జమిలీ పై తొలిఅడుగు .. ఇక్కడ నుంచి ముందడుగు అనుమానమే!?
Publish Date:Dec 19, 2024
Advertisement
భారతీయ జనతా పార్టీ జమిలీ ఎన్నికల ప్రక్రియ లో తొలి అడుగు వేసింది. 129వ రాజ్యాంగ సవరణకు ప్రథమ అంకాన్ని పూర్తి చేసింది. వారం క్రితం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కేబినెట్ ఆమోదించిన అనంతరం దీనిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. 220-148 ఓట్లతో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి లభించింది. దాంతో జేపీసీ కి బిల్లు పంపడానికి మార్గం సుగమం అయింది. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఈ బిల్లుపై కేవలం ప్రజలు,అధికారులు,మాజీ స్పీకర్లు తదితరుల అభిప్రాయాలను సేకరిస్తుందే తప్ప నిర్ణయం తీసుకోదు. దానికి 90 రోజుల గడువు ఇస్తారు. అవసరమైతే గడువు పోడిగిస్తారు.ఈ కమిటీలో 31 మంది సభ్యులుంటారు. అత్యధికంగా అధికారపార్టీ సభ్యులు ఉంటారు. ఈ బిల్లుకు అనుకూలంగా తెలుగు రాష్ట్రాలలోని టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఓటు వేశాయి. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్,సమాజ్ వారీ పార్టీ, వామపక్షాలు సహా ఇండియా కూటమి పార్టీలు ఓటు వేశాయి.జమిలీ ఎన్నికలకు ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలి. 129వ రాజ్యాంగ సవరణ చేయాలంటే సభలో మూడింట రెండు వంతుల మేజార్టీ లభించాలి. .అలాగే 82ఏ నిబంధన, 83 నిబంధన, అసెంబ్లీ ఎన్నికల కాలపరిమితికి 172వ నిబంధన, 327 నిబంధన లకు పార్లమెంట్ ఆమోదిస్తేనే జమిలీ ఎన్నికలు సాధ్యమౌతుందని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర పతి గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. అప్పటి నుంచి ఐదేళ్ల కాల పరిమితి లెక్కిస్తారు. ఆ తరువాతే జమిలి ఎన్నికలు .అంటే టెక్నికల్ గా 2034 వరకూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదు. పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 67 శాతం మంది సభ్యుల మద్దతు అవసరం. అంటే 362మంది లోక్ సభలో,164మంది రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు పలకాల్సి ఉంటుంది. కాని 543 సభ్యులున్న లోక్ సభ లో ఎన్డీఏకు 293, ఇండియాకూటమి 234 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో245 సభ్యుల్లో ఎన్డీఏకు 125,మిగిలిన పార్టీలకు 88 మంది సభ్యుల బలం ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందడం దాదాపు అసాధ్యం. ఈ బిల్లు చట్టమయితే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. ఇవి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఒకే సారి జరుగుతాయి. కాని ఐదేళ్ల కాలపరిమితి లోగా అసెంబ్లీలో అధికార పార్టీ బలం తగ్గితే ఏమి చేయాలన్న దానిపై స్పష్టత లేదు. .అలాగే పార్లమెంటులో హంగ్ ఏర్పడి మధ్యలో ప్రభుత్వం కుప్ప కూలితే మధ్యంతర ఎన్నికలకు అవకాశం ఉంటుందా? అప్పుడు అసెంబ్లీల పరిస్థితి ఏమిటని ప్రశ్నకూ సమాధానం లేదు. జమిలీ ప్రస్తావన రాజ్యాంగంలో లేకపోవడం కూడా ఒక అవరోధమేనని చెప్పాలి. అన్నిటికీ మించి జమిలి ఎన్నికలు అన్నది ఏదో కొత్తగా కొండను తవ్వి కనుగొన్నది కాదు. స్వాతంత్య్రానంతరం 1952,1967లలో దేశంలో జరిగినవి జమిలి ఎన్నికలే. కనుక జమిలి అంటూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న హడావుడి అఃసంబద్ధంగానే కనిపిస్తోంది. రాష్ట్రాలలో లేదా కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే పరిస్థితి ఏమిటన్నదానిపై స్పష్టత లేకుండా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ చేస్తున్న హడావుడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
http://www.teluguone.com/news/content/ist-step-towards-jamili-elections-39-190082.html