సోము నామినేషన్ దాఖలుకు లోకేష్ దూరం.. క్యాడర్ కు ఒకింత ఉపశమనం!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో సోము వీర్రాజుకు బీజేపీ కోటాలో టికెట్ దొరకడం తెలుగుదేశం వర్గాలలో తీవ్ర అసహనాన్ని నింపింది. పార్టీ అధినాయకత్వం మెతక ధోరణి పట్ల తీవ్ర ఆగ్రహమూ వ్యక్తం అయ్యింది.  తొలి నుంచీ ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించి మిగిలిన నాలుగు స్థానాలకూ తెలుగుదేశం అభ్యర్థులు రంగంలోకి దిగుతారని అంతా భావించారు. తెలుగుదేశం అధిష్ఠానం కూడా అలాగే భావించింది. జనసేనకు కేటాయించిన స్థానంలో నాగబాబు పోటీ చేస్తారనీ, ఆ తరువాత ఆయనను చంద్రబాబు కేబినెట్ లోకి తీసుకుంటారని దాదాపు ఖరారైపోయింది. అయితే చివరి నిముషంలో బీజేపీ రంగంలోకి దిగి ఒక స్థానానికి పట్టుబట్టింది. పొత్తు ధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని తెలుగుదేశం బీజేపీకి త్యాగం చేయాలని భావించింది. అందుకు తెలుగుదేశం నేతలు, శ్రేణుల నుంచి కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆ స్థానానికి బీజేపీ హైకమాండ్ సోము వీర్రాజును ఎంపిక చేసిందో.. ఆ క్షణం నుంచీ తెలుగుదేశం శ్రేణులు రగిలిపోయాయి.  

క్యాడర్ ఆగ్రహాన్ని, అసంతృప్తినీ, ఆవేదననూ అర్ధం చేసుకున్న మంత్రి లోకేష్.. సోము వీర్రాజు నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసి శ్రేణులకు ఒకింత ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించారు. ఆయన ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది కూడా. 

ఔను కూటమి తరఫున ఐదు ఎమ్మెల్సీ స్థానాలకూ నామినేషన్లు దాఖలయ్యాయి. తొలుత కొద్ది రోజుల ముందే జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబు తన నామినేషన్ దాఖలు చేశారు. ఆ కార్యక్రమానికి నారా లోకేష్ హాజరయ్యారు. నాగబాబుతో పాటు ఆయనా ఉన్నారు.  ఆ తరువాత తెలుగుదేశం తరఫున ముగ్గురు అభ్యర్థులు బీద రవిచంద్రయాదవ్, బీటీ నాయుడు, కావలి గ్రీష్మలు మంగళవారం (మార్చి 11) నామినేషన్లు దాఖలు చేశారు. వారి నామినేషన్ దాఖలు కార్యక్రమానికీ లోకేష్ హాజరయ్యారు.  ఆ తరువాత మంగళవారం (మార్చి 11) ఇక నామినేషన్ దాఖలుకు గడువు ముగిసిపోతున్నదనగా ఐదో స్థానానికి సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేశారు.

అయితే ఆ కార్యక్రమానికి మాత్రం లోకేష్ హాజరు కాలేదు. తద్వారా సోముకు ఎమ్మెల్సీకి తాను పూర్తి వ్యతిరేకిననీ, కానీ మిత్రధర్మంలో భాగంగా అనివార్యంగానే అందుకు పార్టీ హైకమాండ్ అంగీకరించాల్సి వచ్చిందనీ చాటారు. సోము నామినేషన్ కార్యక్రమానికి హాజరు కాకుండా దూరంగా ఉన్న లోకేష్,  ఆసమయంలో సెక్రటేరియెట్ లోనే ఉన్నారు. కానీ సోము నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని అవాయిడ్ చేయడం ద్వారా సోము అభ్యర్థిత్వానికి తాను వ్యతిరేకమన్న స్పష్టమైన సంకేతాన్ని పార్టీ క్యాడర్ కు ఇచ్చారు.  ఇది కొంత వరకూ తెలుగుదేశం క్యాడర్ లోనిఅసంతృప్తి, ఆగ్రహ జ్వాలలను ఒకింత చల్లార్చిందనడంలో సందేహం లేదు.