షిండేను మెచ్చుకొన్న పాక్ తీవ్రవాది!



కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీల మద్య రాజకీయ వైరం పాక్ తీవ్రవాదికి ఆయుధంగా మారింది. రెండు రోజుల క్రితం హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ సంఘ్ పరివారం మరియు భారతీయ జనతాపార్టీలు కలిసి దేశంలో హిందూ ఉగ్రవాదుల శిక్షణ శిబిరాలు నిర్వహిస్తూ హిందూ ఉగ్రవాదులను తయారుచేస్తున్నాయని విమర్శించారు. దానికి భారతీయ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేసి, ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.


అయితే, దేశానికి హోంమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుషీల్ కుమార్ షిండే ఆ సమాచారం తనకి ఇంటలిజన్స్ నివేదికల ద్వారా వచ్చిందని చెప్పిఉంటే సాదికారంగా ఆరోపించినట్లు ఉండేది. గానీ ఆయన ఇటువంటి వార్తలన్నీ తరచూ పత్రికలలో వస్తున్నావే తానూ కూడా ప్రస్తావించానని చెప్పడం భారతీయ జనతా పార్టీ తప్పు పట్టింది.తాము ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు ఆయనను నిరూపించమంటూ సవాలు విసిరింది.కానీ, ఆ సవాలుకు షిండే కనీసం స్పందించను కూడా లేదు.అంటే, కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక రాజకీయ నాయకుడిగా భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టేందుకు ఆయన ఆవిధంగా అన్నారు తప్ప, హోం మంత్రిగా ఒక తీవ్రమయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ అంశంపై మాట్లాడలేదని అర్ధం అవుతోంది.


ఇక్కడ ఈ రెండు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొంటుంటే, పాకిస్తాన్లో ఉన్న లష్కర్ తీవ్రవాది హఫీజ్ సయీద్ లాహోరులో మీడియా వారితో మాట్లాడుతూ “ఇప్పటికయినా భారత దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లు హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే ఒప్పుకోవడం హర్షణీయం. భారతదేశంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ పాకిస్తాన్లో విద్వంసానికి పాలుపడుతున్న భారత్, అక్కడ జరిగే ప్రతీ సమస్యకీ మా దేశమే కారణం అని ఆరోపిస్తుంది,” అని అన్నాడు. మహా మేధావులయిన మన రాజకీయ నేతలు ఈ విధంగా నోరు జారుతూ చివరికి పాకిస్తాన్ తీవ్రవాదులకు కూడా మనదేశాన్ని లోకువ చేయడం విచారకరం.