మెడికల్ హబ్ గా అమరావతి: తుల్లూరులో ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ కు చంద్రబాబు శంకుస్థపన.!
Publish Date:Sep 24, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పాలనా కేంద్రంగానే కాదు.. బహుముఖ అభివృద్ధి కేంద్రంగా దూసుకెడుతోంది. అమరావతి కేంద్రంగా అన్ని రంగాలలోనూ సమగ్ర అభివృద్ధికి చిరునామాగా శరవేగంగా అడుగులు వేస్తున్నది. తాజాగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి వైద్య సేవల హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికపై చంద్రబాబు సర్కర్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రముఖ ఆసుపత్రులు, వైద్య సంస్థలు అమరావతికి తరలివచ్చాయి. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, కిమ్స్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అమరావతిలో ప్రతిష్టాత్మక ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ నూతన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. . రాజధాని అమరావతి పరిధిలోని తుల్లూరులో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగు రాష్ట్రాలలో వందలాది కంటి ఆస్పత్రులను నిర్వహిస్తున్న ఎల్వీ ప్రసాద్ సంస్థ.. ఇప్పుడు అమరావతి కేంద్రంగా తన సేవలను విస్తరించడం రాష్ట్ర ప్రజలకు ఎంతో లాభదాయకమన్నారు. గతంలో రాష్ట్రంలో సరైన వైద్య వసతులు లేవని, మౌలిక ఆరోగ్య సౌకర్యాల కొరతపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ్యక్తమయ్యాయని సీఎం గుర్తుచేశారు. అటువంటి లోపాలను సరిదిద్దాలంటే బలమైన, పటిష్టమైన వైద్య మౌలిక సదుపాయాలను నిర్మించడం అత్యంత కీలకమన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ వల్ల రాబోయే కాలంలో ప్రజలకు నాణ్యమైన వైద్యం లభిస్తుందని తెలిపారు. అమరావతిని ఒక మెడికల్ హబ్‌గా మార్చే ఈ ప్రయత్నంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, కిమ్స్ వంటి పలు ప్రముఖ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో నివసించే నిరుపేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అమరావతిలో ఒక్కొక్కటిగా ఏర్పాటవుతున్న సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రులు కేవలం రాజధాని ప్రజలకే కాక, చుట్టుపక్కల జిల్లాల ప్రజల ఆరోగ్య అవసరాలను కూడా పెద్ద ఎత్తున తీర్చనున్నాయి. అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యుల సేవలు ఒకే చోట లభించడం వల్ల రోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుందని పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వ చొరవతో అమరావతి భవిష్యత్తులో దేశీయ వైద్య రంగంలోనే ఒక అగ్రగామి నగరంగా రూపాంతరం చెందుతుందని విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రఖ్యాత హెల్త్‌కేర్ సంస్థలు అమరావతిలో తమ శాఖలను ప్రారంభించేందుకు ముందుకు వస్తున్నాయన్నది అధికార వర్గాల సమాచారం. రానున్న రోజులలో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగంలో ఒక చరిత్రాత్మకమైన మైలురాయిని చేరుకోవడం తథ్యమని వైద్య నిపుణులు భావిస్తున్నారు. [Amaravati Medical Hub, Chandrababu Naidu, LV Prasad Eye Institute, AP Healthcare Infrastructure, Tulluru Foundation, AP News, Telugu One]
http://www.teluguone.com/news/content/amaravati-medical-hub-43-232307.html





