జగన్ కుర్చీలో నల్లులు!

జగన్ పెట్టక పెట్టక శుక్రవారం నాడు తాడేపల్లి ప్యాలెస్‌ పక్కనే వున్న పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్‌మీట్‌కి జర్నలిస్టులను ఆహ్వానించారు. కెమెరాలు మాత్రం వద్దన్నారు. ఎందుకంటే, జగనన్న ఏదేదో సొల్లు అంతా మాట్లాడతారు. ఆ ఫుటేజ్‌తో మీమర్లు, ట్రోలర్లు పండగ చేసుకుంటారు. అందుకని వేరే కెమెరాలేవీ వద్దు. మీరు మాత్రం రండి.. జగన్ చెప్పిందంతా విని వెళ్ళండి అని పిలిచారు. ప్రెస్‌మీట్‌లో జగన్ తాను చెప్పాలని అనుకున్న అబద్ధాలు రెండు గంటలపాటు చెప్పీ చెప్పీ బుర్ర తిన్నారు. ఆ వీడియో ఫుటేజ్‌ని చక్కగా ఎడిటింగ్ చేసి, ట్రిమ్మింగ్ చేసి, జగనన్న తడబాట్లు, పొరపాట్లు, అలవాట్లు, గ్రహపాట్లు,  అన్నీ తీసేసి మిగిలిన ఫుటేజ్‌ని మీడియాకి విడుదల చేశారు. ఎంత ట్రిమ్ చేసినా, ఆ ఫుటేజ్‌లో జగనన్నయ్య లీలలు లేకుండా వుంటాయా? ఇప్పుడు విడుదల చేసిన ఫుటేజ్‌లో కూడా ట్రోలర్స్.కి, మీమర్స్.కి కావలసినంత ఫుటేజ్ వుంది. తెలుగు పండిట్ జగన్ గారు కనిపెట్టిన కొత్తకొత్త తెలుగు పదాలు వున్నాయి. ఇంకా ఎన్నెన్నో వింతలు, విశేషాలు వున్నాయి. వీడియో సంగతి అలా వుంచితే, జగన్ మాట్లాడాల్సిందంతా అయిపోయింది. ఈలోపుగా ఈ జగన్ ఎప్పుడు సుత్తి ఆపుతాడా, ఎప్పుడు ప్రశ్నలు అడుగుదామా అని ఎదురు చూస్తున్న జర్నలిస్టులు తమ ప్రశ్నలను ఆయన మీద సంధించారు. ఇద్దరు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే, జగన్ వాటికి చెప్పాల్సిన సమాధానం కాకుండా వేరే రకమైన సమాధానాలు చెప్పారు. చివరికి సదరు ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులకు కూడా తాము ఏ ప్రశ్నలు అడిగామో కూడా మర్చిపోయే పరిస్థితిని జగన్ తెచ్చారు. ఇంతలో ఒక లేడీ జర్నలిస్టు ‘‘రెండు ప్రశ్నలు సర్’’ అని అడగటం ప్రారంభించగానే, జగన్ తన కుర్చీలో నల్లులు కుట్టినట్టుగా టక్కుమని లేచి నిల్చున్నారు. జగన్ లేచి నిల్చున్న తీరు చూసి, అక్కడున్న జర్నలిస్టులకి జగన్ని కుర్చీలో వున్న  నల్లులు బాగా కుట్టాయేమో అనిపించింది. కానీ ఆ తర్వాత జగన్ ఎక్స్.ప్రెషన్ చూసి నల్లులు కుట్టడం కాదు.. ఆయన మీడియా నుంచి పిల్లిలాగా పారిపోతున్నారని అర్థమైంది. చిట్టచివరికి, ఇంతకీ జగన్ తమని ఎందుకు పిలిచారో అర్థం కాని జర్నలిస్టులు బుర్రలు గోక్కుంటూ బయటపడ్డారు.
Publish Date: Jul 26, 2024 7:48PM

