వంద సీట్లు కూడా గెలవలేని పార్టీతో పొత్తులా...

 

నిన్న కేంద్ర మంత్రి వాయలార్ రవి, రాష్ట్రంలో జగన్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం గురించి రాష్ట్ర నాయకత్వం చూసుకొంటుందని కాంగ్రెస్ మనసులో మాటను మెల్లగా బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రాసారంచేసిన ఈసిగ్నల్ని వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు మేకపాటి బాగానే క్యాచ్ చేయడమే గాకుండా, రేపు తమ పార్టీ ఏకంగా 30 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకొననపుడు, అన్నిరాజకీయ పార్టీలు తమ చుట్టూ ప్రదక్షిణం చేయక మానవని చెపుతూ, జాతీయా స్థాయిలో సెక్యులర్ పార్టీతో తమ పార్టీ పొత్తులు పెట్టుకొని, డిల్లీలో చక్రం తిప్పబోతోందని భవిష్యవాణి కూడా చెప్పారు. జాతీయ స్థాయిలో సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. గనుక, కాంగ్రెస్ పార్టీతో జగన్ పొత్తుకు సిద్ధమనే సంకేతం ఇచ్చినట్లే భావించవచ్చును. ఈ రోజు కాకపొతే రేపయినా తల్లీ పిల్లా కాంగ్రేసులు ఒకటయిపోతాయని చంద్రబాబు చెపుతున్నట్లే, రెండు పార్టీలు పావులు కదపడం ప్రారంభించాయి.

 

అయితే, మళ్ళీ కొద్ది గంటల తేడాలో అదే పార్టీకి చెందిన మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “దేశం మొత్తం మీద పోటీ చేసినా కూడా కనీసం 100 సీట్లు కూడా గెలుచుకోలేని కాంగ్రెస్ పార్టీతో పొత్తులా? అసంభవం” అని తేల్చి పారేశారు. అయితే, యస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోనప్పుడు, బీజేపీ తో కలవనప్పుడు, జాతీయ స్థాయిలో ఎవరితో కలిసి చక్రం తిప్పబోతోందో తనే చెప్పాలి.