కొత్త సంవత్సరం.. అమరావతికి నవశకం
Publish Date:Dec 20, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కొత్త సంవత్సరంలో నవశకం ఆరంభం కానుంది. జగన్ ఐదేళ్ల హయాంలో అన్ని విధాలుగా భ్రష్ఠుపట్టించిన రాజధాని నిర్మాణ పనులు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజథాని ఉండాలన్న ఉద్దేశంతో చంద్రబాబు 2014లో అధికారం చేపట్టిన తరువాత చేసిన ప్రయత్నాలు ఫలించే దశలో రాష్ట్రంలో 2019లో ప్రభుత్వం మారింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీసి అమరావతిని నిర్వీర్యం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా కష్టాలూ పెట్టారు. ఇటు అమరావతిని పాడుపెట్టారు. దీంతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలింది. అయితే 2024ఎన్నికలలో రాష్ట్రప్రజలు జగన్ ను తిరస్కరించి మళ్లీ చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు. దీంతో అమరావతికి జవసత్వాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతేనని నిర్ద్వంద్వంగా చాటిన చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులను పరుగులెత్తిస్తున్నారు. జనవరి నుంచి నిర్మాణ పనులు షురూ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ కలల రాజదాని అమరావతి కొత్త ఏడాదిలో సరి కొత్త రూపం సంతరించు కోనున్నది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో రాజధాని నిర్మాణ పనులు అటకెక్కాయి. ఆ ప్రాంతం అంతా కీకారణ్యంగా మారింది. రెండు మాసాల క్రితం ఈ ప్రాంతాన్ని నిర్మాణాలకు అనువుగా మార్చేందుకు గాను జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించి పూర్తి చేశారు. అంతే కాక సీడ్ యాక్స్చేస్ రోడ్డు దేదీప్యమానంగా వెలుగులీనడం మొదలైంది. అంతే కాక ఇటీవల సిఎం చంద్రబాబు నాయుడు మంత్రి పొంగూరు నారాయణతో కలసి పలు మార్లు నిర్వహించిన సీ ఆర్ డి ఎ సమీక్షల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి నుంచి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వేలాది కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మూడు రాజధానులంటూ డ్రామాలాడిన వైసీపీ ఎన్నికలకు ముందు విశాఖలో సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభించి లబ్ధి పొందాలని చూసింది. అదే సమయంలో విపక్షంలో ఉన్న కూటమి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తాము అమరావతి రాజధానికే మద్దతిస్తున్నట్లు ప్రకటించేశాయి. అదే సమయంలో ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చే తీర్పు రాజధానికి కీలకంగా మారింది. మరోవైపు అమరావతి రాజధానికి ప్రజల మద్దతు సంపాదించేందుకు కూటమి పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అనూహ్య స్ధాయిలో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో వైసీపీ మూడు ముక్కలాటకు చెక్ పడింది. అమరావతికి తిరిగి ప్రాణం వచ్చింది. గత ఐదేళ్లుగా వైసీపీ ఆడిన మూడు రాజధానుల ఆటతో అమరావతి నష్టపోయింది. ముఖ్యంగా అక్కడ ప్రభుత్వాన్నినమ్మి ఏకంగా 36 వేల ఎకరాల భూమిని స్వచ్చందంగా ఇచ్చిన రైతులు ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి వారికి సకాలంలో ఇస్తామన్న కౌలు రావడం అందలేదు. ప్రతీ ఏటా హైకోర్టుకు వెళ్లి మరీ రైతులు కౌలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాజధాని అమరావతే అన్న స్పష్టత వచ్చేసింది. ఐదేళ్ల పాటు ఏపీ రాజధాని అంటే ఏదనే ప్రశ్నకు ఇక తావు లేకుండా పోయింది. ఇక కోర్టుల్లో గతంలో రైతులు దాఖలు చేసిన కేసులు వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభం కానుంది. కూటమి సర్కార్ కూడా అమరావతిలో వేగంగా అడుగులేస్తోంది. వచ్చే జనవరి నుంచి అమరావతిలో పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. అలాకూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే రాజధానిపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మూడేళ్ల కాల వ్యవధి పెట్టుకుని తెలుగుదేశం కూటమి సర్కార్ అమరావతి పూర్తి లక్ష్యంగా ముందుకు కదులుతోంది.
http://www.teluguone.com/news/content/new-era-to-amarawati-in-new-year-39-190106.html