బుర్ర లేని సచ్చు వెదవల సలహాలు.. దిక్కుమాలిన సూత్రాలన్న వైసీపీ ఎంపీ..

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట‌లు అగ్గి రాజేస్తున్నారు. ఓవైపు అమ‌రావ‌తి కోసం 600 రోజులుగా రాజ‌ధాని రైతులు ఉద్య‌మిస్తుంటే.. అక్క‌డి ద‌ళిత రైతుల‌పై బొత్స చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత క‌ల‌క‌లం రేపుతున్నాయి. స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అమ‌రావ‌తి రైతులు తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. తక్షణం తన వ్యాఖ్యలను మంత్రి ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మంత్రి మాటలతో ఆవేదన చెందామని రాజధాని దళిత రైతులు అంటున్నారు. బొత్సపై ఎస్సీ, ఎస్టీ, చీటింగ్‌ కేసు నమోదు చేయాలని దళిత జేఏసీ డిమాండ్ చేసింది.

ఇక‌, మంత్రి బొత్స సత్యన్నారాయణ మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. రాజధాని అంశంలో మంత్రి బుద్ధిలేని, మతిలేని ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. బుర్ర లేని సచ్చు వెదవల సలహాలతోనే ఇలాంటి పరిస్థితులు దాపురించాయన్నారు. పనికిమాలిన, దిక్కుమాలిన సూత్రాలు చెప్పవద్దని మంత్రి బొత్సాకు సూచించారు. మంత్రి అనుకున్నట్లు రాజధాని విశాఖ వెళ్ల‌డం అయ్యే పని కాదన్నారు. రాజధాని తరలించాలంటే సుమారు రూ. 90 వేల కోట్ల పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని రఘురామ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని రఘురామ స్ప‌ష్టం చేశారు. మంత్రి బొత్స మాటలు పట్టించుకోవద్దని అమరావతి రైతులు, మహిళలను కోరారు. సీఎం జగన్ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా మంత్రి ఇలానే మాట్లాడుతుంటారని అన్నారు.

ఏపీలో రోడ్ల పరిస్థితి గేదెల కోసం స్విమ్మింగ్ పూల్స్ కట్టినట్లు ఉందని ఎంపీ ర‌ఘురామ‌ ఎద్దేవా చేశారు. 25 కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం రూ. 12 వేల కోట్లు ఇస్తే.. రాష్ట్రం మరో రూ. 6 నుంచి 7 వేల కోట్లు మార్జిన్ మనీ కలిపి ఇవ్వాలని, ఆ డబ్బుల కోసం ఎస్‌బీఐ నుంచి అప్పుగా తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలా చేయడం ఎఫ్‌ఆర్‌బిఎం నిభందనలు ఉల్లంగించడమేనన్నారు. నవరత్నాలను అమలు చేస్తున్నామని చెప్పుకునేందుకు కార్పొరేషన్‌లకు నిధులు మళ్లించి ఖర్చు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రంలో ఒక ఆర్థిక మంత్రి, ఢిల్లీలో మరో ఆర్థిక మంత్రి ఉండవలసిన పరిస్ధితులు ఏర్పడ్డాయంటూ మండిప‌డ్డారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.