చంద్రబాబుపై కథనాలకు గౌరవ డాక్టరేట్

చంద్రబాబునాయుడు  తీసుకున్న నిర్ణయాలు సైతం ఇప్పటికీ ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటాయి.తాను రాసిన విశ్లేషణాత్మక కథనాలతో పాటు ఎన్నికల ముందు జనబాహుళ్యంలో అత్యంత ఆదరణ పొందిన చంద్రబాబు ఎక్స్ ఓ అనంత భావ జాలికుడు పుస్తకం లోని అంశాలు తనకు గౌరవం దక్కేందుకు దోహదపడ్డాయని  గుంటూరుకు చెందిన సీనియర్ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ అన్నారు. ఆయన కు గౌరవ డాక్టరేట్ లభించింది.  అమెరికాలోని సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ జర్నలిజం విభాగానికి సంబంధించి ఈ డాక్టరేట్ అందజేసింది. ఢిల్లీలోని హోటల్ సామ్రాట్ లో  జరిగిన కార్యక్రమంలో కెనడా కాన్సులేట్ జనరల్ డాక్టర్ జానీష్ దర్బియా చేతుల మీదుగా ఈ డాక్టరేట్ అందుకున్నారు. కార్యక్రమంలో సౌత్ వెస్టర్న్ అమెరికన్ యూనివర్సిటీ ట్రస్టీ డాక్టర్ కె ఎల్ కంజు, ప్రఖ్యాత గజల్ గాయకురాలు పద్మశ్రీ పెనాజ్ మసానీ, నేపాల్ కాన్సులెట్ జనరల్ డాక్టర్ కే ఎల్ శర్మ, సీనియర్ జర్నలిస్టు అభిషేక్ తదితర ప్రముఖులతో పాటు, పారిశ్రామిక, వ్యాపార, సామాజిక సేవా రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై రాసిన విశ్లేషణాత్మక కథనాలు, చంద్రబాబు X.O -  అనంత భావజాలికుడు పుస్తకం ను పరిగణలోకి తీసుకొని తనకు ఈ పురస్కారాన్ని అందజేసినట్లు భావిస్తున్నాను అని శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. తనకు ఈ  గౌరవం లభించటానికి ఎపి రేరా మాజీ చైర్మన్ డాక్టర్ రామనాథ్ వెలమాటి మార్గదర్శనమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. తనకు లభించిన ఈ గౌరవం డాక్టర్ రామనాథ్ కే దక్కుతుందని ఆయన చెప్పారు.
Publish Date: Jul 26, 2024 6:42PM

అప్రూవర్ బాటలో కవిత..!

కేసీఆర్ ముద్దుల కూతురు కవిత జీవితంలో తాను ఎదుర్కొంటానని ఎంతమాత్రం ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కవిత మాత్రమే కాదు.. ఆమె ఇప్పుడున్న పరిస్థితి ఆమె శత్రువులు కూడా ఊహించనిది. తీహార్ జైల్లో ఇన్ని నెలలు వుండటం అనేది మామూలు విషయం కాదు. కవిత లాంటి మహిళ ఇన్ని నెలలపాటు జైల్లో వున్న తర్వాత ఎంత పేరు, ప్రఖ్యాతి వున్నా ఏం లాభం.. ఎన్ని కోట్లు సంపాదించినా ఏం లాభం? తాజా పరిస్థితులనుబట్టి ఆగస్టు 8 వరకు కవిత ఖాయంగా జైల్లోనే వుంటారు. ఆ తర్వాత కస్టడీ మళ్ళీ పొడిగించే అవకాశాలు కూడా వున్నాయి.  ఇంతకాలం యువరాణిలా, మహారాణిలా ఒక వెలుగు వెలిగిన కవిత తీహార్ జైల్లోని పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారు. జైల్లో పడ్డానన్న డిప్రెషన్‌తోపాటు అక్కడి ఆహారం, దోమలు, చుట్టుపక్కల వున్న పరిస్థితులు కవితని పూర్తిగా క్రుంగదీశాయి. దాంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆస్పత్రికి కూడా వెళ్ళి, చికిత్స తరవాత తిరిగి జైలుకు రావాల్సి వచ్చింది. కవిత అనారోగ్య పరిస్థితిని చూసి అయినా ఆమెకి బెయిల్ లభిస్తుందని ఆమె కుటుంబ సభ్యులు ఆశించారు. కానీ, చట్టం ఆమె చేసిన నేరం గురించే ఆలోచిస్తోంది తప్ప, ఆమె ఆరోగ్యం గురించి కాదు. కస్టడీని పొడిగించుకుంటూనే వెళ్తోంది. కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ ఢిల్లీలోనే మకాం వేసి కవితకి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ చూసుకుంటున్నారు. కవిత ఆస్పత్రిలో చేర్చినప్పుడు ఆమె పరిస్థితిని చూసి అనిల్ కుమార్ కన్నీరు పెట్టుకున్నారని సమాచారం. ఆ సమయంలో భార్యాభర్తలు మాట్లాడుకునే అవకాశం దొరికినప్పుడు, తాను ఈ నరకం ఇక భరించలేనని, అప్రూవర్ అయిపోతానని, ఆ దిశగా ప్రయత్నాలు చేయమని కవిత భర్తని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కవిత అప్రూవర్ అవడం అంటే, నేను మద్యం కుంభకోణానికి పాల్పడ్డాను... విచారణకు పూర్తిగా సహకరిస్తాను అని నేరాన్ని పూర్తిగా ఒప్పుకోవడం. ఇదే కుంభకోణంలో భాగస్వాములుగా వున్న కొంతమంది అప్రూవర్లుగా మారి హ్యాపీగా బయట తమ పనులు తాము చేసుకుంటున్నారు. అప్రూవర్‌గా మారడం అందరి విషయం వేరే.. కవిత విషయంలో మాత్రం వేరేగా వుంటుంది. కవిత అప్రూవర్‌గా మారితే, అది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తునే భస్మీపటలం చేసేస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కి మానసికంగా చాలా దూరమైపోయారు. కవితగనుక అప్రూవర్‌గా మారడం అంటూ జరిగితే, ఇక బీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ కుటుంబం అన్నా తెలంగాణ సమాజం పట్టించుకోదు.  కవిత భర్త అనిల్ కుమార్ కవిత అప్రూవర్ అవుతానని అంటున్నట్టు కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇదే ప్రతిస్పందన ఎదురైనట్టు తెలుస్తోంది. కవిత దారిన కవిత అప్రూవర్ అయిపోతే ఇక తమ పార్టీకి, తమ కుటుంబానికి తెలంగాణలో ఎంతమాత్రం విలువ వుండదని, కాబట్టి కవిత ఆలోచన కరెక్ట్ కాదని కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు వ్యతిరేకించినట్టు సమాచారం. అలా అయితే కవితను జైల్లోంచి బయటకి తెచ్చే మార్గమేదైనా మీ దగ్గర వుందా అని అనిల్ కుమార్ అడిగితే, వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం రానట్టు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా కవితను జైల్లోంచి బయటకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయకపోతే కవితకు అప్రూవర్ అవడం తప్ప వేరే మార్గం లేదని అనిల్ కుమార్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
Publish Date: Jul 26, 2024 6:02PM

