నిన్న మోత్కుపల్లి, నేడు అయ్యన్నపాత్రుడు

 

నిన్న మొన్నటివరకు తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తనను తెలంగాణాపై పార్టీ నిర్ణయం తీసుకోవడానికి నిర్వహించిన కీలక సమావేశానికి ఆహ్వానించలేదని అలిగి పార్టీకి దూరంగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు తన నల్గొండ జిల్లాలో అడుగుపెడుతున్నపుడు ఆయన అలక వీడి చంద్రబాబుతో కదం కలిపేరు.

 

ఈ రోజు మరో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తన అనుచరుడు పీలా శ్రీనివాసరావుని పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు అలిగి, ఇటీవలే అందుకొన్న పార్టీ పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు విశాఖపట్నంలో ప్రకటించారు. కనీసం తనని కూడా సంప్రదించకుండా, సంజాయిషీ కూడా కోరకుండా తన అనుచరుడిని శిక్షించడం తనకు చాలా బాధ కలిగించిందని మీడియావారికి చెపుతూ, తన పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, పార్టీని మాత్రం వీడట్లేదని తెలిపారు.

 

పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ యన్టీఆర్ 17వ వర్ధంతి సందర్బంగా బండారు సత్యనారాయణ వర్గంపై పీల శ్రీనివాస రావు అనుచరులు దాడి చేసారంటూ బాలకృష్ణ తెలుసుకొని, నల్గొండలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు పిర్యాదు చేయడంతో ఆయన వెంటనే శ్రీనివాసరావుని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ గొడవకి కారణమయిన బండారు సత్యనారాయణ వర్గీయులని శిక్షించడం మాని, తన అనుచరుడిని శిక్షించడం అన్యాయమని అయ్యన్న పాత్రుడు అంటున్నారు.

 

పీలా శ్రీనివాసరావు విషయంలో చాలా వేగంగా స్పందించిన బాలయ్య బాబుకి ఇప్పుడు ఎదురయిన మరో పరీక్షని ఆయన ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి.