ఎఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాహుల్?
posted on Jan 19, 2013 4:59PM
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధిని ఎ.ఐ.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏ క్షణాన్నయినా నియమించవచ్చునని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఆయన కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకునిగా కొనసాగుతున్నప్పటికీ అధికారికంగా ఒక సీనియర్ హోదా ఇచ్చే సమయం ఎంతో దూరంలో లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. జైపూర్‌లో కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న మేధోమథన సదస్సులో దేశ రాజకీయ పరిస్థితులతో పాటు రాహుల్ గాంధీకి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించే అంశంపై కూడా చర్చించారు.
ఈ విషయమై బహుశ నేడో రేపో అధికార ప్రకటన వెలువడగలదని భావిస్తున్నారు. రాహుల్ గాంధికి ఎ.ఐ.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా లభించినట్టయితే రాహుల్ కు పార్టీ వ్యవహారాలపై పూర్తి పట్టు లభిస్తుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాహులే తమ ప్రధాని అభ్యర్థి అని పార్టీ ఇక అధికారికంగా ప్రకటించాలని కొందరు సీనియర్లు ఇప్పటికే పట్టుపడుతున్నారు. జ్యోతిర్ ఆదిత్య సిందియా, రాజీవ్ శుక్లా లతో పాటు మణి శంకర్ అయ్యర్ వంటి వారు సైతం రాహుల్‌కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.
శనివారం ఉదయం చింతన్ శిబిర్ చర్చలు ప్రారంభం కావడానికి ముందు పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని రాహులే నడిపిస్తారని, ప్రధాని అభ్యర్థి కూడా రాహుల్ గాంధీయేనని అని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ నాయకుడు జితేందర్ ప్రసాద కూడా ఇవే మాటలు మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో పార్టీని నడిపించేదీ రాహులే, దేశాన్ని నడిపించేది కూడా రాహులే అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి నాయకత్వం అప్పగించాలని దిగ్విజయ్ సింగ్ కూడా సూచిస్తున్నారు.
ఒకరి ఒకే పదవి అనే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని రాహుల్ గాంధీ శనివారం చింతన్ శిబిర్‌లో సూచించారు. జోడు పదవులను నాయకులు అన్ని స్థాయిల్లో వదులుకోవాలని ఆయన సూచించారు. పార్టీలో సామాజిక న్యాయాన్ని తెస్తామని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.