ఐదేళ్లలో జగన్ చేసిన అప్పు అక్షరాలా 6 లక్షల 86 వేల 955 కోట్లు!

మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అక్షరాలా ఆరులక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఔను తన ఆర్థిక అరాచకత్వంతో జగన్ రాష్ట్రాన్ని దివాళా అంచుకు చేర్చేశారు. 2109 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 3లక్షల 75 వేల 975 కోట్ల రూపాయలు కాగా, 2019 మే లో జగన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టింది. ఎన్నికలలో పరాజయం పాలై గద్దె దిగే సమయానికి రాష్ట్ర అప్పులు 9 లక్షల 74 లక్షల 556 కోట్ల రూపాయలు. అంటే ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం అక్షరాలా 6 లక్షల 86 వేల 955 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. వీటిలో ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు రూ.4,38,278లు కాగా, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 2,48,677 రూపాయలు. అసెంబ్లీ  వేదికగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (జులై26) విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించిన గణాంకాలివి. ఈ సందర్భంగా చంద్రబాబు.. అప్పుల పద్దు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నారు. ఇంకా వెలుగులోకి రావాల్సిన అప్పులు చాలా ఉన్నాయన్నారు. జగన్ నిర్వాకం కారణంగా  పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం కారణంగా 52 వేల 900 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. ఈ 52, 900 కోట్ల రూపాయల నష్టంలో 45 వేల కోట్లు ఆయకట్టకు నీటి సరఫరాలో జాప్యం వల్ల వాటిల్లిందనీ, 4900 కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు జరిగిన డ్యామేజీ, రిపేర్ల వల్ల వాటిల్లింది. జల విద్యుత్ ఉత్పత్తిలో జాప్యం వల్ల 3వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. శ్వేతపత్రం ద్వారా ఈ వివరాలన్నీ వెల్లడించిన చంద్రబాబు.. ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయకుండా ఉండి ఉంటే.. ప్రభుత్వానికి జీఎస్పీపీ కాంట్రిబ్యూషన్ ద్వారా 52వేల 900 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి ఉండేదన్నారు. అమరావతి పనుల నిలుపు దల వల్ల ప్రభుత్వానికి రెండు నుంచి మూడు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు. 
Publish Date: Jul 26, 2024 4:51PM

కమలా.. కుమ్మేయ్!

అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పేరు ఖరారు అయ్యే దశలో వున్న నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా నుంచి ఆమెకు మద్దతు లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష పదవికి పోటీ నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేరు ముందుకు వచ్చింది. అయితే బరాక్ ఒబామా మొదటి నుంచి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. తన భార్య మిచెల్ ఒబామాను అధ్యక్ష పదవికి అభ్యర్థిగా బరిలోకి దించడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయితే డెమోక్రటిక్ పార్టీలో కమలా హ్యారిస్‌కే ఎక్కువ మద్దతు లభిస్తూ వుండటంతో ఒబామా ఫ్యామిలీకి కూడా కమలా హ్యారీస్‌కి మద్దతు ప్రకటించక తప్పలేదు.
Publish Date: Jul 26, 2024 4:18PM

తాకట్టులో విశాఖ నగరం!

