శైలజ ఉవాచ: కోరికలే దుఃఖమునకు మూల కారణం

 

అలనాడు బోధీ వృక్షం క్రింద తపస్సుచేసిన గౌతమ బుద్దుడు “కోరికలే దుఃఖమునకు మూల కారణం” అని కనుగొనగలిగేడు. ఇప్పుడు తెలంగాణాలో దుఃఖానికి, అశాంతికి కేసీర్ వంటి నేతల కోరికలే కారణమని మంత్రి వర్యులు శైలజానాథ్ తెలిపారు.

 

ఈ రోజు రాజమండ్రీలో పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన జై ఆంధ్రా మహాసభలో ప్రసంగిస్తూ శైలజానాథ్ “ మొదట ఇరుగుపొరుగులను చూసి అసహనం ఏర్పడుతుంది అది క్రమంగా కోపంగా మారి చివరికి ద్వేషంగా మారినప్పుడు ఈ విధమయిన ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ఒకప్పుడు తెలంగాణా ప్రజలను రజాకార్లు, నవాబులు, పెత్తందారులు పీడించుకు తినేవారు. గానీ, ఎప్పుడయితే రాష్ట్రం సమైక్యంగా తయారయిందో అప్పటి నుండి అటువంటి వారు క్రమంగా కనుమరుగయిపోయారు. అంతవరకూ పీడనకు గురయిన పేదలు, దళితులు, బలహీన వర్గాలు, పేద ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకోగలిగేరు. నాటి నుండే వారి జీవితాలలో మార్పు వచ్చింది. ఇదంతా రాష్ట్రం సమైక్యంగా ఉన్నందున సాధ్యమయింది. ఇప్పుడు మళ్ళీ దొరల అహంకారం కలిగిన నేతలు కొందరు రాష్ట్రాన్ని విభజించి మళ్ళీ పాత రోజుల్లోకి ప్రజలను నెట్టాలని చూస్తున్నారు. ఈ విషయాన్నీ తెలంగాణా ప్రజలందరూ గమనించాలి. ఉద్యమాలను నడుపుతున్న వారి నాయకుల ఉద్దేశాలను కూడా గమనించాలి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నపుడే ఎక్కడయినా అభివృద్ధి సాద్యం,” అని అన్నారు.