జగన్ కు ఇచ్చి పడేసిన విజయసాయి!?

వైసీపీ భయమే నిజమైంది. ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆ పార్టీ ఆబోరు గంగలో కలిసింది. కాకినాడ పోర్టు షేర్ల బదిలీ కేసులో విజయవాడలో సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి బుధవారం (మార్చి 120 హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తనను ఉద్దేశించి భయం, ప్రలోభాలు, విశ్వసనీయత అంటూ చేసిన వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు. తాన రక్తంలోనే భయంలేదన్నారు. తాను ప్రలోభాలకు లొంగలేదన్నారు, విశ్వసనీయత లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. జగన్ చుట్టూ చేరిన కోటరీ వల్లే తనకూ ఆయనకు మధ్య అగాధం ఏర్పడిందని   వైరాగ్యం ప్రదర్శిస్తూనే జగన్ పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మంచోడే  అంటూనే  ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించారు. 

 రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన విజయసాయిరెడ్డి నోటి వెంట వచ్చింది మాత్రం రాజకీయమే.  వైసీపీకి భవిష్యత్ లేదని చెబుతూనే.. జగన్ కోటరీని దాటి బయటకు వస్తే భవిష్యత్ ఉంటుందన్నారు. కాకినాడ పోర్టు విషయంలో కానీ, మద్యం కుంభకోణంలో కానీ జగన్ పాత్ర లేదని అంటూనే...కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో కర్తకర్మక్రియ అంతా జగన్ సమీప బంధువు, వైసీపీ సీనియర్ నాయకుడు వైవీసుబ్బారెడ్డి పుత్రరత్నమేనని కుండబద్దలు కొట్టేశారు. అలాగే మద్యం కుంభకోణం అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పుణ్యమేనన్నారు. పరిశీలకులు మాత్రం ఇలా చెప్పడం ద్వారా ఆయన జగన్ ను నిండా ఇరికించేసినట్లేనని విశ్లేషిస్తున్నారు. తాను రాజకీయం వదిలేసి సేద్యం చేసుకుంటున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి, భవిష్యత్ లో వైసీపీలో చేరే ప్రసక్తే లేదని చెప్పడం ద్వారా కమలం గూటికి చేరే అవకాశాలకు తలుపులు తెరిచే ఉంచానని చెప్పకుండానే చెప్పారు.   విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ విచారణ పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడారు.  ఆ సందర్భంగా ఆయన కేసు గురించి కంటే ఎక్కువగా రాజకీయాల గురించే మాట్లాడారు. 

వైసీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్న ఆయన అందుకు కారణం జగన్ చుట్టూ ఉన్న కోటరీయే అన్నారు. ఆ కోటరీ కారణంగానే జగన్ కూ తనకూ మధ్య అగాధం ఏర్పడిందన్నారు. వాస్తవానికి  ఒకప్పుడు జగన్ కోటరీలో విజయసాయే కీలకం. ఈ తరువాత కారణాలేమైతేనేం జగన్ కు విజయసాయి దూరమయ్యారు. తాను దిగిన ఒక్కో మెట్టూ వేరే వాళ్లకు పార్టీలో ఎదగడానికి సోపానంగా మారిందంటూ.. అన్యాపదేశంగా సజ్జలను దుయ్యబట్టారు.  ఈ సందర్భంగా విజయసాయి జగన్ కు కొన్ని సుద్దులు కూడా చెప్పారు. నాయకుడనే వారు చెప్పుడు మాటలు వినకూడదు, విన్నా నమ్మకూడదన్నారు. అలా వినడం, నమ్మడం వల్ల పార్టీ, నాయకుడు కూడా నష్టపోతాడని విజయసాయి జగన్ కు హితవు చెబుతున్నట్లు చెబుతూనే అన్యాపదేశంగా జగన్ నాయకుడే కాదని తేల్చేశారని పరిశీలకులు అంటున్నారు.  ఆయన మీడియా సమావేశంలోనే ఒక విధంగా వైసీపీని దాదాపు బట్టలూడదీసి నిలబెట్టేశారు. ఇక సీఐడీకి ఏం చెప్పి ఉంటారన్న కంగారు వైసీపీలో వ్యక్తం అవుతోంది.