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా పేర్కొంటూ ఐదేళ్లు గడిపేశారు. మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేయడం వినా ఆయన చేసిందేమీ లేదు. అయినా విశాఖ రాజధాని అంటూ ఉత్తరాంధ్రప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడానికి శతథా ప్రయత్నించారు.అయినా ఐదేళ్లలో ఆ దిశగా ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు. విశాఖ రాజధాని అంటూ రుషికొండకు గుండు కొట్టేసి..  వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాలను ప్రభుత్వ సొమ్ముతో సొంతానికి నిర్మించుకున్నారు. సరే ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత విశాఖ రాజధాని పేరిట జగన్ పాల్పడిన ఆర్థిక అరాచకత్వం వెలుగులోకి వస్తోంది.  అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం (జులై 26) విడుదల చేసిన శ్వేత పత్రంలో రాజధాని అంటూ కబుర్లు చెబుతూ నగరంలోని ఆస్తులను తాకట్టు పెట్టేసి 1,941 కోట్ల రూపాయలు రుణాలను దండుకొన్నట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో ఎప్పుడు తరిమెల నాగిరెడ్డి తాకట్టులో భారత దేశం అనే పుస్తకం రాశారు. ఇప్పుడు జగన్ విశాఖ నగరాన్నే తాకట్టు పెట్టేశారు. విశాఖ నగరంలో పలు ప్రభుత్వ ఆస్తులను జగన్ అప్పుల కోసం తాకట్టు పెట్టేశారు. అలా తాకట్టు పెట్టిన వాటిలో  ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి, పోలీసు క్వార్టర్లు, ట్రెయినింగ్ అండ్ ప్రొడక్షన్ సెంటర్ ఫర్ డిసెబుల్ వెల్ఫేర్, ఈఈ బంగ్లా, ఆర్ అండ్ బీ క్వార్టర్లు, రైతు బజార్, సర్క్యూట్ హౌస్, పీడ్బ్ల్యూడీ కార్యాలయం సీతమ్మధార తహసిల్దార్ కా ర్యాలయంవంటివి ఉన్నాయి. ఇవన్నీ నగరం నడిబొడ్డులో ఉన్నాయి. చివరాఖరికి రైతు బజారును  కూడా జగన్ సర్కార్ తాకట్టు పెట్టేసింది. రాజధాని విశాఖ అని జగన్ ఎంతగా నమ్మబలికినా విశాఖ జనం విశ్వసించలేదు. అందుకే ఇటీవలి ఎన్నికలలో విశాఖలో జగన్ పార్టీ ఒక్కటంటే ఒక్కస్థానం కూడా గెలుచుకోలేకపోయింది. విశాఖ నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. విశాఖ పార్లమెంటు స్థానాన్ని కూడా వైసీపీ భారీ తేడాతో చేజార్చుకుంది.  
Publish Date: Jul 26, 2024 4:17PM

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ళ సూత్రధారి మృతి

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ (52) మరణించాడు. చర్లపల్లి జైలులో వున్న మక్బూల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతనికి నెల క్రితం గుండె ఆపరేషన్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మూత్రపిండాలు కూడా విఫలం కావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు పేలుళ్ళలో మక్బూల్ హస్తం వున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ కేసులో మక్బూల్‌కి ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. ఆరు నెలల క్రితం మక్బూల్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ట్రాన్సిట్ వారంట్ మీద హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. 21 ఫిబ్రవరి, 2013న దిల్‌సుఖ్‌నగర్‌లో రద్దీగా వుండే ప్రాంతంలో మక్బూల్ బాంబులు పేల్చాడు. ఆ పేలుళ్ళలో 17 మంది మరణించారు.
Publish Date: Jul 26, 2024 3:12PM

నితి ఆయోగ్ ముందు పోలవరం.. బాబు అజెండా ఇదే!

పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే భరించాలి. అలా భరిస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవలి తన బడ్జెట్ ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారు కూడా. పోలవరం పూర్తికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అయితే పోలవరం కు ఈ బడ్జెట్ లో కేటాయింపు ఎంత అన్నది ఆమె అంకెల్లో చెప్పలేదు. దీంతో పోలవరం పూర్తి అవ్వడానికి ఎంత కావాలి. ఎంత సమయం పడుతుంది అన్న విషయంలో పలు సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి.  ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరంలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులెత్తించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, సమయం వంటి అంశాలపై శనివారం(జులై27) జరిగే నీతి అయోగ్ సమావేశంలోనే చర్చకు తీసుకురావాలని నిర్ణయించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, పోలవరం ఎత్తు అంశాలపై నీతి అయోగ్ సమావేశంలో లేవనెత్తి పోలవరం విషయంలో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకోవాలని బావిస్తున్నారు. పోలవరం ఎత్తుపై తెలంగాణ వ్యక్తం చేసిన అభ్యంతరాలను వీటో చేయడానికి నీతి అయోగ్ సమావేశమే సరైన వేదికగా భావిస్తున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం ఎత్తుతగ్గించే ప్రశక్తే లేదన్న స్టాండ్ కు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్త డయాఫ్రం వాల్ కు బదులుగా రింగ్ ఫెన్సింగ్ నిర్మాణం అంటూ తొలుత విదేశీ నిపుణులు ప్రాథమిక నివేదిక ఇచ్చినా, తరువాత సవరించి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణమే శరణ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో కూడా ఎటువంటి ద్వైదీ భావం లేకుండా కొత్త డయాఫ్రం వాల్ నిర్దుష్ట కాలపరిమితిలో నిర్మించే విషయంలో కూడా నీతి అయోగ్ సమావేశంలో ఒక స్పష్టత  వచ్చేలా చంద్రబాబు చర్చించనున్నారు.   
Publish Date: Jul 26, 2024 2:53PM

నేటి నుంచే ప్యారిస్ ఒలింపిక్స్!

