పీకేకు పరిటాల గుండు కొట్టించారా? చేసిందెవ‌రు? చేయించిందెవ‌రు?

అది టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయం. చంద్రబాబు నాయుడు దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా జేజేలు అందుకుంటున్న రోజులు.. చంద్రబాబుకు అంతర్జాతీయంగా ఇమేజ్ వస్తున్న కాలం.. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఓ రేంజ్ లో వెలిగిపోతున్నారు. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి సూపర్ డూపర్ సినిమాలతో టాలీవుడ్ ను ఊపేస్తున్నారు. అప్పుడు చిరంజీవి ఎక్కడికెళ్లినా లక్షలాది మంది జనం వచ్చేవారు. రాజకీయాల్లోకి రావాలంటూ నినాదాలు చేసేవారు. 

ఆ సమయంలోనే  2004 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2003లో ఓ బాంబ్ లాంటి వార్త వచ్చింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, కీలక నేతగా ఉన్న ఓ నేతకు.. సినిమాల్లో సూపర్ హిట్లు కొడుతున్న మెగా ఫ్యామిలీకి  మధ్య గొడవ జరిగినట్లుగా వచ్చిందా వార్త. కాంగ్రెస్ పార్టీకి కరపత్రంగా ఉండే అప్పటి రాజ్యసభ సభ్యులు తిక్కవరపు వెంకట్రామిరెడ్డికి చెందిన  డెక్కన్ క్రానికల్ పత్రిక.. మంచి మసాలా దట్టించి ప్రచురించింది ఆ కథనాన్ని. మెగా కుటుంబానికి  చెందిన హీరో ప‌వ‌న్‌ కల్యాణ్‌కు మంత్రి ప‌రిటాల ర‌వి గుండు కొట్టించార‌న్న ఆ వార్త.. అప్పట్లో సంచలనమైంది. 

పరిటాల రవి పేరు చెబితేనే అప్పుడు అంతా గజగజలాడేవారు. అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయారు పరిటాల. పేదల పాలిట పెన్నిదిగా ఎదిగారు. పీపుల్స్ వార్ భావజాలంతో ఎదిగిన పరిటాల రవి.. పేదల కోసమే పని చేశారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడారు. అందుకే ఆయనకు లక్షలాది మంది మద్దతుగా నిలిచారు. జనాల గుండెల్లో పరిటాల ఎంతగా నిలిచిపోయారంటే.. ఆయన హత్యకు గురై 16 ఏండ్లు అవుతున్నా.. ఇప్పటికి ఆయన జయంతి, వర్థంతి రోజున వెంకటాపురంలోని ఆయన సమాధి వద్దకు లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చి నివాళులు అర్పిస్తారు. రాబిన్ హుడ్ లా ప్రజల గుండెల్లో చోటు సంపాదించిన పరిటాల రవికి.. మెగా హీరో కుటుంబానికి గొడవ ఉందన్నట్లుగా వచ్చిన ఆ డెక్కన్ క్రానికల్ కథనం పెను సంచలనమైంది. రాజకీయాలను షేక్ చేసింది. 

ఇంత‌కీ ఆనాడు అస‌లేం జ‌రిగింది? పీకేకు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించారా? ఎందుకు కొట్టించారు? వారిద్ద‌రికీ గొడ‌వ జ‌రిగిన మాట నిజ‌మేనా? అనుకోకుండా అలా ర‌చ్చ జ‌రిగిందా? లేక‌  కావాల‌నే వివాదం సృష్టించారా? ఇంత‌కీ ఆ ప్రొప‌గాండ చేసిన వారి టార్గెట్ ప‌వ‌న్‌క‌ల్యాణా? ప‌రిటాల ర‌వినా? లేక‌, చంద్ర‌బాబు నాయుడా? అప్ప‌టి ఇంట్రెస్టింగ్ పొలిటిక‌ల్ లిటిగేష‌న్.. ప‌రిటాల ర‌వి జ‌యంతి సంద‌ర్భంగా మ‌రోసారి ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది.

మెగాస్టార్ చిరంజీవీతో పాటు 2003లో వ‌రుస హిట్స్‌తో మాంచి ఊపు మీదున్నారు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. స‌డెన్‌గా ఓ రోజు టీవీల్లో థ‌మ్స్అప్ యాడ్‌లో గుండుతో క‌నిపించారు పీకే. అంతే ఒక్క‌సారిగా అంతా షాక్‌. అదేంటి.. ప‌వ‌ర్ స్టార్ ఏంటి.. గుండు చేయించుకోవ‌డం ఏంట‌ని అంతా అవాక్క‌య్యారు. క‌ట్ చేస్తే.. ప‌రిటాల ర‌వితో ప‌వ‌న్‌క‌ల్యాణ్ గొడ‌వ ప‌డ్డార‌ని.. అందుకే ప‌రిటాల పీకేకి గొండు కొట్టించార‌ని.. ఆ గుండు ర‌వి చేయించిందేనంటూ డెక్కన్ క్రానికల్ లో  కొన్ని రోజుల తర్వాత వార్త వ‌చ్చింది. ప‌రిటాల‌-చిరంజీవి మ‌ధ్య ఓ ల్యాండ్ మేట‌ర్‌లో వివాదం నెల‌కొన‌గా.. పీకే జోక్యంతో విష‌యం గుండు వ‌ర‌కూ దారి తీసిందంటూ.. దిట్టంగా మ‌సాలా ద‌ట్టించి.. వండి వార్చింది. ఆ న్యూస్‌తో అంతా షేక్‌. పీకే గుండుకంటే.. క‌ల్యాణ్‌బాబును ప‌రిటాల ర‌వి కొట్టించాడ‌ని, గుండు కూడా చేయించాడ‌నే న్యూస్ తెగ వైర‌ల్ అయింది. యావ‌త్ రాష్ట్రాన్ని షేక్ చేసింది. ఏళ్ల త‌ర‌బ‌డి ఆ టాపిక్‌పై చ‌ర్చ..ర‌చ్చ‌ జ‌రిగింది. 

ప‌వ‌న్‌క‌ల్యాణ్  ఆనాటి గుండు ఎపిసోడ్‌పై పరిటాల రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. పవన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. కాని నిజం కంటే అబద్దాన్నే జనాలు తొందరకు నమ్మేస్తారన్నట్లుగా.. పీకే గుండు విషయంలోనూ అబద్దమే ఎక్కుగా ప్రచారమైంది. ఆ తర్వాత ఆ గుండు మేట‌ర్ వెనుక అస‌లు సూత్ర‌ధారి, పాత్ర‌ధారి వేరే ఉన్నార‌నే విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదంతా అప్పటి కాంగ్రెస్ నేతలు.. పక్కా ప్లాన్ ప్రకారం టీడీపీ మీద, చంద్ర‌బాబు మీద చేయించిన‌ కుట్ర‌, కుతంత్ర‌మ‌న్న సంగ‌తి తేలింది. 

పరిటాల రవీంద్ర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన కమ్మ కులానికి చెందిన వారు కాగా.. పవన్ కల్యాణ్ కాపు కులానికి చెందిన వారు. 1988లో జరిగిన వంగవీటి హత్య తర్వాత కాపులంతా టీడీపీకి దూరమయ్యారు. నిజానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తర్వాత కాపులంతా ఆయన వెంటే నిలిచారు. కాపుల సంపూర్ణ మద్దతు వల్లే 1983,85లో టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. అందుకే టీడీపీకి కాపులను దూరం చేయాలనే కుట్రలో భాగంగానే వంగావీటి రంగా హత్య జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి కుట్రలో భాగంగానే 1988 తరహాలోనే  రెండు బలమైన సామాజిక వర్గాల మధ్య కక్షలు భగ్గుమనేలా చేయాలనే కుట్రలో భాగంగానే .. ప‌వ‌న్‌ కల్యాణ్‌కు మంత్రి ప‌రిటాల ర‌వి గుండు కొట్టించార‌నే కథనాన్ని అప్పుడు కాంగ్రెస్ ఎంపీకగా ఉన్న వెంకట్రామిరెడ్డికి చెందిన డెక్కన్ క్రానికల్ లో ప్రచురించారు.  

