అమరావతిలో పీఎన్బీ పెట్టుబడి.!
Publish Date:Jul 23, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ హబ్ గా, ఫ్యూచర్ డిజిటల్ రివల్యూషన్ కు వేదికగా రూపుదిద్దే దిశగా మరొక కీలకమైన అడుగుపడింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలలో ಒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపింది. అమరావతి కేంద్రంగా ప్రపంచ స్థాయి నాణ్యత కలిగిన క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పేందుకు పిఎన్‌బి భారీ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం, సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు , క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యంత అధునాతన సాంకేతిక రంగాలలో పరిశోధనలు, ఆవిష్కరణలను వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ అవగాహనా ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశోక్ చంద్రతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ రంగ నిపుణులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిలో సాంకేతిక మౌలిక వసతులను కల్పించడం, ఆర్థిక సేవల రంగాన్ని ఆధునీకరించడం, డిజిటల్ లావాదేవీలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంక్ అమరావతిలో ఇటువంటి అధునాతన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఏపీ పారిశ్రామిక, సాంకేతిక పురోగతికి ఎంతగానో దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఈ క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఎదురవుతున్న నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిష్కారాలను అన్వేషిస్తుంది. సాంప్రదాయక బ్యాంకింగ్ వ్యవస్థలు రూపాంతరం చెంది పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారిన తరుణంలో.. సైబర్ మోసాలు, విదేశీ హాకింగ్ దాడులు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగానికి పెద్ద సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో, క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ సహాయంతో బలమైన సైబర్ భద్రతా వ్యవస్థలను నిర్మించడం, ఆర్థిక నేరాలను ముందుగానే గుర్తించి నివారించడం, ఖాతాదారుల వ్యక్తిగత, ఆర్థిక డేటాకు రక్షణ కల్పించడం వంటి అంశాలపై ఈ హబ్ దృష్టి సారిస్తుంది. ఈ ఇన్నోవేషన్ హబ్ కేవలం ఒక బ్యాంకింగ్ లేదా పరిశోధనా కార్యాలయానికే పరిమితం కాకుండా, విస్తృతమైన, క్రియాశీలకమైన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ అంటే టెక్ ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తుంది. ఈ హబ్ ద్వారా కొత్తగా ఆరంభించే స్టార్టప్‌లు, ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, క్వాంటమ్ పరిశోధనా సంస్థలు, పరిశ్రమల అధిపతులు, ప్రభుత్వ ఏజెన్సీలు ఒకే వేదికపైకి రానున్నాయి. ఈ భాగస్వామ్యాల ద్వారా క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ కొత్త ఆలోచనలకు, నూతన ప్రయోగాలకు, ఆవిష్కరణలకు మార్గం సుగమం కానుంది. నూతన సాంకేతిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతో పాటు, యువ పరిశోధకులకు, ఇంజనీర్లకు ప్రాక్టికల్ ప్రాజెక్టులలో శిక్షణ ఇచ్చి, డిజిటల్ రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం కీలకం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా డీప్ టెక్నాలజీలు, క్వాంటమ్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేపట్టిన ఈ ఇన్నోవేషన్ హబ్ ప్రాజెక్టు అమరావతి వికాసంలో, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక ప్రయాణంలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రజా బాహుళ్యంలో డిజిటల్ అక్షరాస్యతను పెంచడంతో పాటు, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, నమ్మకమైన డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇటువంటి పరిశోధనా కేంద్రాలు ఎంతో దోహదపడతాయని చంద్రబాబు చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే, అమరావతి వేదికగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ చేపట్టిన ఈ క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ అనేక ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను మోసుకొస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని ప్రాంతంలో వందలాది ఉన్నత స్థాయి ఐటీ, క్వాంటమ్ రీసెర్చ్ డేటా, సైన్స్ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అమరావతి పరిసరాల్లోని ఇంజనీరింగ్, రీసెర్చ్ కళాశాలల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో భాగస్వామ్యమయ్యే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా, పిఎన్‌బి బాటలోనే మరిన్ని జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, వెంచర్ క్యాపిటలిస్టులు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, పిఎన్‌బి, ఏపీ ప్రభుత్వాల ఈ భాగస్వామ్యం సురక్షిత డిజిటల్ ఫ్యూచర్ వైపు ఆంధ్రప్రదేశ్ వేస్తున్న కీలక ముందడుగు అని చెప్పడంలో ఇసుమంతైనా సందేహం లేదు. Amaravati Quantum Finance Innovation Hub, Punjab National Bank, AP Investment, Quantum Valley, Cybersecurity,PNB AP Government MoU
http://www.teluguone.com/news/content/amaravati-quantum-finance-innovation-hub-36-226911.html





