మన్మోహన్ తో సీమాంద్ర నేతలు: శ్రీకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలి
posted on Jan 22, 2013 2:10PM
ప్రధానితో మీటింగ్ అనంతరం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్ తో సమావేశం అయ్యారు. ప్రధాని దగ్గర శ్రీకృష్ణకమిటీ నివేదిక గురించే ప్రస్తావించిన కాంగ్రెస్ నేతలు ఆజాద్ తో కూడా అదే విషయంపై మాట్లాడినట్టు తెలుస్తోంది. తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలోని 6వ నిబంధన అమలు చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జి గులాంనబీ ఆజాద్ను కోరారు. దీంతో తెలంగాణ వాదుల కన్నా సమైక్యవాదులు ఒక అడుగు ముందుకేసినట్టైంది.
ఇప్పటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేవలం షిండేతో మాత్రమే మీటింగేశారు. సీమాంధ్రనేతలు వరసపెట్టి నాయకులను కలుస్తూ బిజీగా మారారు. సీమాంధ్రకు చెందిన 20 మంది మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఆజాద్ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని వారు కోరారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రం ఎందుకు కలిసి ఉండాలని తాము కోరుకుంటున్నామో ఆజాద్కు వివరించామని చెప్పారు. తమ అభిప్రాయాలు చెప్పామని, వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తాము ఊహించలేమన్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతం చేసే విషయం ఆజాద్ మాట్లాడినట్లు ఆయన తెలిపారు.