అప్పుడు కుమారస్వామి... ఇప్పుడు అజిత్ పవార్... దేవెగౌడ మాదిరిగా శరద్ పవార్...
Publish Date:Nov 23, 2019
Advertisement
మహారాష్ట్రలో నెలరోజులుగా సాగుతోన్న రాజకీయ హైడ్రామాకు ఎవ్వరూ ఊహించనివిధంగా ఎండ్ కార్డ్ పడింది. ముఖ్యమంత్రి పదవి కోసం తన మూల సిద్ధాంతాలకు భిన్నంగా కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన జతకట్టగా... బీజేపీ సైతం తామేమీ తక్కువ కాదంటూ, తన విధానాలకు వ్యతిరేకంగా ఎన్సీపీతో కలిసి హడావిడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి శివసేనకు షాకిచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమనడానికి ఇది మరో ఉదాహరణ. అయితే, శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చర్చలు జరుపుతుండగానే, పవార్ మేనల్లుడు అజిత్.... బీజేపీ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడమే కాంగ్రెస్, శివసేన జీర్జించుకోలేకపోతున్నాయి. అజిత్ ప్రమాణస్వీకారం చేసేవరకు తనకేమీ తెలియదంటోన్న శరద్ మాటలపైనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే కర్నాటకలో జరిగింది. 2004 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. జేడీఎస్ పరోక్ష మద్దతుతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, కొద్దిరోజులకే కుప్పకూలింది. అయితే, బీజేపీతో చేతులు కలిపిన ఆనాటి జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమారస్వామి... 2006 ఫిబ్రవరి 4న కర్నాటక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే, సెక్యులర్ పార్టీగా ముద్రపడిన జేడీఎస్.... బీజేపీతో చేతులు కలపడంపై ఆనాడు తీవ్ర విమర్శలు వచ్చాయి. కుమారస్వామి తండ్రి, జేడీఎస్ అధినేత దేవెగౌడ దీనిపై విచిత్రంగా స్పందించారు. కుమారస్వామి తనకు చెప్పకుండానే బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడని తప్పించుకున్నారు. అలా, ఏడాదిన్నరపాటు కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు దేవెగౌడ మాదిరిగానే, ఇప్పుడు శరద్ పవార్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్, శివసేన అంటున్నాయి. శరద్ పవార్ కు తెలియకుండానే అజిత్ పవార్.... బీజేపీతో చేతులు కలపారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోడీని శరద్ పవార్ కలిసినప్పుటి నుంచే ఈ అనుమానాలు కలిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకపక్క కాంగ్రెస్, శివసేనతో చర్చలు జరుపుతూనే, గుట్టుచప్పుడు కాకుండా శరద్ పవార్ బీజేపీకి మద్దతిచ్చారని భావిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ajit-pawar-takes-oath-as-maharashtra-deputy-cm-39-91516.html