రాష్ట్ర ప్రజలపై తెలంగాణ ఎఫెక్ట్
posted on Jan 27, 2013 7:06PM
తెలంగాణాపై ఇప్పటికిప్పుడు పరిష్కారం అసాద్యం అని గులాం నబీ ఆజాద్ ఈ రోజు తేల్చి చెప్పేయడంతో నెల రోజుల సస్పెన్స్ త్రిల్లర్ సీరియల్ పూర్తయిపోయింది. ఇక, రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దాలు తరువాత దశలో పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలు, మెజార్టీ వగైరాలు మొదలుకానున్నాయి. ఒక విదంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు ఆన్ డ్యూటీలో ఉంటూ తమ ప్రయోజనాలకి అనుగుణంగా పావులు కదుపుతుంటే, విద్యార్దులు, ఉద్యోగులు ఇందులో నష్టపోనున్నారు. విద్యార్దులు విద్యా సంవత్సరాలు కోల్పోతే, నెల జీతం మీద బ్రతులు వెళ్లదీసే ఉద్యోగులు సమ్మెలు చేసి ఆర్దికంగా ఇబ్బందుల్లో పడతారు. రాష్ట్ర విభజన జరిగినా జరుగాకపోయినా రాజకీయ నేతలకి పెద్ద తేడా ఉండదు. గానీ, వారి వెంట తిరిగినందుకు విద్యార్దులు, ఉద్యోగులు మాత్రం నష్టపోక తప్పదు. ఇది చేదు నిజం అని తెలిసినప్పటికీ భావోద్వేగాలు వాటిని కనబడనీయవిప్పుడు.
ఇక, నేటి నుండి తెలంగాణాలో రేగే అలజడి ప్రభావం రాష్ట్ర ప్రజలందరిపైన కూడా పెను ప్రభావం చూపనుంది. ఇప్పటికే, రాష్ట్ర పరిస్థితి దీనావస్థలో ఉంది. అది రేపటి నుండి మరింత దిగజారుతుంది. ముఖ్యంగా సామాన్యులు, మద్య తరగతి వర్గాలు, వ్యాపారస్తులపై ఈ ప్రభావం అధికంగా ఉండబోతోంది. కరెంటు కష్టాలు, ధరల మోతలు మరింత పెరిగి ప్రజల బ్రతుకులు భారంగా మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే పరిశ్రమలు పక్క రాష్ట్రాలకి తరలిపోతున్నాయి. కరెంటు కష్టాలతో ఉన్న కొద్ది పాటి పరిశ్రమలు మూతపడుతుండటంతో కార్మికులు ఉపాది కోల్పోతున్నారు. కరెంటు సమస్య పెరిగిన కొద్దీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. దీనితో, ఇప్పటికే చితికిపోయిన సామాన్య, మద్య తరగతి కుటుంబాలు వీదినపడే ప్రమాదం ఉంది.
కరెంటు సమస్యలు మరింత పెరిగితే వ్యవసాయం కుంటుపడి అది ఆహార ధాన్యాలు, పప్పులు, కూరగాయాలపై కూడా పడుతుంది. ఈ ప్రభావం సమాజం మీద పడక తప్పదు. రాష్ట్రానికి గుండెకాయవంటి హైదరాబాదు స్తంబిస్తే యావత్ రాష్ట్రం మొత్తం విలవిలలాడక తప్పదు.
రాష్ట్రంలో రాజాకీయ పార్టీలన్నీ విజ్ఞతతో సమస్య పరిష్కారానికి క్రుషిచేసినట్లయితే ఈ పెను సవాళ్ళను అవలీలగా అధిగమించవచ్చును.