వాళ్లను పాకిస్తాన్ పంపిస్తాం.. కమలం నేతల కామెంట్లతో కలకలం
posted on Aug 30, 2021 6:57PM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర రాజకీయ కాక రాజేస్తోంది. ప్రజా సంగ్రామ్ యాత్రలో భాగంగా తొలి మూడు రోజులు హైదరాబాద్ లోనే పాదయాత్ర చేశారు సంజయ్. అది కూడా ఓల్జ్ సిటీలోనే ఆయన యాత్ర సాగింది. తొలి రోజు చార్మినార్ పరిధిలో సంజయ్ పర్యటించగా.. రెండవరోజు గోల్కోండలో సభ నిర్వహించారు. పాతబస్తీలో సాగిన బండి యాత్ర పోలీసులకు టెన్షన్ పుట్టించింది. ఇక పాతబస్తీలో జరిగిన పలు సభల్లో ప్రసంగించిన బండి సంజయ్ ఉద్వేగ ప్రసంగాలు చేశారు.
గోల్కోండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు బండి సంజయ్. హైదరాబాద్ పేరును మారుస్తామని మరోసారి ప్రకటించారు బండి సంజయ్. అంతేకాదు నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ వెనుక రహస్యం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.
బండి సంజయ్ పాదయాత్రలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంఐఎం పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఐఎం దొంగలను పాకిస్థాన్ కు పంపిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దెబ్బకు ఎంఐఎం నేతలు ఇప్పటికే జనగణమన పాడుతున్నారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం వత్తాసు పలుకుతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని... అప్పుడు ఏం చేస్తారో ఎంఐఎం నేతలు ఇప్పుడే చెప్పాలని అన్నారు. పాతబస్తీలో చార్మినార్ వద్ద సభ పెట్టామని... ఎవరూ ఏమీ చేయలేకపోయారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని రాజాసింగ్ అన్నారు.