అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు.. బీజేపీ సెల్ఫ్ గోల్?
Publish Date:Dec 20, 2024
Advertisement
భారత పార్లమెంట్ లో హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేడ్కర్ పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ను అవమానించేందుకు బీజేపీ సాహసించడమంటే.. భవిష్యత్ లో భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి వారి సొంత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు రెడీ అయిపోయిందనడానికి సంకేతమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ వాదులంతా బిజెపి ఆలోచనలు, విధానాలను తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బిజెపి, దాని మిత్ర పక్ష పార్టీలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి ఉన్న రాష్ట్రాల్లో అంబేద్కర్ ను ఆరాధించే వారు జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల వద్దకు వెళ్లి పూలమాలలు వేయడంతో పాటు అంబేద్కర్ కు జేజేలు పలుకుతూ బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరఃసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో జమిలి ఎన్నికల బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎన్డీఏ ప్రభుత్వం వేసింది. ఈ అంశంపై చర్చ జరిగే సమయంలో హోం మంత్రి అమిత్ షా నోరు పారేసుకున్నారు. అంబేద్కర్... అంబేద్కర్... అంబేద్కర్... అని ఇన్నిసార్లు ఆ పేరు జపించే బదులు... అన్ని సార్లు దేవుడి పేరు జపిస్తే ఏడు జన్మలకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. దీంతో పార్లమెంట్ లో మాటల మంటలు రేగాయి. పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ కు, ఇండియా కూటమి పార్టీలకూ అమిత్ షా తన వ్యాఖ్యల ద్వారా మంచి ఆయుధాన్ని అందించారు. దేవుడి పేరు చెప్పి అంబేద్కర్ ను అవమానించారంటూ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో గళమెత్తారు. దీంతో సహనం కోల్పోయిన బిజెపి నేతలు ఒకరి తరువాత ఒకరు విరుచుకు పడ్డారు. ఒకసారి అంబేద్కర్ ను అవమానించిన తరువాత దానిని సరిదిద్దుకునే విధంగా అమిత్ షా ప్రసంగించినా ఫలితం లేకపోయింది. అమిత్ షా వ్యాఖ్యలను సమర్థిస్తూ ఒకటికి మూడు సార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. అయినా మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు కూడా ఆందోళనలు వెళ్లాయి. బిజెపి తనను తాను సమర్థించుకునేందుకు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఇండియా కూటమి ఎంపీలను పార్లమెంట్ లోకి రాకుండా అడ్డుకోవడం సంచలనం సృష్టించింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాల ధాటికి బిజెపి కూటమి తట్టుకోలేక పోతోందనడానికి దీనిని ఉదాహరణగా చెప్పవచ్చు. అంతెందుకు అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించడానికి స్వయంగా ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగాల్సి వచ్చిందంటేనే.. ఆ వ్యాఖ్యలు బీజేపీకి ఎంత నష్టం చేకూర్చాయో అవగతమౌతోంది. రాజకీయ పరిశీలకులు అమిత్ షా వ్యాఖ్యలను బీజేపీ సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు. గౌతమ్ అదాని వ్యాపార లావాదేవీలలో లంచాలు ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నారని అమరికా దర్యాప్తు సంస్థ తేలుస్తూ అక్కడి కోర్టుకు వివరాలు అందించడంతో అంతర్జాతీయంగా భారత్ పరువు పోయిందని, వెంటనే అదానీపై చర్యలు తీసుకోవాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని పట్టుబట్టింది. ఒకవైపు అదానీ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తుండగా దాని నుంచి డైవర్ట్ చేయడానికే అమిత్ షా అంబేద్కర్ పై ఈ రకమైన వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అమిత్ షా వ్యాఖ్యల కారణంగా బీజేపీ ప్రతిష్ఠ గతంలో ఎన్నడూ లేని స్థాయికి మసకబారింది. అదానీ ముడుపుల వ్యవహారాన్ని మించి అమిత్ షా వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్ని చేకూర్చాయి. భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా బేషరతుగా క్షమాపణలు చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బయట నుంచి ఎంపీలు పార్లమెంట్ లోపలికి వచ్చే ద్వారం వద్ద మెట్లపై బిజెపి, దాని మిత్ర పక్ష ఎంపీలు కూర్చొని కాంగ్రెస్ వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని బిజెపి కూటమి నిరసనకు దిగింది. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాల సభ్యులను సభలోకి వెళ్లనీయకుండా బీజేపీ ఎంపీలు అడ్డుపడటంతో నాలుగు రోజుల కిందట జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఓ బీజేపీ ఎంపీ గాయపడ్డారు. దీంతో గొడవ ముదిరి పాకాన పడింది. తనను కూడా నెట్టి కింద పడేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే తన బాధను వ్యక్తం చేశారు. ఇరు వర్గాల ఎంపీలు పార్లమెంట్ స్ట్రీట్ లోని పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ ఖడ్ లకు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ డిఫెన్స్ లో పడిందనడంలో సందేహం లేదని పరిశీలకులు చెబుతున్నారు. పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానిస్తూ అమిత్ షా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటంతో బీజేపీలో కంగారు మొదలైందనీ, అందుకు తార్కానమే.. రాహుల్ గాంధీ తో పాటు ఇండియా కూటమి ఎంపీలను లోపలికి పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడమని అంటున్నారు. ఖర్గే, రాహుల్ కాంబినేషన్ బాగా కుదరటంతో బిజెపి కూటమిని పార్లమెంట్ లో ఇండియా కూటమి గుక్కతిప్పుకోకుండా చేస్తోంది. అంబేద్కర్ ను అవమానించడమంటే కోన్ని కోట్ల మంది బలహీన వర్గాల వారిని అవమానించడమేననీ, రాజ్యాంగాన్ని అవమానించడమేనన్న భావన ప్రజల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ఇది కచ్చితంగా బీజేపీకి ముందున్నది గడ్డుకాలమేనని చెప్పడానికి ఆస్కారమిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ గండం నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో చూడాల్సిందేనంటున్నారు.
http://www.teluguone.com/news/content/amit-shah-comments-on-ambedkar-39-190136.html