వైఎస్సార్ చివరి కోరిక.. రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం : సీఎం రేవంత్
Publish Date:Sep 2, 2026
Advertisement
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..! ఢిల్లీలో నిర్వహించిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నెహ్రూ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాల కారణంగానే దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతులు చేసే స్థాయికి చేరుకుందని అన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించే చర్యలను దేశంలో తొలిసారిగా చేపట్టిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంతో సోనియాగాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేయడం, పీడీఎస్ విధానం ద్వారా రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందించడం వంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని అన్నారు. తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామంటే.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలే అందుకు పునాది అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంపై తొలి సంతకం చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. అప్పట్లో రూ.1,300 కోట్ల విద్యుత్ బకాయిలను రద్దు చేసి, రైతులపై కేసులను ఎత్తివేసి వారి గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు. తెలంగాణలో సాగునీటి విస్తరణకు ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వంటి ప్రాజెక్టులకు వైఎస్సార్ హయాంలో శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు ప్రస్తుతం నిలిచిపోయాయని, వాటిని పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులకు రేవంత్‌రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. వైఎస్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదని అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన జీవిత లక్ష్యమని వైఎస్సార్ చెప్పారని గుర్తుచేశారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే ఆయన మరణించారని అన్నారు. దేశ ప్రజలు ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో నాయకుడు ప్రజలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశానికి బలమైన నాయకత్వం అవసరమని, రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే వైఎస్సార్‌కు నిజమైన నివాళి అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ప్రజల మద్దతు అవసరమని పిలుపునిచ్చారు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేద్దామని రేవంత్‌రెడ్డి అన్నారు. (YS Rajasekhar Reddy, YSR Awards 2026, Revanth Reddy, Telangana CM Revanth Reddy, Rahul Gandhi, Rahul Gandhi PM, YSR Legacy, YSR Last Wish, Congress Party, Mallikarjun Kharge, Telangana Politics)
http://www.teluguone.com/news/content/(ys-rajasekhar-reddy-24-230549.html





