కేసీఆర్ పై నిప్పులు.. జై ఆంధ్రప్రదేశ్‌లో ఉండవల్లి గర్జన
posted on Jan 25, 2013 8:02PM
రాజమండ్రిలో జరుగుతున్న జై ఆంధ్రప్రదేశ్ సభలో పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ నాయకులు కోరినందువల్లే ఆ రోజున ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని స్పష్టం చేశారు. ఎవ్వరూ మాయమాటలు చెప్పి తెలంగాణను కలుపుకోలేదు అని ఆయన వివరించారు. తెలంగాణ నాయకులు అసందర్భ ప్రేలాపనలు ఆపి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని, రెచ్చగొట్టే ప్రకటనలతో విద్వేషాలను రగిలించరాదని ఆయన పిలుపు ఇచ్చారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు పిట్టకథలు చెపుతూ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
స్వాతంత్య్రం అనంతరం నిజాం ప్రభువు భారత దేశంలో ముందు కలవలేదు, ఆ తర్వాత తల వంచి భారత ప్రభుత్వానికి లొంగిపోయారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజాం కాలం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎంతో పొగుడుతూ గర్వంగా చెబుతుంటారని, కాని నిజాం కాలంలో ప్రజలకు కష్టాలే మిగిలినవి తప్ప నైజాం నవాబు గొప్పవాడేం కాదని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమ నేతలు అసందర్భ ప్రేలాపనలు ఆపి చరిత్ర తెలుసుకోవాలని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది నిజాం నవాబు కాదని ఆయన చెప్పారు.
ఆనాటి జవహర్‌లాల్ నెహ్రూ మాటలను వక్రీకరించి వ్యాఖ్యానాలు చేస్తున్న తెలంగాణ ఉద్యమ నాయకులు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు.
జై ఆంధ్రప్రదేశ్ సభలో ఉండవల్లి ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. మధ్య మధ్యలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కె. చంద్రశేఖర రావు, కె. తారక రామారావు, హరీశ్‌రావు, ప్రొఫెసర్ కోదండరాంల ఉపన్యాసాల క్లిప్పింగులను చూపిస్తూ ఉండవల్లి ఈ ఉపన్యాసాలు రెచ్చగొట్టడం కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో తలలు తెగిపడతాయని స్పీచ్‌లు ఇచ్చారని, బట్టలు విప్పి కొట్టాలని పిలుపు ఇచ్చారని, కాని అదేం భాష అని ఆయన నిలదీశారు.