కాంగ్రెస్ అత్యుత్సాహమే కొంప ముంచిందా?

 

గత నెల అఖిలపక్ష సమావేశం తరువాత నుండి, మిగిలిన వారి సంగతి ఎలాఉన్నా రాష్ట్రంలో తెలంగాణా, సీమంద్రాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదర్శించిన అత్యుత్సాహమే పరిస్థితిని మరింత క్లిష్ట పరిచిందని చెప్పక తప్పదు. ఒక కీలకమయిన నిర్ణయం తీసుకొంటున్న తరుణంలో ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాలవారు అత్యంత బాధ్యతగా మెలిగి సంయనం పాటించకపోగా, తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసారు.

 

ప్రతీ చిన్న విషయానికి అధిష్టానం నిర్ణయం కోసం డిల్లీ వైపు చూసే కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో మాత్రం పార్టీ గౌరవ ప్రతిష్టలను మసకబారుస్తూ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రజలకి మార్గ దర్శనం చేయవలసిన నేతలే ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొడుతూ, వాటిని అడ్డుపెట్టుకొని గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారు.

 

తీవ్రమయిన ఒత్తిళ్ళ మద్య కీలక నిర్ణయం తీసుకోబోతున్న కాంగ్రెస్ అధిష్టానం సైతం తన నేతలను కట్టడి చేకుండా అలసత్వం ప్రదర్శించి సమస్యని చేజేతులా పీకలమీదకు తెచ్చుకొంది. వారిని ముందే నియత్రించి ఉంటే ఖచ్చితం రాష్ట్రంలో ఇంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఉండేది కాదు అని చెప్పవచ్చును.

 

కాంగ్రెస్ పార్టీలో ఈ రెండు వర్గాలమద్యనే ఐక్యత లేనప్పుడు ఇతరపార్టీలను నిందించి ఏమి ప్రయోజనం. మన బంగారం మంచిదయితే అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు సంయమనం కోల్పోయినప్పుడు, తెరాస వంటి పార్టీలు మాత్రం తమ రాజకీయ ప్రయోజనాలను ఎందుకు వదులుకొంటాయి?

 

ఒక సంక్లిష్టమయిన సమస్యను పరిష్కరించవలసిన మన రాజకీయ పార్టీలన్నీ కూడా తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసం ఆడిన ఈ ఆటలో ప్రజలే అంతిమంగా నష్టపోతున్నారు. నిజం చెప్పాలంటే రాజకీయ అపరికత్వతతో కూడిన స్వార్ద రాజకీయాలే నేటి ఈ పరిస్థితికి కారణమని చెప్పవచ్చును.