1988  టీడీపీకి దూర‌మైన కాపులు.. నిజం తెలుసుకున్న తర్వాత  1994 ఎన్నికల్లో మళ్లీ టీడీపీకి మద్దతుగా వచ్చారు. 1995లో చంద్ర‌బాబు సీఎం అయ్యాక..  సీబీఎన్ ప‌రిపాల‌న‌ ద‌క్ష‌త చూసి.. కాపు వ‌ర్గం టీడీపీకి బ‌ల‌మైన‌ మ‌ద్ద‌తుదారులుగా మారారు. ఆ అభిమానం అలా కొన‌సాగుతూనే వ‌చ్చింది. దీంతో టీడీపీకి ద‌న్నుగా ఉన్న కాపుల‌ను ఆ పార్టీ నుంచి దూరం చేయాల‌ని క‌న్నింగ్ స్కెచ్ వేశార‌ట అప్పటి కాంగ్రెస్ నేతలు. అందుకు పావుగా..  అప్పుడు సినిమాల్లో మంచి హిట్ లు కొడుతున్న.. కాపుల‌కు రోల్‌మోడ‌ల్‌గా ఉన్న మెగా ఫ్యామిలీని వారి ప్ర‌మేయం లేకుండానే వాడేసుకున్నారని తెలుస్తోంది. టీడీపీ వారికి, మెగా బ్ర‌ద‌ర్స్‌కు గొడ‌వ‌లున్నాయ‌నే ప్ర‌చారం రేపి.. కాపులను తెలుగుదేశానికి దూరం చేయాల‌నే ప‌న్నాగం ప‌న్నార‌ట‌. అందులో భాగంగా.. గ‌తంలో ఎప్పుడో గుండుతో క‌నిపించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను.. కొత్తగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారట. 

అప్పటి కాంగ్రెస్ పెద్దల పక్కా ప్లాన్ లో భాగంగానే పీకే గుండుకు మ‌సి పూసి మారేడు కాయ చేశారు. ఆనాటి పీకే గుండుకు.. ప‌రిటాల ర‌వినే కార‌ణ‌మ‌ని.. లేని వివాదాన్ని కొత్త‌గా సృష్టించారు. అప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ ప్ర‌స్తావించ‌ని ఆ క‌థ‌ను.. వ్యూహాత్మ‌కంగా.. త‌న ప్ర‌ధాన అనుచ‌రుడి ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నంగా వ‌చ్చేలా చేశారు. అంతా కలిసి పీకే గుండుపై అగ్గిపుల్ల గీచి.. ప‌రిటాల ర‌విపై ప‌డేశారు. ఆ మంట‌పై  కాంగ్రెస్ నేత అనుచ‌ర‌వ‌ర్గ‌మంతా త‌లా ఇంత పెట్రోల్ చ‌ల్ల‌డంతో.. అది భ‌గ్గున మండి.. పెద్ద రాజ‌కీయ ర‌చ్చే రాజుకుంది. పవన్ కు అవమానం జరిగితే.. మెగా అభిమానులైన కాపులు తమకే అవమానం జరిగినట్లుగా ఫీలై.. టీడీపీపై ర‌గిలిపోయి, ఆ పార్టీకి దూర‌మ‌వ్వాల‌నేది ఆనాటి కాంగ్రెస్ పెద్దల స్కెచ్‌. పొలిటిక‌ల్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ క‌ల్పిక అబాంఢానికి.. క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ బాధ్య‌త‌ల‌న్నీ ఆనాటి కాంగ్రెస్ పెద్దలే వ‌హించార‌ని చెబుతారు. వైఎస్సాఆర్ ప్రధాన అనుచరుడిగా ఉంటూ, మీడియాలో తెగ హడావుడి చేసే ఓ నేతే కనుసన్నల్లోనే ఇదంతా నడిచిందని అంటారు. 

త‌న‌కు, ప‌రిటాల ర‌వితో ఎలాంటి గొడ‌వా లేద‌ని, త‌న గుండుకు ర‌వికి ఎలాంటి సంబంధం లేద‌ని..  2018లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్వయంగా బ‌య‌ట‌పెట్టారు. ఆ విష‌యం ప‌రిటాల సునీత‌కు పీకేనే స్వ‌యంగా వివ‌రించార‌ు. ఆగ‌స్టు 30 ప‌రిటాల ర‌వి జ‌యంతి సంద‌ర్భంగా ఆనాటి పీకే గుండు వివాదం తాజాగా చ‌ర్చ‌కొచ్చింది. రాజకీయ లబ్ది కోసమే నాయకులు.. కులాల మధ్య కుంపట్లు పెట్టడానికి ఎలాంటి కుట్రలు చేశారో తెలుసుకోవడానికి పరిటాల రవీంద్ర, పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఉదాహరణగా నిలుస్తోంది..