ఫ్యాషన్‌కి పుట్టిల్లు అయిన ప్యారిస్ నగరంలో నేటి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. విశ్వక్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్యారిస్ నగరం సిద్ధమైంది. కరోనా మహమ్మారి ముప్పు తొలగిన తర్వాత నిర్వహిస్తున్న మెగా ఈవెంట్‌ ఇది. క్రీడా ప్రపంచానికి చిరకాలం గుర్తుండి పోయే విధంగా అత్యంత వైభవంగా ఆరంభ వేడుకలను నదిలో నిర్వహించాలని ఫ్రెంచ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో అత్యంత భారీ భద్రతా ఏర్పాట్లతో ఒలింపిక్స్ వేడుకలు జరగనున్నాయి. దాదాపు 45 వేల మంది రక్షణ బలగాలను వినియోగించనున్నారు. ఫ్రాన్స్‌ దేశం ఒలింపిక్స్.కిఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. తొలిసారి 1900 సంవత్సరంలో, రెండోసారిగా 1924లోజరిగాయి. ఇప్పుడు సరిగ్గా వందేళ్ళ తర్వాత ఫ్రాన్స్ ఒలింపిక్స్ నిర్వహిస్తోంది. అమెరికా (4సార్లు), బ్రిటన్‌ (3సార్లు) తర్వాత అత్యధికంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్న దేశంగా ఫ్రాన్స్‌ రికార్డులకెక్కనుంది. మొత్తమ్మీద 206 దేశాల నుంచి 10,500 మంది క్రీడాకారులు  ఈ క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Publish Date: Jul 26, 2024 2:37PM

జగన్ సరికొత్త కానుక ‘కాస్కారం’!

గిట్టనివాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే జగన్‌ని ‘నత్తి పకోడీ’ అంటూ వుంటారుగానీ, నిజానికి ఆయన ఒక గొప్ప భాషా శాస్త్రవేత్త. ఆయన ఎప్పటికప్పుడు కొత్తకొత్త పదాలను తెలుగు భాషకు, తెలుగు జాతికి అందిస్తూ వుంటారు. ఆ విధంగా ‘జగన్ తెలుగు నిఘంటువు’లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త తెలుగు పదాలు చేరుతూ, తెలుగు భాషను సుసంపన్నం చేస్తూ వుంటాయి. తాజాగా, శుక్రవారం నాడు ఆయన ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఎవరూ కెమెరాలతో రావద్దు, చేతులు ఊపుకుంటూ రండి, మేం ఇచ్చే ఫుటేజ్ తీసుకెళ్ళండని ముందే ‘హెచ్చరిక’ జారీ చేశారు. సరే, ఆ విషయం అలా వుంచితే, ఈ ప్రెస్‌మీట్లో జగన్ మరో కొత్త పదాన్ని తెలుగు భాషకి అందించారు. ఆ పదం ఏమిటంటే, ‘కాస్కారం’. జగన్ మాట్లాడుతూ ‘కాస్కారం’ అన్నప్పుడు, అక్కడ వున్న జర్నలిస్టులకు అర్థంకాక జుట్టు పీక్కున్నంత పని చేశారు. ఆలోచించగా, ఆలోచించగా అర్థమైంది ఏమిటంటే, జగన్ ‘తాత్సారం’ అనే మాటని ‘కాస్కారం’ అని అందంగా పలికారన్నమాట.. అసలు పదాన్ని మరోరకంగా మలిచారన్నమాట అని జర్నలిస్టులకు అర్థమైంది. 
Publish Date: Jul 26, 2024 2:00PM

శాంతి భర్త ఆందోళన.. నన్ను చంపేస్తారట!

గిరిజన మహిళ అయిన తన భార్య శాంతిని ట్రాప్ చేసి, విజయసాయిరెడ్డి చట్ట వ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ శాంతి భర్త మదన్‌మోహన్ రాజీలేని పోరాటం చేస్తున్నారు. తన భార్యతో సంబంధం పెట్టుకుని, అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని శాంతి భర్త మణిపాటి మదన్‌మోహన్, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లకు వారు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారికి నాలుగు పేజీల లేఖను పంపారు. ఆ లేఖలో... ‘‘అగ్రకులానికి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ మాజీ న్యాయవాది సుభాష్‌రెడ్డి తమ అధికారం, ధన, కండ బలాన్ని ఉపయోగించి నా భార్య శాంతిని లోబరుచుకున్నారు. ఆమెతో సంబంధం పెట్టుకుని చట్టవ్యతిరేకంగా బిడ్డను కన్నారు. ఈ విధంగా షెడ్యూల్డ్ ట్రైబ్స్.కి చెందిన వ్యక్తిగా నాకున్న హక్కులను హరించారు. నా వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా నా హక్కులను హరించినందుకు వారిద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వేధింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నా భార్యకు పుట్టిన మగబిడ్డకు తండ్రెవరో తేల్చాలి. ఈ అక్రమ సంబంధం గురించి నేను మీడియాకి బహిర్గతం చేసిన తర్వాత కొందరు వ్యక్తులు నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. తనకు సన్నిహితంగా వున్న పెద్దల పేర్లను బహిర్గతం చేశానన్న కోపంతో నా భార్య శాంతి కూడా నన్ను బెదిరిస్తూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరిస్తోంది. ఆమెకు ఒకవైపు అసాంఘిక శక్తులు, మరోవైపు బ్యూరోక్రాట్లతో సన్నిహిత సంబంధాలు వున్నాయి. ప్రస్తుతం విజయసాయిరెడ్డి, పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి, నా భార్య శాంతి.. ముగ్గురూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం వుంటున్నారు. అందువల్ల వారిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవలసిందిగా పోలీసులకున ఆదేశించాలని కోరుతున్నాను’’ అని మదన్ మోహన్ పేర్కొన్నారు. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ ఏపీ భవన్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మదన్‌మోహన్, ఎస్సీ, ఎస్టీ, బహుజన సంఘాల ప్రతినిధులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.
Publish Date: Jul 26, 2024 1:41PM

