ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజులా..నిమ్స్‌లో అక్రమాల దందా.!
Publish Date:Nov 23, 2026
Advertisement
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.! రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే అక్రమాలు చోటుచేసుకున్నాయా? పేద రోగులకు అండగా నిలవాల్సిన ఆరోగ్యశ్రీ పథకం నిధులే పక్కదారి పట్టాయా? హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టెండర్ల నుంచి క్యాంటీన్ నిర్వహణ వరకు, మెడికల్ షాపుల నుంచి ఆపరేషన్ థియేటర్ల వరకు పలు విభాగాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా రోగులు మరణించిన తర్వాత కూడా వారి పేర్లపై బిల్లులు ప్రాసెస్ చేసినట్లు గుర్తించడం విస్మయానికి గురిచేస్తోంది. రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు.. ఆపరేషన్ థియేటర్లలోనే నిల్వ.! నిమ్స్‌లో అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్, కార్మిక శాఖ అధికారులతో కలిసి చేపట్టిన ఈ తనిఖీల్లో పలు కీలక అవకతవకలు బయటపడ్డాయి. ఆపరేషన్ థియేటర్లలో సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య పరికరాలను సరఫరాదారులు అనధికారికంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ఆసుపత్రి ప్రధాన స్టోర్ నుంచి సరైన ఇండెంట్ ప్రక్రియ లేకుండానే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నేరుగా సరఫరాదారుల నుంచి ఇంప్లాంట్లు తీసుకుంటున్నట్లు తేలింది. వాటిని వినియోగించిన తర్వాత యుటిలిటీ సర్టిఫికెట్లు జారీ చేసి బిల్లుల చెల్లింపులకు పంపుతున్నట్లు గుర్తించారు. వాస్తవంగా వినియోగించని ఇంప్లాంట్లకు కూడా బిల్లులు సృష్టించే అవకాశం ఉందని ఏసీబీ ప్రాథమిక పరిశీలనలో అనుమానించింది. చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులా.? బిల్లుల ప్రాసెసింగ్‌లో వెలుగుచూసిన అంశాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా వారి పేర్లపై బిల్లులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో రోగులు మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసినట్లు వెల్లడైంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగుల డిశ్చార్జి అనంతరం సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లుల ఎంట్రీలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజులా.? వైద్య సామగ్రి వినియోగానికి సంబంధించిన రికార్డుల్లోనూ అసాధారణ లెక్కలు బయటపడ్డాయి. ఒక్క రోగికి కేవలం ఒక వారంలోనే 800 సర్జికల్ గ్లౌజులు వినియోగించినట్లు నమోదు కావడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఇలాంటి అనుమానాస్పద లెక్కల్లో అధికభాగం ఆరోగ్యశ్రీ రోగులకు సంబంధించినవేనని గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. లైసెన్స్ లేకుండానే క్యాంటీన్.! రోగులకు, వారి సహాయకులకు ఆహారం అందించాల్సిన ప్రధాన క్యాంటీన్‌లోనూ నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. అపరిశుభ్ర వాతావరణంతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ లేకుండానే క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు తేలింది. కార్మిక చట్టాల ఉల్లంఘనలతో పాటు క్యాంటీన్ టెండర్లలో పోటీ వ్యతిరేక విధానాలు, బిడ్డర్ల మధ్య కుమ్మక్కు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. టెండర్లు, నియామకాల్లోనూ నిబంధనలకు తిలోదకాలు.! 2019 నుంచి 2025 వరకు మ్యాన్‌పవర్ సేవలకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. కార్మికుల నియామకాలు, వారిని సెమీ స్కిల్డ్ కేటగిరీకి మార్చే విషయంలోనూ నిబంధనలు పాటించలేదని వెల్లడించింది. ఈ వ్యవహారంలో కుమ్మక్కు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారంటీ ఏమైంది.? నిమ్స్ భద్రతా సిబ్బంది సేవలకు సంబంధించిన టెండర్ల ఖరారులో అసాధారణ జాప్యం జరిగినట్లు, కాంట్రాక్టులను పదేపదే పొడిగించినట్లు అధికారులు గుర్తించారు. డిఫాల్ట్ అయిన ఓ ఏజెన్సీకి చెందిన రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారంటీని కూడా స్వాధీనం చేసుకోలేదని ఏసీబీ వెల్లడించింది. మెడికల్ షాపుల్లోనూ అక్రమాల అనుమానాలు.! ఆసుపత్రిలోని మెడికల్ షాపుల నిర్వహణలోనూ నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. తప్పనిసరిగా నిర్వహించాల్సిన విక్రయ రికార్డులను సక్రమంగా నమోదు చేయకపోవడంతో పాటు, అర్హతకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లేని సిబ్బందిని నియమించుకున్నట్లు గుర్తించారు. మెడికల్ షాపుల కేటాయింపులకు సంబంధించిన టెండర్ ప్రక్రియపైనా అధికారులు దృష్టి సారించారు. ఏసీబీ చేతికి కీలక దస్త్రాలు.. మరింత లోతుగా దర్యాప్తు.! ఈ తనిఖీల సందర్భంగా నోట్ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు, ఇతర కీలక దస్త్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెలుగుచూసిన ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించేందుకు ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేటాయించే ప్రజాధనం, ఆరోగ్యశ్రీ నిధులు, వైద్య పరికరాల కొనుగోళ్ల చుట్టూ ఇన్ని అవకతవకల ఆరోపణలు వెలుగుచూడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రోగుల ప్రాణాలతో ముడిపడిన వైద్య వ్యవస్థలో ఇలాంటి నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? కోట్లాది రూపాయల లావాదేవీల వెనుక అసలు కథేంటి? ఏసీబీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: వెస్ట్ బెంగాల్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్త పేరు ఇదే.! మీకు నచ్చవచ్చు: 11 రోజులకే రీఎంట్రీ.. మళ్లీ NVIDIA సీఈవోగా జెన్సన్ హువాంగ్.!
[ NIMS, ACB Raids, NIMS Corruption, Medical Scams, Healthcare Fraud, Health Aarogyasri, Medical Implants, Surgical Gloves, Hospital Irregularities, Telangana ACB, Hyderabad NIMS, Hospital Billing Scam, Tender Irregularities, Government Hospitals ]
http://www.teluguone.com/news/content/-nims-25-237799.html




