స్టాలిన్ కు లోకేష్ షాక్ !
posted on Mar 12, 2025 2:14PM

ప్రాంతీయ, భాష వాదాలను రెచ్చగొట్టి, దక్షణాది రాష్ట్రాలపై తమిళ ఆధిపత్యాన్నిరుద్దేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కుగట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి మాతృ భాష ను రాజకీయం చేయడం పట్ల ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన స్టైల్లో స్పందించారు. స్టాలిన్ పేరు నేరుగా ప్రస్తావించ కుండానే మంత్రి లోకేష్, మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని సున్నితంగా చురకలు అంటించారు. ఎవరి మాతృ భాషను వారు కాపాడుకోవాలి కానీ మీరు భాషను రాజకీయం చేయడం తగదు అని కుండ బద్దలు కొట్టారు. అయినా కావాలని కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జర్మనీ, జపనీస్ భాషలు.. మన విద్యార్థులు నేర్చుకొంటున్నారని గుర్తు చేశారు. అలాంటి వేళ.. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం లో ప్రతిపాదించిన త్రిభాషా విధానం ఎలా తప్పవుతోందని మంత్రి లోకేష్ సూటిగా ప్రశ్నించారు.
నిజానికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన త్రిభాషా విధానంలో ఎక్కడా కూడా, డిఎంకే ఆరోపిస్తున్నట్లుగా హిందీని మూడవ భాషగా అమలుచేసి తీరాలనే నిబంధన లేదు. జాతీయ విద్యా విధానం ముసాయిదాలో, ఒక్క తమిళనాడు అని మాత్రమే కాదు, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ హిందీని మాత్రమే మూడవ భాషగా రుద్దే ప్రయత్నం కానీ ప్రతిపాదన కానీ లేదు. మాతృ భాష ఇంగ్లీష్ తో పాటుగా మరో భారతీయ భారతీయ భాష బోధించాలని మాత్రమే జాతీయ విద్యా విధానం ముసాయిదాలో పేర్కొన్నారు. నిజానికి స్టాలిన్ కు ఈ విషయం తెలియదని కాదు. తెలుసు, అందుకే ముందు ఓకే చెప్పి ఇప్పడు రాజకీయ అవసరాల కోసం లేని అంశాన్ని తీసుకొచ్చి వివాదం చేస్తున్నారని అంటున్నారు.
అందుకే తమిళ నాడు శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజలను రెచ్చ గొట్టేందుకు డిఎంకె చేస్తున్న అనేక ప్రయత్నాలో ఇది మరొక ప్రయత్నంగానే రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అధికార డిఎంకె ఇంత వరకు చరిత్రలో ఎప్పుడూ వరసగా రెండవ సారి విజయం సాధించలేదు. ఈ సారి కూడా అదే జరుగుతుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అందుకే ఏదో విధంగా అధికారాన్ని నిలుపుకునేందుకు అనవసర వివాదాలు సృష్టిస్తోందని విమర్శకులు అంటున్నారు.
ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రంతో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారి పోతున్నాయి. మరో వంక, తమిళిగ వెట్రి కళగం పేరిట పార్టీని స్థాపించిన విజయన్ , ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్నా డిఎంకె, ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.ఇంతవరకు, కూటమికి స్పష్టమైన రూపం రాక పోయినా, సరైన సమయంలో కూటమి ఏర్పడుతుందనే విశ్వాసం ప్రతిపక్ష నేతలు వ్యక్తపరుస్తున్నారు. మరో వంక స్టాలిన్ ప్రభుత్వం పై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు బలపడుతోంది. ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రాంతీయ వాదాన్ని, భాషా వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్, డిఎంకె నేతలు తమ ప్రభుత్వ వైఫల్యాలకు, సెంటిమెంట్ ముసుగు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిందీ భాషను ఒక భూతంగా, చూపించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేసి దక్షిణాది రాష్ట్రాల జాతీయ నేతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జయలలిత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పడు స్టాలిన్ కేంద్రం పై కాలు దువ్వడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. అయితే రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ సూపర్ స్టార్ గా తనను ఫోకస్ చేసుకునేందుకు స్టాలిన్ చేస్తున్నప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడవలసి వుంది.
విషయం గ్రహించే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు స్టాలిన్ ప్రకటనలపై ఆచితూచి స్పదిస్తున్నాయి. అయితే డిఎంకె మాత్రం పార్లమెంట్ లోపలా వెలుపల కూడా, తమిళనాడులో’ అధికారం నిలుపుకోవడంతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపై తమిళ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే లోకేష్ సరైన సమయంలో సరైన విధంగా స్పందించారు. తమిళ పప్పులు తెలుగు నాట ఉడకవని స్టాలిన్ కు షాక్ ఇచ్చారు.