ఏపీ మద్యం స్కామ్‌లో బీజేపీ జీవీఎల్ పాత్ర!

ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్‌లో భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాత్ర వున్నట్టు తెలుస్తోంది. జగన్ పార్టీలోని ఒక మాజీ ఎంపీతో కలసి జీవీఎల్ నరసింహారావు మద్యం స్కామ్‌కి పాల్పడినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీవీఎల్ నరసింహారావు బ్యాంకు లావాదేవీల మీద సీఐడీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సుమారు 40 కోట్ల రూపాయలు జీవీఎల్ నరసింహారావు ఖాతాలో చేరినట్టు సమాచారం. జీవీఎల్ నరసింహారావుకు వైఎస్సార్సీపీతో సీక్రెట్ సంబంధాలు వున్నాయి. అందుకే గత ఎన్నికలలో బీజేపీ నుంచి ఆయన టిక్కెట్ ఆశించినప్పటికీ పార్టీ నాయకత్వం ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.  ఆంధ్రప్రదేశ్ బీజేపీ తులసి వనంలో గంజాయి మొక్కతో పోల్చదగ్గ నాయకుడిగా జీవీఎల్ నరసింహారావును భావిస్తారు. 2014లో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన సమయంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు మధ్య అంతరం పెరగడానికి జీవీఎల్ నరసింహారావు వ్యవహారశైలే ప్రధాన కారణంగా చెబుతూ వుంటారు. వైసీపీతో రహస్య సంబంధాల కారణంగానే జీవీఎల్ అప్పట్లో అలా వ్యవహరించి వుంటారన్న అనుమానాలు కూడా వున్నాయి. మొత్తమ్మీద జీవీఎల్ నరసింహారావు మీద బీజేపీ నాయకత్వానికి నమ్మకం పోవడం వల్లే ఆయన్నీ దూరం పెడుతూ వస్తోంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో కూడా ఈయన పాత్ర వుందని తెలుస్తున్న నేపథ్యంలో ఆయన భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
Publish Date: Jul 26, 2024 1:05PM

వైసీపీలో మొదలైన రాజీనామాల పర్వం!?

అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ నేతలు, శ్రేణులలో జగన్ నాయకత్వంపై విశ్వాసం సడలుతోంది. ఓటమిని హుందాగా అంగీకరించడం పోయి.. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టీ పట్టగానే ఆ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిందంటూ హస్తినకు వెళ్లి మరీ ధర్నా చేసి రావడాన్ని ఆ పార్టీలోనే మెజారిటీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఒకరి వెంట ఒకరుగా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తూ రాజీనామాల బాట పట్టారు. గత వారం రోజులుగా ప్రతి రోజూ ఎవరో ఒక నేత వైసీపీకి రాజీనామా చేసిన వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా పార్టీకి దూరం అవుతున్నారు. పార్టీ అధినేత జగన్ తీరు పట్ల అసంతృప్తితోనే పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించి మరీ రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ ఘోర పరాజయానికి కారణమైన అంశాలపై సమీక్ష చేయడం, ఆత్మవిమర్శ చేసుకోవడం, తప్పులను సరిదిద్దుకుని మళ్లీ ప్రజా విశ్వాసం పొందాలన్న ఉద్దేశం లేశమాత్రంగానైనా జగన్ లో కనిపించకపోవడంతో వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనౌతున్నారు. ఆ కారణంగానే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పార్టీని ముందుండి నడిపించాల్సిన జగన్  పార్టీని, పార్టీ నేతలను, క్యాడర్ ను పట్టించుకోకుండా, ఓట మికి కారణాలపై సమీక్ష నిర్వహించకుండా, అధికారంలో ఉండగా ఎంతో గొప్పగా పాలించాం, అయినా జనం తిరస్కరించారంటూ ప్రజలను నిందిచడం పట్ల పార్టీ నేతలు,   శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆ విషయాన్నిబాహాటంగా ప్రకటిస్తూనే రాజీనామాలు చేస్తున్నారు.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఇద్దరు కీలక నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్,  జిల్లా కోశాధికారి, ఏలూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ మంచెం మైబాబు రాజీనామా చేశారు. ఈ ఇద్దరు నేతలు   వైసీపీలో కీలకంగా పనిచేశారు. ముఖ్యమైన ఇద్దరు నేతలు పార్టీని వీడటంతో వీరితో పాటు వీళ్ల అనుచరులు సైతం వైసీపీకి దూరం అయ్యారు.  మరికొందరు సీనియర్లు సైతం జిల్లాలో వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పార్టీ విధి, విధానాలు నచ్చకపోవడంతోనే శ్రీనివాస్, మైబాబు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతల రాజీనామా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.   వాస్తవానికి ఇంకా చాలామంది నాయకులు వైసీపీని వదిలి ఇతర పార్టీల్లో చేరాలనే అభిప్రాయంతో ఉన్నప్పటికీ ఇతర పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో  గత్యంతరం లేక ఇంకా పార్టీలో కొనసాగుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఒక్కసారి కూటమి పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ దాదాపు ఖాళీ అయిపోతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  నుంచి సిగ్నల్ వస్తే మాత్రం వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Publish Date: Jul 26, 2024 12:05PM

