమ్మేత్తిపోసుకుంటూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వై.కా.పా. తరుపున మాజీ మంత్రి కొణతాలరామకృష్ణ ప్రచార బాధ్యతలు చేపట్టారు. సిపిఎం తరుపున లోకనాధం, బిజెపి తరుపున చక్రవర్తి కూడా పోటీలో ఉన్నారు. ఏమైనా సింగిల్ పాయింట్ ఎజెండాను నమ్ముకున్న వై.కా.పా. భవిష్యత్తుకు ఈ నియోజకవర్గం నిదర్శనంగా మిగులుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ap-byelections-2012-24-14607.html





