అపురూప శిల్పాలని ఇంత అందంగా పరిరక్షిస్తున్నాం!
posted on Dec 18, 2024 6:27PM
పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి
నాగార్జునసాగర్ హిల్ కాలనీలో బస్టాండ్ కి వెళ్లే దారిలో గల శ్రీదేవి భూదేవి సమేత ఏలేశ్వర మాధవ స్వామి ఆలయ ప్రాంగణంలో కాకతీయుల కాలపు శిల్పకళాఖండాలు నిర్లక్ష్యంగా పడి ఉన్నాయని, వాటిని భద్రపరిచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. ఏలేశ్వర స్వామి ఆలయం వెనక 700 సంవత్సరాల నాటి భిన్నమైన నంది, ఆలయ ద్వారశాఖలు, విడిభాగాలు, ఇంకా రెండు సహస్ర లింగాలున్నాయని, వాటిని ప్రాంగణంలోనే పీఠాలపై నిలబెట్టి, చారిత్రక వివరాలతో పేరు పలకలను(లేబుల్) ఏర్పాటు చేస్తే, భక్తులు, పర్యాటకులు వాటి వివరాలు తెలుసుకునే వీలు చిక్కుతుందన్నారు.
1954-60 మధ్యకాలంలో నాగార్జునసాగర్ జలాశయ నీటి ముంపు ప్రాంతమైన ఏలేశ్వరం నుంచి వీటిని తరలించి ఇక్కడికి చేర్చారని, గత 65 ఏళ్లుగా ఇవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయని, చారిత్రక ప్రాధాన్యత గల ఈ 13వ శతాబ్ది కళాఖండాలను భద్రపరిచి, భావితరాలకు అందించాలని ఆలయ అధికారులకు, నందికొండ హిల్ కాలనీ వాసులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.