ఇప్పుడిక చెవిరెడ్డి వంతు!
posted on Mar 12, 2025 2:28PM
.webp)
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా రెచ్చిపోయి నింబంధనలకు తిలోదకాలిచ్చి దోపిడీ, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన ఒక్కొక్కరిని ఇప్పుడు చట్టం ముందు నిలబెట్టి శిక్ష పడేలా చేయడానికి రంగం సిద్ధమైపోయినట్లే కనిపిస్తోంది. దౌర్జన్యాలు, దోడిపీలు, నిబంధలన ఉల్లంఘనలకు యథేచ్ఛగా పాల్పడి, సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలు, ఆ పార్టీ నాయకులపై ఇష్టారీతిగా పోస్టులు పెట్టిన వారు ఒకరి తరువాత ఒకరుగా కటకటాల పాలౌతున్నారు. బోరుగడ్డతో మొదలెడితే.. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళిలు ఇప్పటికే కటకటాలు లెక్కిస్తుంటే.. రామ్ గోపాల్ వర్మ వంటి వారి కోర్టులను ఆశ్రయించి తాత్కాలిక ఉపశమనం పొందారు. ఇప్పుడిక చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంతు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత ఏడాది ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ నమోదైన కేసులో పోలీసులు చెవిరెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి చెవిరెడ్డిపై ఐదు కేసులు నమోదయ్యాయి. తాజాగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు కోడ్‌ను ఉల్లంఘించారని చెవిరెడ్డి మీద కేసు నమోదు చేశారు. చెవిరెడ్డికి నోటీసులు బుధవారం (మార్చి 12) నోటీసులు జారీ చేశారు.
గత ఎన్నికలలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో చెవిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎర్రగొండ పాలెం పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఎర్రగొండ పాలెం పీఎస్ లో మూడు కేసులు, అలాగే వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కోడ్‌ను చెవిరెడ్డి ఉల్లంఘించారని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారివీరుడులో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖను చెవిరెడ్డి బెదిరించారన్న కేసు కూడా ఉంది. తమకు అనుకూలంగా పని చేయడం లేదంటూ చెవిరెడ్డి ఎర్రగొండపాలెం ఆర్వో శ్రీలేఖ మీద బెదిరింపులకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.
ఈ ఐదు కేసులకు సంబంధించి తాజాగా ఎర్రగొండపాలెం పోలీసులు చెవిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్న వేళ చెవిరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇప్పుడిక చెవిరెడ్డి వంతు అన్న భావన వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తం అవుతోంది.