కూటమిలో త్యాగం.. తెలుగుదేశానికేనా?

ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలికి కూటమి పక్షాన బీజేపీ అభ్యర్థిగా సోము వీర్రాజు ఎంపిక పట్ల మఖ్యమంత్రి చంద్రబాబు సర్దుకుపోయినట్లు కనిపించినా,  ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం ఇంకా ఆగ్రహంతోనే ఉన్నారు. అందుకు అయితేళ్ల వైసీపీ పాలనా కాలంలో వీర్రాజు తెలుగుదేశం పట్ల, ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరే కారణం. పొత్తు ధర్మంగా చంద్రబాబు చెప్పినా, ఆ పార్టీ క్యాడర్, ఆయన అభిమానులు మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. పొత్తు ధర్మం తెలుగుదేశానికేనా? బీజేపీకి, జనసేనకు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. 

కూటమిలో భాగంగా  ఒక సీటు పొందినా, అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీలు తమ ఇష్టానుసారమే నిర్ణయాలు తీసుకున్నాయి గానీ, ఎన్నికల నాడు తమ కోసం త్యాగం చేసిన వారిని జనసేన పట్టించుకోవచ్చు గదా! పోనీ మరో మిత్రపక్షం బీజేపీ, అభ్యర్థి విషయంలో కూటమిలో ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం, దాని నాయకుడు చంద్రబాబు నాయుడిని కనీస ధర్మంగాననైనా సంప్రదించాలి కదా! సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం క్యాడర్ వ్యతిరేకిస్తుందనే విషం బహిరంగ రహస్యమే కదా అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. 

ీవీరెడ్డి రాజీనామా తరువాత, సోము వీర్రాజు ఎంపిక అనేది తెలుగుదేశం వర్గాలతో పాటు, సగటు రాజకీయ విశ్లేషకులు సైతం చంద్రబాబు వేసిన రెండో తప్పటడుగు కింద భావిస్తున్నారు.  నాయకుడు ఇంత మెత్తగా ఉంటే, రేపు ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. 

అయిదు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి జనసేనకు ఇస్తారని అందరూ భావించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని తెలుగుదేశం పార్టీ ముందుగానే ప్రకటించింది. అందువల్ల పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా ఆశపెట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వర్మ కూడా పవన్ కల్యాణ్ ప్రమేయంతో అప్పట్లో అవకాశం వదులు కున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని తాజాగా అందరూ భావించారు. అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఒక అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చారు. అఖరి నిముషం వరకూ ప్రస్తావనే లేని బీజేపీ ఆఖరు నిముషంలో అయిదే సీట్లలో ఒకటి తన్నుకుపోవడంతో ఆశావహులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమకు పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ అందిందనీ, నామినేషన్ కు సమాయత్తం అవుతున్న సమయంలో బీజేపీ అభ్యర్థిత్వం ఖరారైందని అంటున్నారు. దాంతో కృష్ణా జిల్లా నాయకులు ఎవరైనా ఈ మార్పు వెనుక రాజకీయాలు నెరపారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ అనుచరులుగా చెలామణి అవుతున్న ముగ్గురు నేతలు, ఢిల్లీలో ఇద్దరు ఎంపీలు కలిసి అమిత్ షా దగ్గర బీజేపీ అభ్యర్థి సోము వీర్రాజు సీటుకు లాబీయింగ్ చేశారని ఒక ప్రచారం జరుగుతోంది.  అందుకే ఆఖరు నిముషంలో వీర్రాజు బీ ఫారం పొందడంలో కూడా హడావుడి అయ్యిందంటున్నారు. 

ఏమైతేనేమి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే ఆఖరు కాకున్నా, వచ్చిన బస్ మిస్ అయినట్లుగా భావిస్తున్న ఆశావహులు మాత్రం తమ అనుచరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారిని సమాధానపరచలేక సతమతమౌతున్నారు.