జగన్ హయాంలో విధ్వంసం.. ఆర్థిక శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం!

వైసీపీ హయాంలో  జరిగిన విధ్వంసంపై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆ వరుసలో శుక్రవారం (జులై 26) ఏడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్నారు. అసెంబ్లీ వేదికగా మధ్యాహ్నం ఈ శ్వేల పత్రాన్ని విడుదల చేస్తారు. ఇంత వరకూ అమరావతి, పోలవరం, శాంతి భద్రతలు, మద్యం కుంభకోణం, సహజవనరులు, గనులు,  విద్యుత్ రంగంపై ఇప్పటికే ఆరు శ్వేత పత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అత్యంత కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.  వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు సందర్బాలలో గణాంకాలతో సహా వివరించిన సంగతి తెలిసిందే. జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్థిక శాఖలో చోటుచేసుకున్న అవకతవకలు, అప్పులు, ఇతర అక్రమాలపై లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణచయించిన చంద్రబాబు  ప్రభుత్వం  2019-24 మధ్య లక్షా 41 వేల 588 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్లు తేల్చింది. 93 వేల కోట్లు సీఎఫ్​ఎమ్​ఎస్​లోకి అప్​లోడ్ చేయలేదనీ, అలాగే  48 కోట్ల మేర బిల్లులు అప్​లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదనీ గుర్తించింది. నీటిపారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్​లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19 వేల 324 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు, ఆర్థిక శాఖ నుంచి 19 వేల 549 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నట్లు అధికారులు ఇప్పటికే చంద్రబాబుకు నివేదించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14 వేల కోట్లకు పైగా బకాయిలు, మున్సిపల్ శాఖలో 7 వేల 700 కోట్ల బకాయిలు కలిపి మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు శాసనసభలో ఆర్థికశాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.  ఈ శ్వేత పత్రం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై జగన్ విధ్వంసాన్ని చంద్రబాబు కళ్లకు కట్టనున్నారు. 
Publish Date: Jul 26, 2024 11:37AM

చంద్ర‌బాబు సూప‌ర్ ఫార్ములా.. కూట‌మి పార్టీల‌ నేత‌ల్లో జోష్‌!

ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ ప‌ద‌వుల‌పై కూట‌మి పార్టీల నేత‌లు ఆశ‌లు పెట్టుకున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేత‌లు, ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి భంగ‌ప‌డిన నేత‌లు నామినేటెడ్ ప‌ద‌వుల్లో త‌మ‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే, కూట‌మిలో మూడు పార్టీలు ఉండ‌టంతో నియోజ‌క‌వ‌ర్గాల వారిగా నామినేటెడ్ ప‌ద‌వుల కేటాయింపు అంశంపై ఆ పార్టీల‌ నేత‌ల్లో ఇన్నాళ్లు ఆందోళ‌న నెల‌కొంది. ముఖ్యంగా జ‌న‌సేన‌, తెలుగుదేశం నేత‌ల మ‌ధ్య ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నామినేటెడ్ ప‌దవుల విష‌యంలో తీవ్ర పోటీ నెల‌కొంది. ఈ క్ర‌మంలో నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో రెండు పార్టీల నేత‌ల మ‌ధ్య విభేదాలు త‌లెత్త‌డం ఖాయ‌మ‌ని, వారి మ‌ధ్య విబేధాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌చ్చ‌ని వైసీపీ అధిష్ఠానం ఆశలు పెట్టుకుంది. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఏఏ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌, తెలుగుదేశం నేత‌ల మ‌ధ్య నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో  భిన్నాభిప్రాయాలు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌నే అంశంపై ఓ డేటా సైతం వైసీపీ పెద్ద‌లు సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే, వారి ఆశ‌ల‌పై నీళ్లు చల్లే విధంగా  చంద్ర‌బాబు నాయుడు సూప‌ర్ ఫార్ములా రూపొందించారు. ఏపీలో  తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి దాదాపు 50 రోజులు కావ‌స్తోంది. అధికారంలోకి వ‌చ్చిన రోజునుంచి సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో అభివృద్ధిపై మంత్రులు దృష్టి సారించారు. వేగంగా అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయి. దీంతో ఐదేళ్లు వైసీపీ అరాచ‌క పాల‌న‌తో విసిగిపోయిన ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు కూట‌మిలోని పార్టీల నేత‌లు నామినేటెడ్ ప‌దువుల‌పై గంపెడాశ‌లు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో నియమితులైన కొందరు ఇప్పటికీ నామినేటెడ్‌ పదవుల్లో కొనసాగుతున్నారు. ఇప్ప‌టికే  తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్‌ పోస్టులు, ఆలయాలు, ట్రస్టు బోర్డు పాలకవర్గాలపై దృష్టి పెట్టింది. మరో వైపు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులపైనా ఆరా తీస్తోంది. అయితే, నామినేటెడ్ ప‌ద‌వుల్లో త‌మ‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని  కూటమిలోని మూడు పార్టీల నేత‌లూ ఆయా పార్టీల‌ అధిష్ఠానాల‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్ర‌మంలో నామినేటెడ్ ప‌దువుల భ‌ర్తీ విషయంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు ఓ ఫార్ములాను రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్ములాను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. చంద్ర‌బాబు నిర్ణ‌యానికి కూట‌మిలోని బీజేపీ, జ‌న‌సేన పార్టీల నేత‌లు సైతం ఆమోదం తెల‌ప‌డంతో మూడు పార్టీల్లోని ద్వితీయ స్థాయి నేత‌ల్లో జోష్ నెల‌కొంది.  సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు నాయుడు కూట‌మి పార్టీల్లోని నేత‌ల మ‌ధ్య ఎలాంటి బేధాభిప్రాయాలూ త‌లెత్త‌కుండా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నారు. పార్టీల బ‌లాబ‌లాల‌ను బేరీజు వేసుకొని ప్ర‌భుత్వంలో అంద‌రికీ త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీయే కూట‌మి అధికారంలోకి రావ‌డానికి మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకంగా పనిచేశార‌ని ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో భ‌ర్తీ చేయ‌బోయే నామినేటెడ్ ప‌దువుల్లో అన్ని పార్టీల నేత‌ల‌కూ అవ‌కాశం క‌ల్పించేలా చంద్ర‌బాబు ఓ ఫార్ములాను తయారు చేశారు. దీని ప్రకారం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల 60 శాతం నామినేటెడ్ పదవులు టీడీపీ నేత‌ల‌కు కేటాయించాలని నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిసింది. మిగిలిన 40 శాతంలో 30శాతం జనసేన నేతలకు, బీజేపీకి 10 శాతం పదవులు కట్టబెడతారని తెలుస్తోంది. అదే విధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60 శాతం జనసేన పార్టీ నేత‌ల‌కు, 30శాతం టీడీపీ, 10 శాతం బీజేపీ నేతలకు నామినేటెడ్ ప‌ద‌వుల్లో అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణయించారని సమాచారం. ఇదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి  50శాతం.. మిగిలిన 50శాతం పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరో సగం పంచుకోవాలని నిర్ణయించినట్లు కూట‌మి నేత‌లు పేర్కొంటున్నారు. చంద్ర‌బాబు తాజా నిర్ణ‌యంతో మూడు పార్టీల నేత‌ల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  రాష్ట్రంలో ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయి. వీటిల్లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి వుంది. వీటిల్లో ఏ పార్టీ నేత‌ల‌కు ఎక్కువ అవ‌కాశాలు ద‌క్కుతాయ‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం  చైర్మ‌న్ ప‌ద‌వి తెలుగుదేశం పార్టీ నేత‌ ద‌క్కే అవ‌కాశాలు ఉన్నాయి. మిగిలిన ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రాల్లో ఏర్పాటు కాబోయే పాల‌క వ‌ర్గాల్లో మూడు పార్టీల్లోని నేత‌ల‌కు ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ స‌మావేశాలు పూర్త‌యిన త‌రువాత నామినేటెడ్ ప‌ద‌వులపై చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, బీజేపీ నేత‌లు దృష్టిసారించ‌నున్నారు. తొలి విడ‌త‌లో 10 నుంచి 15శాతం నామినేటెడ్ ప‌దువుల‌ను భ‌ర్తీ చేయాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఈ పోస్టులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ మూడు పార్టీల నేత‌ల్లో నెల‌కొంది. మొత్తానికి నామినేటెడ్ ప‌దవుల పంప‌కాల విష‌యంలో చంద్ర‌బాబు ఫార్ములా ప‌ట్ల మూడు పార్టీల నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.
Publish Date: Jul 26, 2024 11:17AM