పోసాని విడుదలకు సీఐడీ బ్రేక్.. మరి కొంత కాలం కటకటాల్లోనే!

పోసాని బెయిలు, విడుదల వ్యవహారం సినీమాను తలపించే మలుపులతో ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఆయన కర్నూలు జైలు నుంచి బుధవారం (మార్చి 12) విడుదల కావాల్సి ఉంది. కోర్టు బెయిలు లభించడంతో పోసాని విడుదల లాంఛనమే అని అంతా భావించారు. ఎందుకంటే పోసానికి ఇప్పటికే నాలుగు కేసులలో బెయిలు లభించింది. మరో నాలుగు కేసులలో కోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. దీంతో అన్ని లాంభనాలూ పూర్తి చేసుకుని పోసాని విడుదల అవుతారని అంతా భావించారు.

అయితే అనూహ్యంగా సీఐడీ రంగంలోకి దిగింది. పీటీ వారంట్ లో సీఐడీ పోలీసులు కర్నూలు జైలుకు వెళ్లి ఆయనను కస్టడీకి తీసుకున్నారు. దీంతో పోసాని బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఒక వేళ ఈ కేసులో బెయిలు వచ్చినా మొత్తం రాష్ట్రంలో పోసానిపై 16 కేసులు నమోదై ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటిగా పీటీ వారంట్లతో పోలీసులు ఆయన పిల్లి పిల్లలను తిప్పినట్లు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పడం ఖాయమని అంటున్నారు. అధికారం అండ చూసుకుని నోటికి అడ్డూ అదుపూలేకుండా వాగిన వాగుడుకు పోసాని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది.   బెయిలు వచ్చినా విడుదల కాలేని పరిస్థితిలో ఉన్న పోసానిపై రాష్ట్రంలో ఏ వర్గం నుంచీ సానుభూతి వ్యక్తం కావడం లేదన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా పోసాని కృష్ణ మురళి ఇప్పుడప్పుడే కటకటాల నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదని అంటున్నారు.  

జగన్ హయాంలో పోసాని ఇష్టారీతిగా అసభ్య పదజాలంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ పైనా, వారి కుటుంబ సభ్యులపైనా విరుచుకుపడ్డారు. అందుకు సంబంధించి పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా  16 కేసులు నమోదైన సంగతి విదితమే. వీటిలో అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లెలో నమోదైన కేసులో రాజంపేట పోలీసులు   గత నెలలో  పోసానిని హైదరాబాద్ లోని మైహోం భూజా అపార్ట్ మెంట్  లో  అదుపులోనికి తీసుకున్నారు. ఆ తరువాత కోర్టు ఆదేశాల మేరకు రాజం పేట జైలుకు తరలించారు. అక్కడ నుంచి నరసరావు పేట పోలీసలు, ఆ తరువాత గుంటూరు, అటు పిమ్మట ఆదోని పోలీసులు పీటీ వారంట్లతో పోసానిని కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోసానికి రాజంపేట, నరసరావుపేట, గుంటూరు, తాజాగా కర్నూలు కోర్టులలో బెయిలు మంజూరైంది. ఇక విడుదల లాంఛనమే అనుకుంటున్న సమయంలో సీఐడీ పోలీసులు ఎంటరయ్యారు. పీటీ వారంట్ తో అదుపులోనికి తీసుకుని గుంటూరు తరలించారు.