తెలుగు తమ్ముళ్ల ఆగ్రహాన్ని చల్లార్చని మంత్రి పార్థసారథి క్షమాపణలు

దేశ రాజకీయ చరిత్రలో కార్యకర్తలే అండగా నిలిచి నిలబెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. గెలుపు, ఓటములను చూఃసింది. ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండగా నిలిచారు. పలు సందర్భాలలో పార్టీకి నేతలు దూరమైనా కార్యకర్తలే పార్టీని భుజాన మోశారు. 

ఈ నలభై రెండేళ్ల ప్రస్తానంలో తెలుగుదేశం ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసింది.   పార్టీలోకి ఎంత మంది వచ్చినా వారందరినీ అక్కున చేర్చుకొని రాజకీయ ఓనామాలు దిద్దించింది.  క్రమశిక్షణతోపాటు రాజకీయంగా జీవితంలో ఎలా ఎదగాలి... ఆ ఎదిగే క్రమంలో ఎలా ఒదిగి ఉండాలో ఓ తల్లిగా.. ఓ తండ్రిగా.. ఓ గురువుగా..   జీవిత పాఠాలను నేర్పించింది. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని కాల పరీక్షకు నిలబడి ఠీవీగా తలెత్తుకు నిలబడిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే.  పార్టీ పని అయిపోయిందంటూ ఇతర పార్టీలు గేలి చేసి.. గోల చేసిన ప్రతి సారి.. గతం కంటే మిన్నగా, గొప్పగా పుంజుకుని పడి లేచిన కెరటంలా నిలబడిన పార్టీ తెలుగుదేశం. పలు సందర్భాలలో ఆ పార్టీకి.. పార్టీ నుంచి అన్నీ పొందిన నేతలు ద్రోహం చేశారు. కష్టకాలంలో పార్టీని వీడి సొంత లాభం చూసుకున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీని గుండెలకు హత్తుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచారు. అధినాయకత్వంపై నమ్మకం ఉంచారు. అలాగే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకే పెద్ద పీట. కార్యకర్తల విశ్వాసాన్ని కోల్పోయిన వ్యక్తులకు పార్టీలో ప్రాధాన్యత సంగతి అటుంచి ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితిని మంత్రి కొలసు పార్థ సారథి ఎదుర్కొంటున్నారు.  

కొలుసు పార్థసారథి వైసీపీ సీనియర్ నాయకుడు.   2019 నుండి 24 వరకు పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అది గతం. 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకి గుడ్ బై చ8ెప్పి తెలుగుదేశం గూటికి చేరారు. అందుకు ప్రధాన కారణం కొలసు పార్థసారథి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి ఆశించారు. అయితే జగన్ ఆయనకు కేబినెట్ లో చోటు ఇవ్వలేదు సరికదా.. 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ కూడా నిరాకరించారు.  దీంతో ఆయన జగన్ పై తిరుగుబాటు చేసి.. వైసీపీకి గుడ్ బై చెప్పి  ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.  అయితే ఆయన చేరికకు తెలుగుదేశం క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాట మన్నించి ఆయనను పార్టీలోకి అంగీకరించారు.  దీంతో తెలుగుదేశంలో ఎంట్రీ ఇచ్చిన కొలసు పార్థసారథి ఆ పార్టీ అభ్యర్థిగా  నూజివీడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతే కాకుండా చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా స్థానం సంపాదించారు. సామాజిక వర్గాల సమీకరణల్లో భాగంగా ఆయనకు కేబినెట్ బెర్త్ దొరికింది.   అయితే మంత్రిగా ఆయన వ్యవహారశైలి పట్ల, మరీ ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన క్యాడర్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా, వైసీపీ నుంచి తనతో పాటుగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తుండటం పార్టీ క్యాడర్ లో అసంతృప్తి జ్వాలలు రగలడానికి కారణమైంది. ఈ విషయాన్ని పలు మార్లు పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి కూడా వెళ్లింది.   తెలుగుదేశం సీనియర్ నాయకులను పరిగణనలోకి తీసుకోలేదని కూడా కొలసు పార్థసారథిపై పార్టీ క్యాడర్ లో అసంతృప్తి ఉంది. ఈ తరుణంలో ఆయన ఒక కార్యక్రమంలో వైసీపీ నాయకుడు  జోగి రమేష్‌తో వేదిక పంచుకోవడం పెద్ద రచ్చకు దారి తీసింది.

మూడేళ్ల కిందట  చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడి కేసులో ఏ1గా ఉన్న జోగి రమేష్‌తో కొలసు పార్థ సారథి వేదిక పంచుకోవడాన్ని తెలుగుదేశం క్యాడర్ సహించలేకపోతున్నారు. ఈ కార్యక్రమంలో గౌతు శిరీష కూడా పాల్గొన్నప్పటికీ.. ఆమె పార్టీ క్యాడర్ కు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో జోగు రమేష్ పాల్గొంటారన్న సమాచారం తనకు తెలియదని పేర్కొననారు. అయితే కొలసు పార్థసారథి కూడా క్షమాఫణలు తెలిపినప్పటికీ తెలుగుదేశం క్యాడర్ లో ఆయనపై ఆగ్రహం చల్లారలేదు. ఆయన చాలా రొటీన్ గా జోగు రమేష్ తో వేదిక పంచుకోవడంపై ఓ ప్రకటన చేసి చేతులు దులిపేసుకున్నారన్న భావనే పార్టీ క్యాడర్ లో వ్యక్తం అవుతోంది.  మంత్రి కొలసుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.